ప్రభుత్వ భూములపై పాలిటికల్‌ గద్దలు

ABN , First Publish Date - 2021-03-07T06:01:55+05:30 IST

సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని ప్రభుత్వ భూములవి. ఇటీవల మునిసిపాలిటీలో విలీనమవడంతో భూముల రేట్లు అమాంతం పెరిగాయి.

ప్రభుత్వ భూములపై పాలిటికల్‌ గద్దలు
బండ్లబాటను, ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేసిన వెంచర్‌

రూ.50కోట్ల విలువైన ప్రభుత్వ భూములు మాయం

పెరిగిన ధరలతో పెట్రేగుతున్న వివాదాలు

కుదిరితే రాజీ, లేదంటే బ్లాక్‌మెయిల్‌

భూవివాదం వల్లే రియల్టర్‌ దారుణహత్య

చివ్వెంల, మార్చి 6 : సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని ప్రభుత్వ భూములవి. ఇటీవల మునిసిపాలిటీలో విలీనమవడంతో భూముల రేట్లు అమాంతం పెరిగాయి. సెంటు భూమి ధర వేలల్లో పలుకుతుండడంతో రాజకీయ నేతల చూపు పడింది. ఏ పదవీలేని ఖద్దర్‌ చొక్కా వేసుకున్న చిన్నా చితక నాయకుల నుంచి మొదలు నియోజకవర్గ ప్రజాప్రతినిధుల వరకు ప్రభుత్వ భూములను ఆక్రమించడంతోపాటు, ప్రైవేటు భూపంచాయితీల్లో  జోక్యం తో వివాదాలు పెరిగాయి. కుదిరితే రాజీ, లేదంటే బ్లాక్‌మెయిల్‌కు దిగి ఇబ్బందులు పెట్టడం పరిపాటిగా మారింది. ఒక్క చివ్వెంల మండలంలోని కుడకుడ రెవెన్యూ శివారులో రూ.50కోట్లకు పైగా విలువచేసే భూములు అన్యాక్రాంతమయ్యాయి. కుడకుడలో భూములు కొనుగోలు చేయాలన్నా, విక్రయించాలన్నా తామే చేయాలని, దీన్ని కాదంటే పోలీ్‌సస్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని అధికార పార్టీకి చెందిన ఓ నేత ఏకంగా హకుం జారీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో మండలంలో పనిచేసిన ఓ ఎస్‌ఐ ఓ భూపంచాయితీలో తలదూర్చి ఒకరిని చితకబాదిన ఘటన వివాదమైంది. ఇక ఈ ప్రాంతంలోనే కలెక్టరేట్‌ భవనాన్ని నిర్మిస్తుండటంతో భూ వివాదాలు పెరిగాయి. ఈ నెల 2వ తేదీన భూ వివాదంతోనే కుడకుడకు చెందిన గుర్రం శశిధర్‌రెడ్డి హత్యకు గురయ్యాడు.


ప్రభుత్వ భూములు హాంఫట్‌

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న అక్రమార్లుకు ఏకంగా వెంచర్చు చేసి విక్రయిస్తున్నారు. కుడకుడలో 126 సర్వే నంబర్‌లో 98.23ఎకరాలు, 110 సర్వే నంబర్‌లో 51.23ఎకరాలు, 163 సర్వే నంబర్‌లో 21.12ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఎకరాలకు ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. అంతేగాక ఈ భూముల్లో ఇళ్లు కూడా వెలిశాయి. ఈ సర్వే నంబర్లలో అసలు ఎంత ప్రభుత్వ భూమి మిగిలి ఉందో కూడా రెవెన్యూ అధికారుల వద్ద సమాచారం లేదు. దీంతో పాటు 113 సర్వే నంబర్‌లో 44.27 ఎకరాలు, 177 సర్వే నంబర్‌లో 19.24 ఎకరాలు, 268 సర్వే నంబర్‌లో 12.12 ఎకరాలు, 328లో సర్వేనంబర్‌లో 7.16ఎకరాల్లో చెరువు శిఖం భూములు ఉన్నాయి. 328 సర్వే నంబర్‌లోని కర్ణాల కుంట చెరువు భూమి విషయంలో ఇటీవల వివాదాలు తలెత్తడంతో అధికారులు పలుమార్లు సర్వే చేసి హద్దులు గుర్తించి ఎలాంటి కబ్జాలు లేవని నిర్ధారించారు. అయితే మిగతా చెరువు శిఖాల విషయాన్ని అధికారులు తేల్చలేదు. మొత్తంగా రూ.50కోట్లకు పైగా విలువచేసే భూమి కబ్జాకు గురైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


రెవెన్యూ అధికారుల అండతో..

