Abn logo
Aug 3 2021 @ 00:00AM

పగబట్టి పొగబెడుతున్నారు

ఉద్యోగ ప్రదాయని ‘అమరరాజా’


  ప్రపంచ పారిశ్రామిక పఠంలో చిత్తూరు జిల్లాను సగర్వంగా నలిపిన సంస్థ అమరరాజ. విలువల వటవృక్షం రాజగోపాల నాయుడు కలలను సాకారం చేసిన పరిశ్రమ. సొంత గడ్డ రుణం తీర్చుకోవడానికి అమెరికా భవిష్యత్తును వదులుకుని వచ్చిన గల్లా రామచంద్రనాయుడు ముద్దుబిడ్డ. పదుల కోట్లతో మొదలై వందల కోట్లకు ఎదిగి, వేల కోట్ల వ్యాపారంగా విస్తరించిన ఈ బ్యాటరీల పరిశ్రమ రాజకీయ కక్షలకు బలవుతోందనే వార్త జిల్లా ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చిత్తూరు జిల్లాలో 18 వేల కుటుంబాలకు ప్రత్యక్ష ఉపాధి చూపి భరోసా ఉన్న ఈ భారీ పరిశ్రమకు పొగబెట్టి తరిమేస్తున్నారన్న  నిజనం కలవరపెడుతోంది. చక్కెర ఫ్యాక్టరీలు, సహకార పాల కర్మాగారాలు మూతబడ్డ చోట చెదరని మహావృక్షంలా నిలబడ్డ అమరరాజపై రాజకీయ ప్రతీకారాలు జిల్లా ప్రజల పాలిటే శాపంగా మారబోతున్నాయనే చర్చ సర్వత్రా జరుగుతోంది. 

35 ఏళ్ళ ప్రస్థానంలో రూ. 11 వేల కోట్ల టర్నోవర్‌


(తిరుపతి,ఆంధ్రజ్యోతి)    పూతలపట్టు మండలం పేటమిట్టకు చెందిన గల్లా రామచంద్ర నాయుడు అమెరికాలో మంచి జీవితం, అంతకు మించిన మంచి భవిష్యత్తు వున్నా సొంత జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు చేసి పదిమందికీ ఉపాధి కల్పించడం ద్వారా జన్మభూమి రుణం తీర్చుకోవాలనే ఉన్నతాశయంతో అమరరాజా పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 1985లో రేణిగుంట మండలం కరకంబాడి వద్ద ఏర్పాటు చేసిన ఈ తొలి పరిశ్రమ జిల్లా రూపురేఖలను సమూలంగా మార్చివేసింది. తర్వాత అంచెలంచెలుగా ఈ పరిశ్రమ  దిగువమాఘం, పేటమిట్ట, నూనెగుండ్లపల్లె వంటి పలుచోట్ల పారిశ్రామిక అనుబంధ యూనిట్లు నెలకొల్పడం ద్వారా పారిశ్రామికంగా జిల్లాకు, రాష్ట్రానికి కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టింది. కరకంబాడి దగ్గరున్న తొలి పరిశ్రమ, రెండవ దశలో ఏర్పాటైన దిగువమాఘం, పేటమిట్ట పరిశ్రమలను పక్కన పెడితే 2014లో ఏర్పాటు చేసిన నూనెగుండ్లపల్లె యూనిట్ల పెట్టుబడే ఇంచుమించు రూ. వెయ్యి కోట్లు. ఇంత భారీ పెట్టుబడితో జిల్లాలో మరే పరిశ్రమా ఏర్పాటు కాలేదంటే అతిశయోక్తి కాదు. 35 ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో అమరరాజా పరిశ్రమల వార్షిక టర్నోవర్‌ రూ. 11 వేల కోట్లకు చేరువ కావడం దేశ పారిశ్రామిక రంగంలో దానికున్న స్థానమేపాటిదో తేటతెల్లం చేస్తోంది.


