పొలిటికల్‌ కార్పొరేషన్‌

ABN , First Publish Date - 2021-10-28T06:44:49+05:30 IST

తిరుపతి నగరపాలక సంస్థ అధికార పార్టీ కార్యకలాపాలకు, ప్రైవేట్‌ వ్యక్తుల బర్త్‌డే వేడుకలకు అడ్డాగా మారుతోంది.

పొలిటికల్‌ కార్పొరేషన్‌
మేయరు చాంబరులో ఆమె బంధువుకు పుట్టిన రోజు వేడుకలు - డిప్యూటీ మేయరు చాంబరులో టౌన్‌బ్యాంకు చైర్మన్‌కు సత్కారం

బర్త్‌డే వేడుకలు, రాజకీయ ప్రెస్‌మీట్లు 


తిరుపతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరపాలక సంస్థ అధికార పార్టీ కార్యకలాపాలకు, ప్రైవేట్‌ వ్యక్తుల బర్త్‌డే వేడుకలకు అడ్డాగా మారుతోంది. కార్పొరేషన్‌ కార్యాలయంలో బుధవారం ఒక్కరోజే కార్పొరేషన్‌కు సంబంధంలేని ఇద్దరు వైసీపీ నాయకుల బర్త్‌డే వేడుకలతో పాటు ప్రతిపక్షపార్టీపై డిప్యూటీ మేయర్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించడంపై చర్చనీయాంశమైంది. మేయర్‌ ఛాంబరులో ఆమె సమీప బంధువు ఒకరికి జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. అదేవిధంగా టౌన్‌బ్యాంకు ఛైర్మన్‌ వెంకటే్‌షరెడ్డి జన్మదిన వేడుకలు డిప్యూటీ మేయర్‌ ముద్ర నారాయణ ఛాంబర్‌లో జరిగడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అదేవిధంగా ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ స్పందనలో ఎస్పీకి ఫిర్యాదుచేయడాన్ని తప్పుబడుతూ డిప్యూటీ స్పీకరు ముద్ర నారాయణ రాజకీయపరమైన ప్రెస్‌మీట్‌ పెట్టడం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన జనాగ్రహ దీక్షలో కార్పొరేషన్‌ అధికారులే దగ్గరుండి జనసమీకరణ చేయడం, ఇప్పుడు రాజకీయ వేదికగా కార్పొరేషన్‌ను మార్చేయడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. 


అప్పుడలా.. మరిప్పుడు!

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తుడా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నరసింహయాదవ్‌.. తన ఛాంబరులో రాజకీయ అంశాలపై మీడియాతో మాట్లాడారు. దీనిపై స్పందించిన నాటి తుడా వీసీ, కార్పొరేషన్‌ కమిషనరు విజయరామరాజు.. రాజకీయ ప్రెస్‌మీట్లు కార్యాలయంలో పెట్టరాదని సున్నితంగా చెప్పారు. తుడా కార్యక్రమాల గురించే మాట్లాడాలని కోరారు. ఆ ప్రకారం నరసింహయాదవ్‌ ఆచరించారు. మరిప్పుడు...!

Updated Date - 2021-10-28T06:44:49+05:30 IST