మునుగోడులో రాజకీయ వేడి

ABN , First Publish Date - 2022-08-17T10:18:49+05:30 IST

మునుగోడులో రోజురోజుకూ పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది.

మునుగోడులో రాజకీయ వేడి

అసమ్మతి నేతలను దారికి తెచ్చుకునే యత్నాల్లో టీఆర్‌ఎస్‌

చౌటుప్పల్‌ ఎంపీపీని అరెస్టు చేసేందుకు యత్నం 

హైదరాబాద్‌లోని నివాసానికి మఫ్టీలో వెళ్లిన పోలీసులు

బీజేపీ నేతలు పెద్దసంఖ్యలో చేరుకోవడంతో వెనక్కి

ఈటల సమక్షంలో బీజేపీలో చేరిన తాడూరి వెంకట్‌రెడ్డి


నల్లగొండ/యాదాద్రి/మేడ్చల్‌/మన్సూరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): మునుగోడులో రోజురోజుకూ పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుండగా.. తమ పార్టీవారు వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తూనే కాంగ్రెస్‌ నాయకులను లాక్కునేందుకు టీఆర్‌ఎస్‌ ఎత్తులు వేస్తోంది. ఈ క్రమంలో తమ పార్టీ నుంచి వెళ్లిపోయే ప్రయత్నాల్లో ఉన్నవారికి తొలుత సర్ది చెబుతూ, మాట వినకపోతే.. పాత కేసులేవైనా ఉంటే తిరగదోడి అరెస్టు చేసేందుకూ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వవద్దంటూ అసమ్మతి రాగం వినిపిస్తున్న నేతలకు తొలుత సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. వారు వినకపోవడంతో వారికి నాయకత్వం వహిస్తున్న చౌటుప్పల్‌ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డిని దారికి తెచ్చుకునేందుకు ఆయనపై ఉన్న పాత కేసులను  తెరపైకి తెచ్చింది. ఆ కేసుల్లో వెంకట్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సోమవారం రాత్రి పోలీసులు ప్రయత్నించారు. మరుసటిరోజే ఆయన బీజేపీలో చేరారు. 


పాత కేసుల్లో అరెస్టుకు యత్నం..

చౌటుప్పల్‌లో పలు భూవివాదాల్లో ఎంపీపీ వెంకట్‌రెడ్డి జోక్యం చేసుకోవడంతో ఆయనపై గతంలో మూడు పోలీస్‌ కేసులు నమోదయ్యాయి. స్థానికంగా ఓ కాలేజీ పక్కన ఉన్న వంద ఎకరాల వెంచర్‌ యజమానులపై దాడి చేశారని, మృతదేహాన్ని మార్చురీ నుంచి తీసుకొచ్చి కంపెనీ ముందు వేశాడని, ఓ వెంచర్‌ రోడ్డు పనులకు ఆటంకం కలిగిస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు చౌటుప్పల్‌ పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. అయితే ఆయన అధికార పార్టీలో కొనసాగుతుండడంతో భాధితులు ఫిర్యాదులు చేసినా ఫలితం ఉండేది కాదు. తాజాగా ఎంపీపీ పార్టీ ఫిరాయించే పరిస్థితి కనిపించడంతో.. తమ భూములను ఎంపీపీ వెంకట్‌రెడ్డి దౌర్జన్యంగా పట్టా చేయించుకున్నారని ఆరోపిస్తూ తుఫ్రాన్‌పేట గ్రామానికి చెందిన రైతులు సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం సోమవారం రాత్రి హైదరాబాద్‌లో వనస్థలిపురంలోని వెంకట్‌రెడ్డి ఇంటికి రాచకొండ ఎస్‌వోటీ, సీసీఎస్‌ పోలీస్‌ సిబ్బంది చేరుకుని ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు.  పోలీసులు సివిల్‌ డ్రెస్‌లో వెళ్లగా ఆయన బయటకు వచ్చేందుకు నిరాకరించారు. స్థానికంగా ఉన్న బీజేపీ నేతలకు సమాచారం అందించడంతో రంగారెడ్డి అర్బన్‌ పార్టీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ఆర్టీసీ కార్మికసంఘం నేత అశ్వత్థామరెడ్డి సహా పెద్ద సంఖ్యలో నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా రాత్రిపూట అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. దీంతో పోలీసులు వెళ్లిపోయారు. మంగళవారం బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ నివాసంలో తాడూరి వెంకట్‌రెడ్డి ఆ పార్టీలో చేరారు. వెంకట్‌రెడ్డితోపాటు మాజీ జడ్పీటీసీ, టీఆర్‌ఎస్‌ మండల మాజీ అధ్యక్షుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్‌ ఎడ్ల మహేందర్‌రెడ్డి, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కంది లక్ష్మారెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకొన్నారు. 


టీఆర్‌ఎస్‌ నీచబుద్ధి వెల్లడైంది: ఈటల

టీఆర్‌ఎస్‌ నేతల చేరికల అనంతరం ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక రాబోతుందనగానే అధికార పార్టీ నీచ బుద్ధి బయటపడిందన్నారు. నాలుగైదురోజులుగా కోట్ల రూపాయలు పంచిపెడుతోందని ఆరోపించారు. సొంత పార్టీ నేతలకు వెల కడుతున్న నీచమైన పార్టీ టీఆర్‌ఎస్‌ అని, ఇదేవిధంగా హుజురాబాద్‌లోనూ వ్యవహరిస్తే ప్రజలు చెంప చెళ్లుమనిపించినా కేసీఆర్‌కు బుద్ధిరాలేదని విమర్శించారు. చౌటుప్పల్‌ ఎంపీపీపై పీడీ యాక్ట్‌ పెట్టాలని కుట్ర చేస్తున్నారని, ఐశ్యర్య ఆయిల్‌ మిల్‌లో రెండేళ్ల క్రితం అచ్చంపేటకు చెందిన వ్యక్తి చనిపోతే ఆ పేద కుటుంబానికి న్యాయం చేయాలని వెళ్తే తాడూరి వెంకట్‌రెడ్డిపై కేసు పెట్టారని తెలిపారు. ఆ కేసును కోర్టు కొట్టి వేసిందని, అయినా  పోలీసులు ఆయనను అక్రమంగా అరెస్టు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. కాగా, మంగళవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో సమావేశమయ్యారు. అనంతరం ప్రజా సంగ్రామ యాత్రలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడిలో గాయపడ్డ జనగామ జిల్లా దేవరుప్పుల సర్పంచ్‌ మల్లేశ్‌ యాదవ్‌ను పరామర్శించారు. 


భారీగా మోహరించిన ఇంటెలిజెన్స్‌ 

మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌ పట్టణం, ఇతర ప్రాంతాల్లో మంగళవారం ఇంటెలిజెన్స్‌ సిబ్బంది పెద్దసంఖ్యలో దిగారు. ఈ నెల 20న సీఎం కేసీఆర్‌ సభ, 21న అమిత్‌షా సభ కొద్ది నెలల్లో ఉప ఎన్నిక, అధికార పార్టీలో అభ్యర్థి ఖరారుపై భిన్నాభిప్రాయాలు, స్థానిక నేతలు సర్వేలతో విభేదిస్తున్న నేపథ్యంలో ఓటర్ల నాడి పట్టేందుకు, బీజేపీ, కాంగ్రెస్‌ నేతల కదలికలు, బలాబలాలు తెలుసుకునేందుకు వారు మోహరించారు. 

Updated Date - 2022-08-17T10:18:49+05:30 IST