ప్రత్యక్షంగా 16 వేల ఉద్యోగాలు.. పరోక్షంగా లక్ష మందికి జీవనోపాధి


అమరరాజా పారిశ్రామిక సంస్థ గడిచిన మూడున్నర దశాబ్దాలుగా సాగించిన ఎదుగుదల, విస్తరణ ఫలితంగా జిల్లాలో ప్రత్యక్షంగా 16 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించింది. వీరంతా రెగ్యులర్‌ ఉద్యోగులు కావడం గమనార్హం. ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు దేశంలో చాలా తక్కువగా వున్నాయి. 1985లో కరకంబాడి వద్ద అమరరాజా బ్యాటరీస్‌ పరిశ్రమ ప్రారంభం కాగా ప్రస్తుతం అక్కడ ఇండసి్ట్రియల్‌ బ్యాటరీస్‌, ఆటోమోటివ్‌ బ్యాటరీస్‌, స్మాల్‌ బ్యాటరీస్‌, లిథియం అయాన్‌ బ్యాటరీస్‌ యూనిట్లు నడుస్తున్నాయి. ఇందులో బ్యాటరీలతో పాటు పవర్‌ సిస్టమ్స్‌ అంటే ఇండస్ట్రియల్‌ ప్యానెల్స్‌, విద్యుత్‌ సబ్‌ స్టేషన్లలో వినియోగించే ప్యానెల్‌ బోర్డులు వంటివి తయారవుతున్నాయి. అలాగే విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల ఏర్పాటు, అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుళ్ళ ఏర్పాటు వంటి ప్రాజెక్టులు చేపట్టే పనులకు కూడా కరకంబాడి యూనిట్‌ కీలకంగా మారింది. ఇక్కడి యూనిట్లలో 9 వేల మంది పర్మినెంట్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక యాదమరి మండలం నూనెగుండ్లపల్లె వద్ద 2014లో ఏర్పాటైన అమరరాజా గ్రోత్‌ కారిడార్‌లో ఐదు యూనిట్లు నడుస్తున్నాయి. ఇక్కడ ఇండస్ట్రియల్‌ బ్యాటరీస్‌, ఆటోమోటివ్‌ బ్యాటరీలతో పాటు ట్యూబులర్‌ బ్యాటరీస్‌గా పిలిచే ఇన్వెర్టర్‌ బ్యాటరీస్‌ ప్లాంట్లు ఒక్కొక్కటి చొప్పున, స్మాల్‌ బ్యాటరీస్‌ యూనిట్లు రెండు కలిపి మొత్తం ఐదు యూనిట్లు నడుస్తున్నాయి. వీటిలో సుమారు 6 వేలమంది పర్మినెంటు ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరోవైపు సంస్థ అధినేత గల్లా రామచంద్రనాయుడు స్వగ్రామమైన పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన యూనిట్‌లో బ్యాటరీల తయారీకి అవసరమైన బోల్టులు, నట్లు వంటి సామగ్రి తయారవుతోంది. ఇక్కడ వెయ్యిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దాని పొరుగునే వున్న తేనేపల్లె యూనిట్‌లో స్టోరేజ్‌ సొల్యూషన్స్‌, ఇండస్ట్రియల్‌ స్టోరేజీ ర్యాక్స్‌ తయారవుతున్నాయి. ఈ యూనిట్‌లో 300 మంది ఉద్యోగులున్నారు. అలాగే సంస్థ అధినేత రామచంద్రనాయుడు సతీమణి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వగ్రామమైన తవణంపల్లె మండలం దిగువమాఘం గ్రామంలో పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడిచే అమరరాజా ఎలక్ర్టానిక్స్‌ యూనిట్‌ ఏర్పాటైంది. అందులో హోమ్‌ యూపీఎస్‌లు, ఇన్వెర్టర్లు తయారవుతున్నాయి.ఇందులో 500 మంది ఉద్యోగినులున్నారు. ఈ మొత్తం యూనిట్లలో ఉద్యోగాలు చేసే 16 వేలమందికి పైగా పర్మినెంట్‌ ఉద్యోగులకు తోడు వీటి నుంచీ ఉత్పత్తయ్యే పరికరాల రవాణా, అమ్మకాలు, ఎగుమతులు వంటి వాటి ద్వారా మరో 80 వేల మంది వరకూ వివిధ స్థాయుల్లో ఉపాధి పొందుతున్నారు. మొత్తంమీద అమరరాజా సంస్థపై ఆధారపడి లక్ష కుటుంబాలు బతుకుతున్నాయంటే అతిశయోక్తి కాదు.


99 శాతం ఉద్యోగాలు స్థానికులకే!


ప్రైవేటు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలని కొత్త విధానం ప్రవేశపెట్టామని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే రెండేళ్ళుగా ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాకపోవడంతో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అన్న ప్రభుత్వ విధానం, నినాదం ప్రకటనలకే పరిమితమైంది. అదే సమయంలో అమరరాజా సంస్థ ఉద్యోగాల్లో 99 శాతం జిల్లావాసులకే దక్కడం గమనార్హం. ప్రారంభంలో తమ స్వగ్రామాలున్న మండలాలకు, నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ తర్వాత కాలంలో జిల్లావ్యాప్తంగా అర్హులైన యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ వస్తోంది ఈ సంస్థ. కేవలం ఒక్క శాతం ఉద్యోగాలు మాత్రమే అది కూడా కీలక విభాగాల్లో పనిచేసే నిపుణులైన వారు మాత్రమే బయటి ప్రాంతాల నుంచీ వచ్చిన వారున్నారు.ఉచితంగా శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగాలు


 ఉద్యోగాలు ఇవ్వడంతోనే అమరరాజా సంస్థ ఆగిపోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో టెన్త్‌, ఇంటర్‌తో చదువాపేసి ఖాళీగా వుంటున్న నిరుద్యోగ యువతపై దృష్టి సారిస్తోంది. వారిని తమ సంస్థ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది మరీ ఉద్యోగాలు ఇస్తోంది. దీనికోసం సంస్థ అధినేత గల్లా రామచంద్రనాయుడు స్వగ్రామమైన పేటమిట్టలో అమరరాజా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ 2014లో ఏర్పాటైంది. ఇందులో నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణా కాలంలో స్టైఫండ్‌ కూడా సంస్థ అందజేస్తోంది. శిక్షణ ముగించుకున్న వారికి తమ యూనిట్లలోనే ఉద్యోగాలు కల్పిస్తోంది.ఒకో బ్యాచ్‌లో 200 నుంచీ 250 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. ఇప్పటి వరకూ 13 బ్యాచ్‌ల ద్వారా 1175 మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారు. 

