హైదరాబాద్‌లో.. రాజకీయ రచ్చ

ABN , First Publish Date - 2021-01-26T07:14:00+05:30 IST

హైదరాబాద్ నగరంలో సోమవారం..

హైదరాబాద్‌లో.. రాజకీయ రచ్చ
పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆందోళన

మద్యం మత్తులో వీరంగం సృష్టించిన కార్పొరేటర్‌

బీజేపీ నాయకురాలి ఇంటిపై దాడి 

పోలీస్‌స్టేషన్‌ ముందు బీజేపీ నాయకుల ఆందోళన, లాఠీచార్జీ

మల్కాజిగిరిలో ఎమ్మెల్యే వర్సెస్‌ కార్పొరేటర్‌

ఒకరిపై మరొకరు ఆరోపణలు


నగరంలో సోమవారం మల్కాజిగిరి, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో రాజకీయ వేడి రాజుకుంది. మల్కాజిగిరిలో ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. పోటాపోటీగా ప్రెస్‌మీట్‌లు పెట్టారు. ఈ క్రమంలో కార్పొరేటర్‌ సహా పలువురి నేతలను టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఎమ్మెల్యే మైనంపల్లి ప్రకటించారు. జగద్గిరిగుట్టలో బీజేపీ నాయకురాలు వసుంధరపై జరిగిన దాడి, కార్పొరేటర్‌పై ఆమె ఫిర్యాదు తదితర ఘటనలతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది. 


జగద్గిరిగుట్టలో ఉద్రిక్తత

జీడిమెట్ల: జగద్గిరిగుట్ట మగ్ధూంనగర్‌లో కార్పొరేటర్‌ జగన్‌ ఇంటికి అత్యంత సమీపంలో బీజేపీ నాయకురాలు కె.వసుంధర నివాసం ఉంది. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పని చేస్తోందని గత నవంబర్‌ 28న వసుంధరపై టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు వ్యక్తులు దాడిచేసి కొట్టారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు చెప్పారు. ఆదివారం రాత్రి వసుంధర ఇంట్లో చిన్నఫంక్షన్‌ ఉండడంతో బంధువులంతా వచ్చారు. మద్యం తాగి ఉన్న కార్పొరేటర్‌ జగన్‌, అతని అనుచరులు సంతోష్‌, సంపత్‌, జావెద్‌, సునామీ వసుంధర బంధువులపై దాడిచేశారు. ఆపడానికి వెళ్లిన వసుంధరను కడుపులో తన్ని ఇష్టానుసారంగా కొట్టారు. కార్పొరేటర్‌ సోదరుడు జైహింద్‌ తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్‌ జగన్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు. జగద్గిరిగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


జగద్గిరిగుట్ట టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ కొలుకుల జగన్‌, అతని అనుచరులు మద్యం మత్తులో ఆదివారం అర్ధరాత్రి మగ్ధూంనగర్‌లో వీరంగం సృష్టించారు. పాతకక్షలతో బీజేపీ నాయకురాలి ఇంటిపై దాడి చేసి కొట్టారని బాధితురాలు ఆరోపించారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. కార్పొరేటర్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. బాలానగర్‌ ఏసీపీ పురుషోత్తం, సీఐ సైదులు, డీఐ మహేష్‌ జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బాధితులపై చర్యలు తీసుకుంటామని ఆందోళన విరమించాలని కోరినా బీజేపీ నాయకులు ససేమిరా అన్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి పలువురిని అరెస్ట్‌ చేశారు.


కార్పొరేటర్‌ జగన్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి

జగద్గిరిగుట్టలో వీధిగూండాలుగా వ్యవహరిస్తూ దాడులకు పాల్పడుతున్న జగన్‌, అతని అనుచరులను తక్షణమే అరెస్ట్‌ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్‌రెడ్డి, కొలన్‌ హన్మంత్‌రెడ్డి, ఎం.ఎస్‌.వాసు డిమాండ్‌ చేశారు. కార్పొరేటర్‌ను అరెస్ట్‌ చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.


