ఆలయ భూముల విచారణపై రాజకీయ దుమారం

ABN , First Publish Date - 2021-06-12T05:01:26+05:30 IST

బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయ ఆస్తుల వివరాలపై దేవదాయ శాఖ ఆరా తీయడం కలకలం సృష్టిస్తోంది. రాజకీయ రంగు పులుముకుంటోంది. అనువంశిక ధర్మకర్తలుగా ఉన్న బొబ్బిలి రాజులను ఇరికించే ప్రయత్నం జరుగుతోందంటూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా చర్చ సాగింది. దేవదాయ శాఖ ఆస్తులను పరిరక్షించే చర్యలు చేపడితే తప్పేంటని అధికార పక్షం వాదనకు దిగుతోంది.

ఆలయ భూముల విచారణపై రాజకీయ దుమారం

దర్యాప్తునకు సహకరిస్తామన్న ధర్మకర్తలు

 ఆస్తుల వివరాలు పరిశీలిస్తే ఉలుకెందుకు: ఎమ్మెల్యే

(విజయనగరం- ఆంధ్రజ్యోతి/ సీతానగరం)

బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయ ఆస్తుల వివరాలపై దేవదాయ శాఖ ఆరా తీయడం కలకలం సృష్టిస్తోంది. రాజకీయ రంగు పులుముకుంటోంది. అనువంశిక ధర్మకర్తలుగా ఉన్న బొబ్బిలి రాజులను ఇరికించే ప్రయత్నం జరుగుతోందంటూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా చర్చ సాగింది. దేవదాయ శాఖ ఆస్తులను పరిరక్షించే చర్యలు చేపడితే తప్పేంటని అధికార పక్షం వాదనకు దిగుతోంది. విచారణ తీరుతెన్నులపై ‘స్వామీ.. ఈ మర్మమేమీ’ శీర్షికన ఆంధ్రజ్యోతి శుక్రవారం కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దర్యాప్తులో రాజకీయ కోణం దాగి ఉన్నట్లు ప్రజల్లో ఉన్న ప్రచారాంశాన్ని వెల్లడించింది. దీనిపై ఇటు ఆలయ ధర్మకర్తలుగా ఉన్న బేబీనాయన, అటు ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పనాయుడు వేర్వేరుగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాము దర్యాప్తును స్వాగతిస్తున్నామని బేబీనాయన అన్నారు. తాము గతం నుంచీ ఆలయ ఆస్తుల పరిరక్షణ కోసమే ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ధర్మకర్తలుగా దర్యాప్తునకు సహకరిస్తామని.. ఎవరిపైనా తాము ఎటువంటి ఆరోపణలు చేయలేదని బేబీనాయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు శుక్రవారం బొబ్బిలిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేవదాయ శాఖ భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు. వాటిని గుర్తించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మంచి పని కోసం దర్యాప్తు చేస్తే కొంత మంది ఉలికిపడుతుండటం సరికాదన్నారు. ఇప్పటికే మంత్రి బొత్స కూడా బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయ ఆస్తుల విషయంలో దర్యాప్తు చేస్తే కొంత మంది ఎందుకు ఉలికిపడుతున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. 


Updated Date - 2021-06-12T05:01:26+05:30 IST