కృష్ణమూర్తి

అమరరాజా నీడన నిశ్చింతగా ఉన్నాం!


నేను నా భార్య 2012 నుంచి అమరరాజా పరిశ్రమలో పనిచేస్తున్నాం. ఏ చీకూ చింత లేకుండా కుటుంబం గడవడానికి, ఇంటిల్లిపాదీ ప్రశాంతంగా వుండడానికీ కారణం ఆ పరిశ్రమే. అమరరాజా కంపెనీ ఇచ్చిన రుణంతోనే చిత్తూరులో సొంత ఇల్లు కూడా కట్టుకోగలిగాం. మా ఇద్దరు పిల్లల్ని కూడా కంపెనీ ఏర్పాటు చేసిన స్కూల్లోనే చదివించుకుంటున్నాం. ఎవరికైనా ఇంతకంటే ఏం కావాలి? అమరరాజా పరిశ్రమ నీడన నిశ్చింతగా వున్నాం.

-కృష్ణమూర్తి, భూమిరెడ్డిగారిపల్లె, యాదమరి మండలం

అమరరాజాపై వేధింపులు తిరోగమన చర్య


అమరరాజా పరిశ్రమను 35 ఏళ్ళ కిందట గల్లా రామచంద్ర నాయుడు స్థాపించారు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురి చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో వారు పొరుగు రాష్ట్రాలను వెతుక్కుని వెళ్లిపోతారు. అంటే 35 ఏళ్ళ పాటు మన రాష్ట్రం వెనక్కు మళ్లినట్లే. ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాల్లో పరిశ్రమల స్థాపనకోసం అనేక రాయితీలు ఇస్తూ పారిశ్రామిక వేత్తలను అకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. దీనికి విరుద్ధంగా రాష్ట్రంలో జరుగుతుండడం చాలా శోచనీయం. వేలల్లో ఉద్యోగాలు కల్పిస్తూ, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న పరిశ్రమల పట్ల వేధింపులు సర్వత్రా గర్హనీయం. దీన్ని కాంగ్రెస్‌ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. 

- డాక్టర్‌ సురేష్‌ బాబు, డీసీసీ అధ్యక్షుడు, కుప్పం

ప్రభుత్వ వేధింపులు తాళలేకే తరలింపు నిర్ణయం


వైసీపీ ప్రభుత్వ వేధింపులు తాళలేకే అమరరాజా పరిశ్రమ తమిళనాడు రాష్ట్రానికి తరలివెళుతోంది. వైసీపీ అధికారంలోకి రాగానే పరిశ్రమ అభివృద్ధికోసం ఇచ్చిన వందలాది ఎకరాల భూములను వెనక్కు తీసుకున్నారు. రోజూ ఏదో ఒక శాఖ  అధికారులు తనిఖీలు చేస్తూ, నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉపాధిలేక నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. ఉన్న పరిశ్రమలు కూడా ప్రభుత్వ తీరుతో ఒక్కొక్కటిగా రాష్ట్రం వదిలి వెళుతున్నాయి. అటు ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కల్పిండంలేదు. అమరరాజా ఫ్యాక్టరీ వల్ల జిల్లాలో వేలాది మంది ఉపాధిపొందుతున్నారు. ప్రభుత్వం రాజకీయం చేయాలనుకుంటుందే కాని రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడంలేదు. ఇలాంటి పరిణామాలు చూస్తుంటే భవిష్యత్‌లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైఖరి మార్చుకుని రాష్ట్రంలో పరిశ్రమలకు చేయూత నివ్వాలి, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వాతావరణం కల్పించాలి.  

-పులివర్తి నాని, టీడీపీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు

అమరరాజా ఎదుట టీడీపీ నేతల ఆందోళన

సీఎం వేధింపులవల్లే కంపెనీలు తరలిపోతున్నాయి

టీడీపీ నేత నరసింహ యాదవ్‌ 


రేణిగుంట, ఆగస్టు 3 : ముఖ్యమంత్రి జగన్‌ వేధింపుల కారణంగానే భారీపరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి పోతున్నాయని టీడీపీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహయాదవ్‌ ఆరోపించారు. రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని అమరరాజా కర్మాగారం ఎదుట మంగళవారం  ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెండేళ్ళ కాలంలో రాష్ట్రంలో ఒక భారీ పరిశ్రమను కూడా ముఖ్యమంత్రి నెలకొల్పలేకపోయారని విమర్శించారు. అమరరాజా తరలిపోతే సుమారు 20 నుంచి 30వేల కుటటుంబాలు వీధినపడే అవకాశాలున్నాయన్నారు.టీడీపీ నాయకులు మనోహరాచారి, సురేంద్ర నాయుడు, చెంగయ్య,సీపీఐ నాయకులు కేవై రాజా, యన్‌.శివ తదితరులు పాల్గొన్నారు.