ఎమ్మెల్యే వేధింపుల నుంచి రక్షించాలి : కార్పొరేటర్‌

నేరేడ్‌మెట్‌, యాప్రాల్‌: టీఆర్‌ఎస్‌ అధిష్టానం జోక్యం చేసుకొని స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వేధింపుల నుంచి తమను రక్షించాలని నేరేడ్‌మెట్‌ కార్పొరేటర్‌ కటికనేని శ్రీదేవి కోరారు. సోమవారం డివిజన్‌ పరిధిలోని కార్పొరేటర్‌ కార్యాలయంలో ఆమె, అనుచరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టించి అధికార బలంతో వేధిస్తున్నారని ఆరోపించారు. మహిళలను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అధికారులు ఎమ్మెల్యే చెప్పినట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మల్కాజిగిరి అధికారులకు తాను రాతపూర్వకంగా అక్రమ నిర్మాణాలపై 34 ఫిర్యాదులు చేసినా నేటికీ చర్యలు తీసుకోలేదన్నారు.


యాప్రాల్‌లో తన భర్త హనుమంతరావు, నేరేడ్‌మెట్‌ టీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ఇతర వ్యాపార భాగస్వాములతో కలిసి కొనుగోలు చేసిన ఐదు ఎకరాల భూమిని ఎమ్మెల్యేకు ఇవ్వనందుకే తమపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకొన్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే అక్రమాలను లీగల్‌గా ఎదుర్కొంటామని, పార్టీ అధిష్టానం జోక్యం చేసుకొని వాస్తవాలను పరిశీలించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీదేవి కోరారు.  కేటీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వనీయకుండా మైనంపల్లి అడ్దుపడుతున్నారని, మంత్రులు చెప్పినా వినకుండా వ్యక్తిగత ఇష్టాయిష్టాల ప్రకారం వ్యవహరించడం పార్టీకి నష్టం చేస్తుందని ఆమె అన్నారు. ఎమ్మెల్యే అనుచరులు మల్కాజిగరి నియోజకవర్గంలో ఎలాంటి అక్రమాలు, బెదిరింపులకు  పాల్పడతున్నారో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. 


వేధింపులు సరికాదు..

తెలంగాణ ఉద్యమం నుంచీ కలిసి పని చేస్తున్నా అక్రమ కేసులు పెట్టి వేధించడం ఎంత వరకు న్యాయమని టీఆర్‌ఎస్‌ పార్టీ నేరేడ్‌మెట్‌ డివిజన్‌ మాజీ అధ్యక్షడు మధుసూదన్‌రెడ్డి ప్రశ్నించారు. 200 మంది పోలీసులను పంపించి మున్సిపల్‌ అధికారులతో తన ఇంటిని కూల్చివేయడం న్యాయం కాదన్నారు. తాము ఎటువంటి భూకబ్జాలకు పాల్పడలేదన్నారు. కబ్జాలు చేసినట్లు ఎమ్మెల్యే నిరూపిస్తే వ్యాపారాలు మానుకొంటామని హనుమంతరావు చెప్పారు. త్వరలోనే తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. 


కార్పొరేటర్‌ సస్పెన్షన్‌

ఆనంద్‌బాగ్: అక్రమాలకు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న కార్పొరేటర్‌ శ్రీదేవి హనుమంతరావు, జీకే హనుమంతరావు, డివిజన్‌ అధ్యక్షుడు మధుసూధనరెడ్డిలను క్రమశిక్షణా చర్యలలో భాగంగా పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఎమ్మెల్యే మైనంపల్లి తెలిపారు. టీఆర్‌ఎస్‌ పేరు, ఉద్యమకారులమని చెబుతూ అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని,  బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. సోమవారం మల్కాజిగిరిలోని క్యాంపు కార్యాలయంలో బాధితులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కార్పొరేటర్‌ శ్రీదేవి, జీకే హనుమంతరావు, డివిజన్‌ అధ్యక్షుడు మధుసూధన్‌రెడ్డి భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పేదలను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేదిలేదన్నారు. 

Updated Date - 2021-01-26T07:14:00+05:30 IST