రాజకీయ బంధు!

ABN , First Publish Date - 2022-01-28T07:20:54+05:30 IST

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ఉప ప్రణాళిక కింద ప్రత్యేక అభివృద్ధి నిధిని అమలు చేస్తున్న రాష్ట్రప్రభుత్వం..

రాజకీయ బంధు!

  • దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలు, మంత్రులకు..
  • తొలుత ఈ బాధ్యత కలెక్టర్లకు అప్పగించిన సర్కారు
  • ప్రజాప్రతినిధులకు ఇవ్వడంతో పథకం పక్కదారే..?
  • రాజకీయ రంగు పులుముకోవడం ఖాయం!
  • అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చు రగిలే చాన్స్‌
  • ముందు టీఆర్‌ఎస్‌ అనుకూల కుటుంబాలకే వర్తింపు?
  • ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి?
  • మరో ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకంగా మారే ప్రమాదం
  • రాష్ట్రవ్యాప్తంగా దళిత వర్గాల్లో రకరకాలుగా చర్చ
  • మార్చి 31లోపు పథకం అమలు సాధ్యమేనా?
  • తక్షణమే 1180 కోట్ల రూపాయలు కావాలి
  • నిధుల విడుదలపై కొరవడిన స్పష్టత
  • రాష్ట్రంలో మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలు
  • అందరికీ అమలు చేయాలంటే ఆరేళ్లపైనే!


కేసీఆర్‌ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘దళిత బంధు’ పథకం దారెటు..? దళితుల సాధికారతే లక్ష్యంగా చేపట్టిన ఈ పథకం రాజకీయ రంగు పులుముకుంటుందా? నియోజకవర్గాల్లో పార్టీల మధ్య చిచ్చు పెట్టబోతుందా? అధికార పార్టీ అనుచరులు, సన్నిహితులకే ముందుగా వర్తిస్తుందా? పథకం పక్కదారి పట్టనుందా? అంటే.. పరిశీలకులు అవుననే అంటున్నారు. ఇంతటి భారీ పథకంలో లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను తొలుత కలెక్టర్లకు అప్పగించిన ప్రభుత్వం.. తాజాగా ఎమ్మెల్యేలు, మంత్రులకు అప్పజెప్పడంతో పథకం కాస్తా ‘రాజకీయ బంధు’గా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ అనుచరులకే లబ్ధి చేకూరుతుందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట నత్తనడకన సాగుతుందన్న అభిప్రాయాలున్నాయి.


హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ఉప ప్రణాళిక కింద ప్రత్యేక అభివృద్ధి నిధిని అమలు చేస్తున్న రాష్ట్రప్రభుత్వం.. తాజాగా ‘దళిత సాధికారత పథకం’ అమలు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు 2021-22 బడ్జెట్‌లో రూ.1000 కోట్లను కేటాయించింది. దళిత బంధు పేరిట ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నగదు పంపిణీ చేసి, వారు వ్యాపారాల ద్వారా నిలదొక్కుకునేలా చేయాలన్నది పథకం ఉద్దేశం. తొలుత ఒక్కో నియోజకవర్గంలో 100 కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే 119 నియోజకవర్గాల్లో 11,900 కుటుంబాలకు వర్తింపజేయాలి. కానీ, ముందుగా సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ప్రారంభించారు. 70 కుటుంబాలకు దళితబంధును అమలు చేశారు. తర్వాత హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అమలు చేశారు. అక్కడ 18వేల కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేశారు. బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించినప్పటికీ హుజూరాబాద్‌, వాసాలమర్రి కోసం రూ.2000 కోట్లు విడుదల చేసి, లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎన్నికల కోసమే ఇక్కడ దళితులందరికీ పథకం వర్తింపజేశారన్న ఆరోపణలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా నలు దిశల్లోని నాలుగు జిల్లాల్లో నాలుగు ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో నాలుగు మండలాలను ఎంపిక చేశారు. 


ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం; సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరిమలగిరి మండలం; నాగర్‌ కర్నూల్‌ జిల్లా అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గంలోని చారగొండ మండలం; కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గం నిజాంసాగర్‌ మండలాల్లో తొలుత అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు చింతకాని మండలానికి రూ.100 కోట్లు, మిగతా మూడు మండలాలకు రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.250 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే మార్చి 31లోపు 118 నియోజకవర్గాల్లో పథకాన్ని అమలు చేయాల్సి ఉంది. కానీ, ఇంతలోనే నిబంధనలను మార్చింది. పథకాన్ని ప్రారంభించిన మొదట్లో లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. రాష్ట్రంలోనే కాదు, దాదాపు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల నగదు ఇచ్చే ఇంతటి భారీ పథకాన్ని వివాదాలకు తావు లేకుండా అమలు చేయడం కత్తిమీద సాము లాంటిదే. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపిక బాధ్యత అధికారులకు అప్పగించడంతో అవకతవకలు, అక్రమాలకు ఆస్కారం ఉండదని.. అంతా పారదర్శకంగా జరుగుతుందని భావించారు. కానీ, తాజాగా లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ప్రభుత్వం ఎమ్మెల్యేలు, మంత్రులకు అప్పగించింది. నియోజకవర్గంలోని లబ్ధిదారులను స్థానిక ఎమ్మెల్యే ఎంపిక చేస్తారని, ఆ జాబితాను జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదిస్తారని ప్రకటించింది. దీంతో పథకం పక్కదారి పడుతుందన్న చర్చ దళిత వర్గాల్లో నడుస్తోంది. ఇది పలు వివాదాలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


నియోజకవర్గాల్లో రాజకీయ చిచ్చు..

