పోలీసులపై పొలిటికల్‌ ఒత్తిడి

ABN , First Publish Date - 2022-04-24T05:51:45+05:30 IST

శాంతిభద్రతల పర్యవేక్షణలో నిజాయితీ, చిత్తశుద్ధి, పనితీరే లక్ష్యంగా పోలీసు శాఖలో ఒక్కప్పుడు పోస్టింగ్‌లు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.

పోలీసులపై పొలిటికల్‌ ఒత్తిడి

- మితిమీరుతున్న నేతల ప్రమేయం

- ఎక్కువవుతున్న రాజకీయ జోక్యం

- అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే కొందరు పోలీసులు

- వివాదాల్లో చిక్కుకుంటున్న ఖాకీలు


కామారెడ్డి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పర్యవేక్షణలో నిజాయితీ, చిత్తశుద్ధి, పనితీరే లక్ష్యంగా పోలీసు శాఖలో ఒక్కప్పుడు పోస్టింగ్‌లు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియలో ఎస్‌ఐలు, సీఐలు, డీఎస్పీల నియామక వ్యవహారాల్లో ఆ శాఖ ఉన్నతాధికారులు, ఇంటలిజెన్స్‌ ద్వారా నివేదికలు తెప్పించుకుని వారి పనితీరు ఆధారంగా పోస్టింగ్‌లు ఇచ్చేవారు. ఆ పద్ధతి పోయి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా ఉండే వారికి పోస్టింగ్‌లు కల్పించే కాలం వచ్చింది. రాష్ట్రంలోనే కాకుండా జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారిన తర్వాత అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల సిఫారస్‌ లేఖలతోనే ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీ లాంటి కీలక పోస్టుల నియామకాలు, బదిలీలు సాగుతున్నాయి. సిఫారస్‌ లేఖలు, పొలిటికల్‌ ప్రెషర్‌తో పోలీసులు వివాదాల్లో చిక్కుకుంటుండగా శాంతి భద్రతల పరిరక్షణలో అధికార పార్టీ నేతల ప్రమేయమే ఎక్కువగా ఉంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కొందరు పోలీసులైతే ప్రజల శాంతిభద్రతల కంటే ఎమ్మెల్యేలు, ఇతర అధికార పార్టీ ప్రతినిధులు పలుకుబడి ఉన్న నాయకుల కనుసన్నల్లోనే ఎక్కువగా పని చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా పలు కేసుల విషయంలో పోలీసుశాఖ అనేక విమర్శలు ఎదుర్కొంటుంది.

ఎక్కువవుతున్న రాజకీయ జోక్యం

గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి జిల్లాల పోలీసు శాఖల్లో రాజకీయ జోక్యం మితిమీరుతుందనే విమర్శలు ఉన్నాయి. నిజాయితీగా పనిచేద్దామనుకుంటున్న కొందరు పోలీసు అధికారులు కూడా పలు పరిస్థితుల దృష్ట్యా అధికార పార్టీకి మొగ్గు చూపుతున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు పోలీసుస్టేషన్‌లే వేదికగా రాజకీయాలు నడిపిస్తున్నారని కేసులు పెట్టాలన్నా ఫిర్యాదుదారుల బాధలు వినాలన్నా మొదట వారి వెనుక ఎవరేవరు ఉన్నారనే విషయం తెలుసుకున్నాకే కేసులు నమోద ు చేసే స్థాయికి వారు ప్రభావం చూపుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు ప్రత్యర్థి పార్టీలే కాకుండా సొంత పార్టీలోని వైరివర్గాల పైన తమ పలుకుబడిని ఉపయోగించి కేసుల్లో ఇరికిస్తున్నారనే  విమర్శలు వస్తున్నాయి.

అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే..

ఉమ్మడి జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే పోలీసులు పని చేస్తున్నారని ఇటీవల విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన మొదటి శ్రేణి నాయకుల నుంచి మొదలుకొని ద్వితీయ శ్రేణి నేతల వరకు పోలీసుస్టేషన్‌లే అడ్డాలుగా సెటిల్‌మెంట్‌లు, భూ దందాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైన వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిపైకేసులు పెట్టాలనే ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల కామారెడ్డి జిల్లాలోనే కాకుండా, నిజామాబాద్‌ జిల్లాలోనూ పోలీసుశాఖపై అధికార పార్టీ నేతల ప్రమేయం నెలకొనడం పోలీసు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారనే వాదన సొంత శాఖ నుంచే వినిపించడం గమనార్హం. ఒకవేళ అధికార పార్టీ నేతల మాట వినకుంటే పోస్టింగ్‌లో వేటు పడుతుందనే భయంతో పోలీసులు కూడా తల ఊపుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఎక్కడ పర్యటించినా పోలీసులు వారికి గుడ్‌మార్నింగ్‌ చెప్పి విధులు ప్రారంభించి గుడ్‌నైట్‌ వరకు వెంట తిరుగుతున్నారనే అపవాదు ఉంది. చివరకు శుభ, అశుభ కార్యక్రమాలకు వెళ్లేప్పుడు కూడా పోలీసులు వారి వెంటే ఉండడం గమనార్హం. ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావిత, సున్నితమైన ప్రాంతాల్లో, వివాదాల ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పర్యటించినప్పుడు మాత్రమే రక్షణగా ఉండే ఎస్‌ఐలు, సీఐలు, పోలీసులు ఇప్పుడు ఏకంగా ప్రతీ చిన్న పర్యటనకు కూడా కాన్వాయ్‌ల ఉంటూ ప్రత్యేక ప్రొటోకాల్‌ పాటిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితులు పోలీసుశాఖ ప్రతిష్టకు ఇబ్బందికరంగా మారుతుండడాన్ని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు, పొలిటికల్‌ ఒత్తిళ్లను పక్కన పెట్టి పనిచేస్తేనే ప్రజల మెప్పు పొందుతారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వివాదాలు, విమర్శల్లో చిక్కుకుంటున్న పోలీసులు

ఉమ్మడి జిల్లాలో ఇటీవల కాలంలో పోలీసులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఎక్కువగా అవుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు సిఫారస్‌ చేసిన వారికే ఆయా నియోజకవర్గాల్లోని పోలీసుస్టేషన్‌లకు అనుకూలమైన ఎస్‌ఐలను,సీఐలను బదిలీ చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు పోలీసు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల సిఫారస్‌లతో పోస్టింగ్‌ పొందడంతో ఆ నేతలు చెప్పే ప్రతీ పనికి తల ఉపాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో పోలీసు అధికారులు స్థానిక అధికార పార్టీ నేతలు చెప్పినట్లు చేస్తుండడంతో పలు వివాదాల్లో, విమర్శల్లో చిక్కుకుంటున్నారు. ప్రధానంగా స్థానికంగా చోటామోటా నేతలు నిర్వహించే సెటిల్‌మెంట్‌లు, భూ దందాలు, కబ్జాలు, బెదిరింపులలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆ నేతలు చెప్పిన వారిపై బలవంతంగా కేసులు పెట్టడంపై పలువురు పోలీసులు వివాదాలు, విమర్శలలో చిక్కుకుంటున్నారు. ఇలా పలువురు పోలీసు అధికారుల తీరుతో మొత్తం పోలీసుశాఖపైనే మచ్చ వస్తోంది.

Updated Date - 2022-04-24T05:51:45+05:30 IST