పొలిటికల్‌ హీట్‌

ABN , First Publish Date - 2022-07-02T06:03:06+05:30 IST

ప్రధాన రాజకీయ పక్షాలు ప్రజలకు చేరువవడంపై దృష్టిసారించాయి. వరుస కార్యక్రమాలు, ఆందోళనలతో ఉనికి చాటుకుంటున్నాయి. జిల్లాలో కొద్ది రోజులుగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతోపాటు బీజేపీ, కాంగ్రెస్‌ ఇతర పార్టీలు వివిధ కార్యక్రమాలతో కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

పొలిటికల్‌ హీట్‌
వేములవాడలో కేంద్రమంత్రి కృషన్‌పాల్‌ గుజ్జార్‌ను స్వాగతిస్తున్న బీజేపీ నాయకులు

- జిల్లాలో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ 

- బీజేపీ టార్గెట్‌గా స్వరం మార్చిన మంత్రి కేటీఆర్‌ 

- ‘బండి’ సంగ్రామ యాత్రతో కదిలిన కాషాయపు దళం

 -  బీజేపీ నేతల్లో ఉత్సాహం నింపిన  కేంద్ర మంత్రులు 

- మొదలైన ఫ్లెక్సీ వివాదం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ప్రధాన రాజకీయ పక్షాలు ప్రజలకు చేరువవడంపై దృష్టిసారించాయి. వరుస కార్యక్రమాలు, ఆందోళనలతో ఉనికి చాటుకుంటున్నాయి.  జిల్లాలో కొద్ది రోజులుగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతోపాటు బీజేపీ, కాంగ్రెస్‌ ఇతర పార్టీలు వివిధ కార్యక్రమాలతో కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.  ప్రధానంగా సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో మూడు పార్టీల మధ్య పరిస్థితి ‘నువ్వా..నేనా’ అన్నట్లుగా మారిపోయింది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే హడావుడి  మొదలైంది. దీంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో వేడి మొదలైంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అగ్ర నేతలు వచ్చినపుడే హడావుడి కనిపించేది. కానీ  కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత జిల్లాలోని కమల దళంలో ఉత్సాహం పెరిగింది. దీంతోపాటు హుజూరాబాద్‌, దుబ్బాక ఉప  ఎన్నికల్లో బీజేపీకి ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. ఆ ప్రభావం సిరిసిల్ల జిల్లాలో కనిపించడం మొదలైంది.  బండి సంజయ్‌ గతేడాది సెప్టెంబరులో ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించడంతో  క్షేత్రస్థాయిలో బీజేపీ నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ కదలిక వచ్చింది.  ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా సిరిసిల్ల, వేములవాడలో కేంద్ర మంత్రుల పర్యటన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.   వేములవాడ నియోజకవర్గంలో కేంద్ర విద్యుత్‌, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కృషన్‌పాల్‌ గుజ్జార్‌ సమావేశాలు నిర్వహించారు. సిరిసిల్లలో కేంద్ర న్యాయ సాధికారిత సహాయ మంత్రి వీరేంద్రకుమార్‌ కాతిక్‌ బీజేపీ పోలింగ్‌ బూత్‌ కమిటీలతో సమావేశమయ్యారు. మోదీ బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి జన సమీకరణపై చర్చించారు. అనుబంధ సంఘాలను ఉత్సాహ పరిచారు. 

నువ్వా..నేనా..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా మారింది. మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో పరస్పర దాడులు, నిరసనలు అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. మంత్రి కేటీఆర్‌ పర్యటన సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్షాల నాయకుల అరెస్ట్‌లు సర్వసాధరణం అన్నట్లుగా మారింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై టీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. వారిని ఉత్సాహ పరుస్తున్నట్లుగానే మంత్రి కేటీఆర్‌ స్వరం కూడా మారింది. బీజేపీని, ఆ పార్టీ నేతలను టార్గెట్‌ చేస్తున్నట్లుగానే ప్రసంగాలు ఉండడం గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మరోవైపు రాబోయే ఎన్నికల్లో బలమైన శక్తిగా నిలవాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే సిరిసిల్ల నియోజకవర్గంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్‌ కూడా పెరిగింది. ఇదే వరుసలో ముందుకు సాగాలనే లక్ష్యంగా ఆ పార్టీ ఉంది. బీజేపీ టీఆర్‌ఎస్‌ మధ్యలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే పరిస్థితి  జిల్లాలో కనిపిస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఫ్లెక్సీ వివాదం జిల్లాను తాకింది. ముస్తాబాద్‌ మండల కేంద్రంలో ప్రధాని మోదీపై వెలిసిన ఫ్లెక్సీలపై బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రధానిని అవమానిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని రాస్తారోకో చేశారు. కేటీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరోవైపు జిల్లాలో బీజేపీ పట్టుకోసం ఇతర పార్టీల నుంచి నాయకులను ప్రజాప్రతినిధులను ఆకర్షించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ల్లే కార్యక్రమాలను చేపట్టింది. 

రచ్చబండతో జనంలోకి కాంగ్రెస్‌  

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ పేరు మీద కాంగ్రెస్‌ పార్టీ రచ్చబండ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తోంది. కాంగ్రెస్‌ అదికారంలోకి వస్తే డిక్లరేషన్‌ ప్రకారం పథకాలను అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తారని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసన కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో  ఉనికి చాటుకుంటున్నారు. 


 కొట్లాట మొదలైనట్లేనా? 

టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ ప్రజల్లోకి వెళ్తూ  ఉనికి చాటుకుంటున్నాయి.  రాబోయే రోజుల్లో విజయం సాధించాలనే కాంక్షతో ముందుకు వెళుతున్న తీరు చూస్తే ముందస్తు ఎన్నికల కొట్లాట మొదలయినట్లేనని భావిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, కార్యక్రమాల కంటే జోరుగానే అభివృద్ధి కార్యక్రమాలతో మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గంలో తన పర్యటనను పెంచుకున్నట్లు చర్చిస్తున్నారు. కుల సంఘాలతో సమావేశాలు కావడం, ఆయా సంఘాల  కార్యాలయాలకు జిల్లా కేంద్రాల్లో స్థలాల కేటాయింపులు కూడా ముందస్తు ఎన్నికల సంకేతంగానే భావిస్తున్నారు. 



Updated Date - 2022-07-02T06:03:06+05:30 IST