పథకం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను ఎమ్మెల్యేలు, మంత్రులకు అప్పగించడంతో రాజకీయ చిచ్చు రేగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేలు తమ అనుయాయులు, సన్నిహితులనే ముందుగా ఎంపిక చేస్తారని ఆరోపిస్తున్నారు. తమకు విరోధులుగా ఉండే దళిత కుటుంబాలను చివరి దశ వరకు పక్కన పెడతారని, అప్పటివరకు పథకం కొనసాగుతుందో లేదో తెలియదని వాపోతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట పథకంలో మరింత రాజకీయం చోటుచేసుకుంటుందని చెబుతున్నారు. అక్కడ టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ, మండల ఇన్‌చార్జి నేతలు పథకంలో జోక్యం చేసుకుని ప్రతిపక్ష ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తారని, తద్వారా టీఆర్‌ఎస్‌, ఇతర విపక్షాల మధ్య వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని సందేహిస్తున్నారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ ఇలాంటి గలాటానే జరిగిందని గుర్తు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు అప్పగించిందని, ఫలితంగా పార్టీ కార్యకర్తలు, అనుయాయులనే ఎక్కువగా ఎంపిక చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్దఎత్తున అవినీతి జరిగిందని విజిలెన్స్‌ కమిషన్‌ కూడా తేల్చింది. తాజాగా దళిత బంధులోనూ ఎమ్మెల్యేలు, మంత్రులకు బాధ్యతలు అప్పగించడంతో ఇది మరో ఇందిరమ్మ ఇళ్ల పథకంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 


ఆ నియోజకవర్గాల్లో సరిగా అమలవుతుందా?

ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో పథకం సరిగా అమలవుతుందా? అన్న సందేహాలున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ నియోజకవర్గాల్లో అనుచరులు, సన్నిహితులను ఎంపిక చేసే ప్రమాదముంటే.. ప్రతిపక్ష స్థానాల్లో మొత్తం పథకాన్నే నత్తనడకన సాగిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. పైగా ప్రతిపక్ష పార్టీలకు ఓట్లు వేశారన్న అనుమానంతో కొన్ని దళిత కుటుంబాలను పక్కన పెడతారని అంటున్నారు. ఇంత పెద్ద పథకాన్ని జాగ్రత్తగా అమలు చేయాల్సి ఉండగా.. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం కారణంగా ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానిస్తున్నారు. కలెక్టర్లనే బాధ్యులు చేస్తే అటు అధికార, ఇటు ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పథకం సజావుగా అమలయ్యే అవకాశం ఉండేదని అంటున్నారు. ఒక నియోజకవర్గంలో 100 కుటుంబాలకు పథకాన్ని అమలు చేస్తామని చెబుతున్నారు. నియోజకవర్గంలో సగటున 5 మండలాలు ఉన్నాయనుకుంటే.. ఒక మండలంలోని 20 కుటుంబాలకు పథకం వర్తిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 25 వేల వరకు గ్రామాలున్నాయి. ఒక మండలంలో సగటున 35-40 గ్రామాలుంటాయి. అంటే మండలానికి వచ్చే 20 కుటుంబాల నిధులు.. అన్ని గ్రామాలకు వర్తించవు. ఒక్కో గ్రామంలో ఒక్క కుటుంబానికైనా దక్కడం గగనమే. ఒక మండలంలో 20 కుటుంబాలకు వర్తింపజేస్తే.. 20 గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి లబ్ధి కలిగే అవకాశం ఉంది. మిగతా 15-20 గ్రామాల వారికి ఎదురుచూపులు తప్పవని, ఎమ్మెల్యేల అనుచరులకు ముందుగా ఇవ్వడం వల్ల మిగతావారు నిరాశ నిస్పృహలకు గురవుతారని అంటున్నారు. 


నిధుల సర్దుబాటు ఎలా?

ఇది భారీ పథకం. లక్షల కోట్ల రూపాయలు కావాలి. సంతృప్త స్థాయిలో అమలు చేయాలంటే ఏడాదికి సరిపడా బడ్జెట్‌ కావాలి. ఇప్పటికే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పంపిణీ పూర్తి చేసినందున.. 118 నియోజకవర్గాలకు తక్షణమే రూ.1,180 కోట్లు కావాలి. కానీ, ఇప్పటివరకు నిధులపై స్పష్టత లేదు. బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయిస్తే రూ.2000 కోట్ల మేర హుజూరాబాద్‌కే ఖర్చు చేశారు. 118 నియోజకవర్గాలకు రూ.1,180 కోట్లు ఇస్తారా లేదా? అన్నది సందేహంగా మారింది. మార్చి 31 నాటికి 118 నియోజకవర్గాల్లో అమలు చేయగలరా? అన్న ఆందోళన నెలకొంది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలున్నాయని, వీరందరికి పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు. అంటే రూ.1.70 లక్షల కోట్లు కావాలి. కానీ, ఈ బడ్జెట్‌లో రూ.1000 కోట్లే కేటాయించారు. రానున్న బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని, ఈ పథకం కోసం ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తూ పోతామని కేసీఆర్‌ వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్లు, 2023-24లో మరో 20 వేల కోట్లు కేటాయించినా.. రూ.40 వేల కోట్లే అవుతాయి. ఇలా ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున కేటాయిస్తూ వెళ్లినా.. మిగతా రూ.1.30 లక్షల కోట్లకు ఆరేళ్లు పడుతుంది. 

Updated Date - 2022-01-28T07:20:54+05:30 IST