చివ్వెంల మండలంలో గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారుల తప్పిదాల వల్లే కుడకుడలో భూవివాదాలు తలెత్తుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులకు డబ్బు ఎర చూపి నాయకులు ఇష్టారీతిన భూప ట్టాలు సాధించగా, కబ్జాలో మాత్రం మరొకరు ఉన్నారు. ఈ వివాదం పరిష్కారానికి పెద్దమనుషులను లేదా పోలీసులను ఆశ్రయించక తప్పని పరిస్థితి కల్పించి సెటిల్మెంట్లు చేస్తున్న నాయకులు ఎక్కువయ్యారు. దీంతో కుడకుడలో భూ వివాదాలు పెరిగాయి. ఇటీవల ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేవడమే గాక తహసీల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేస్తుండగా, ఈ విభాగాల్లో పనిచేసే సిబ్బందిని బడాబాబులు మచ్చిక చేసుకొని పట్టాదారులైన రైతులను సైతం ముప్పుతిప్పలు పెడుతున్నారు.


ఇవిగో సాక్ష్యాలు

కుడకుడకు చెందిన అధికార పార్టీకి చెందిన జిల్లాస్థాయి నేత అయిన బడా రియల్టర్‌ ఆయన పేరున పెద్ద వెంచర్లు చేయడమే గాక శ్మశాన వాటిక, గుట్టలను కూడా కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 163 సర్వే నంబర్‌లో స్వాతంత్ర సమరయోధుడి దంపతుల పేర ఉన్న 3.30ఎకరాల భూమి, 157 సర్వే నంబర్‌లో 5 ఎకరాల భూమిని డెవల్‌పమెంట్‌ పేరుతో తీసుకుని వెంచర్‌ చేసిన కుడకుడకు చెందిన అధికారపార్టీ నేత ఏకంగా రూ.5కోట్ల ప్రభుత్వ భూమిని ఆ వెంచర్‌లో కలిపేసుకున్నాడు. ఈ వెంచర్‌ నుంచి ఏళ్లుగా బండ్ల బాట ఉండగా, దీన్ని సైతం కబ్జా చేసి అటుగా వెళ్లకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పక్కనే ప్రభుత్వ భూమి నుంచి మట్టిని అనుమతి లేకుండా సూర్యాపేట పట్టణంలోని పలు వెంచర్లకు తరలించినా అధికారులు పట్టించుకోలేదు. 126 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూముల్లో కొందరు ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూములను ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేటాయించగా, భూ బకాసురుల ఆక్రమణలు మాత్రం ఆగడం లేదు. వీటితోపాటు కొన్ని వివాదాస్పద భూముల్లో నాయకులు జోక్యం చేసుకుని సెటిల్మెంట్లు, బెదిరింపులకు దిగి వీటిని చౌకాగా కొట్టేసి కమీషన్లు దండుకుంటున్నారు. ఇటీవల కుడకుడకు చెందిన శశిధర్‌రెడ్డి హత్యకు భూవివాదమే కారణమైంది. ఇలాంటి వివాదాలెన్నో ఒక్క కుడకుడ కేంద్రంగా నడుస్తున్నాయి.


ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు .. ఏ.రంగారావు, చివ్వెంల తహసీల్దార్‌

మండలంలో ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. భూ రికార్డులు పరిశీలించి హద్దుల ప్రకారం విచారణ చేసి ప్రభుత్వ భూమని తేలితే చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2021-03-07T06:01:55+05:30 IST