Jun 23 2021 @ 18:59PM

ప్రకాష్‌రాజ్‌కు ఆ రాజకీయ పార్టీ మద్దతు ఉందా?

‘మా’ ఎన్నికలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ప్రకాష్‌రాజ్‌ గురువారం హైదరాబాద్‌ రానున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత టాలీవుడ్‌ ప్రముఖులను కలిసి తనకు మద్దతు ఇవ్వమని కోరే అవకాశముందని సమాచారం. అయితే ఇప్పటికే ప్రకాష్‌రాజ్‌ టాలీవుడ్‌ బిగ్‌బాస్‌ చిరంజీవిని మద్దతు కోరారని.. దీనికి చిరంజీవి సానుకూలంగా స్పందించారని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే- ప్రకాష్‌రాజ్‌కు నాగబాబు మద్దతు తెలిపారని కూడా వెల్లడించాయి. అయితే చిరంజీవి మద్దతు వెనక ఒక రాజకీయ కోణం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. 


ప్రకాష్‌రాజ్‌కు మద్దతు ఇవ్వటానికి కేటీఆర్‌ సూత్రప్రాయంగా అంగీకరించారని.. ఈ సంకేతాలను గ్రహించిన మెగా క్యాంప్‌ ప్రకాష్‌రాజ్‌కు మద్దతు తెలుపుతోందనే వార్తలు వినబడుతున్నాయి. కేంద్రంలోని మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రకాష్‌రాజ్‌ చాలా కాలంగా పోరాడుతున్నారు. మోదీ సర్కారు కోవిడ్‌ నియంత్రణకు సరైన చర్యలు తీసుకోలేదని ఆయన అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో మోదీ సర్కారుకు వ్యతిరేకంగా బుధవారం విపక్ష నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌  నేరుగా పాల్గొనకపోయినా- బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరులో విపక్షాలకు మద్దతు తెలిపే అవకాశముంది. ఇలా జాతీయ స్థాయిలో పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ప్రకాష్‌రాజ్‌కు మద్దతు ఇవ్వటం తమకు కొంత లాభిస్తుందని టీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోందనేది విశ్లేషకుల భావన. అంతేకాక తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఓ గ్రామాన్ని ప్రకాష్‌ రాజ్‌ దత్తత తీసుకుని.. ఆ గ్రామానికి అన్ని సదుపాయాలు సమకూర్చారు. ఈ విషయంలో కూడా ప్రకాష్‌ రాజ్‌పై టీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టే అవకాశం ఉందనేలా కూడా వార్తలు వినబడుతున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకునే.. ప్రకాష్‌ రాజ్‌కు టీఆర్‌ఎస్‌ సపోర్ట్‌ ఉంటుందనేలా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అంతేకాకుండా చిరంజీవికి సంబంధించి మరొక వార్త కూడా వైరల్‌ అవుతోంది. అదేంటంటే.. గతంలో మోహన్‌బాబుకు చిరంజీవికి మధ్య కొంత గ్యాప్‌ ఉండేది. ఈ మధ్యకాలంలో ఇది తగ్గుతూ వచ్చింది. వీరిద్దరూ కలిసి సిమ్లా కూడా వెళ్లివచ్చారు. అయితే మోహన్‌బాబుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ బంధువు అవుతారు. అంతే కాకుండా మోహన్‌బాబు వైసీపీకి మద్దతు కూడా ఇచ్చారు. లాక్‌డౌన్‌ 1 తర్వాత- థియేటర్లను తెరిచే సమయంలో కొన్ని వెసులుబాట్లను కల్పించాలని టాలీవుడ్‌ ప్రముఖులు జగన్‌ను కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినా.. వకీల్‌సాబ్‌ సినిమా విడుదలయ్యే ముందు టిక్కెట్టు ధరలను, బెనిఫిట్‌ షోలను నియంత్రిస్తూ ఆంధ్ర సర్కారు ఓ జీవోను విడుదల చేసింది. దీనితో వకీల్‌సాబ్‌ కలెక్షన్లకు కొంత నష్టం జరిగింది. పవన్‌కళ్యాణ్‌తో ఉన్న రాజకీయ వైరుధ్యాల నేపథ్యంలో దీనిని విడుదల చేశారని అందరూ భావించారు. కానీ ఇప్పటికీ ఆ జీవో అమలులోనే ఉంది. తెలంగాణలో ఎటువంటి ఆంక్షలూ లేవు. ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లను ఓపెన్‌ చేసిన తర్వాత విడుదలయ్యే పెద్ద సినిమాల కలెక్షన్లకు ఈ జీవో అడ్డంకిగా మారే అవకాశముంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మంచువిష్ణుకు చిరంజీవి క్యాంప్‌ మద్దతు ఇచ్చే అవకాశం తక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత మూడు రోజులుగా విష్ణు పరిశ్రమలోని పెద్దలను కలవటానికి ప్రయత్నిస్తున్నారు. కృష్ణను కలిసి ఫొటోలు కూడా విడుదల చేశారు. చిరంజీవిని కలవటానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మా ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది కాబట్టి- పరిస్థితులు అనూహ్యంగా మారే అవకాశముంది.