రైతు కమిటీలకు రాజకీయ రంగు

ABN , First Publish Date - 2020-10-01T10:58:41+05:30 IST

Political color for farmer committees

రైతు కమిటీలకు రాజకీయ రంగు

అధికార పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యం

అర్హులైన వారికి దక్కని చోటు

గత ప్రభుత్వంలో వ్యక్తిగత రాయితీ

గ్రూపుల పేరుతో ఇప్పుడు దానికి మంగళం

ఖరీ్‌ఫకు అందని యంత్రాలు

రబీలోనైనా వస్తాయని ఆశ


వ్యవసాయ శాఖ అధికారులు ఇటీవల ఏర్పాటు చేసిన రైతు కమిటీల్లో పారదర్శకత లోపించింది. రాజకీయ జోక్యం శ్రుతిమించింది. అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే ప్రాధాన్యం లభించింది. ప్రత్యర్థి పార్టీలకు చెందిన రైతులు, తటస్థులకు అర్హత ఉన్నా కమిటీల్లో చోటు దక్కలేదు. అదేసమయంలో అర్హత లేకపోయినా రాజకీయ అండ ఉన్న వారు మాత్రం సభ్యులుగా చేరిపోయారు. మెజారిటీ సభ్యుల అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిబంధనలు చెప్తున్నప్పటికీ కమిటీలలో ఉన్న అధికార పార్టీ సభ్యుల ఇష్టాఇష్టాల మేరకే నిర్ణయం జరిగిపోతున్నదని పలువురు రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఖరీఫ్‌ ముగింపు దశకు వచ్చినా ఈ సీజన్‌ యంత్ర పరికరాలు ఇప్పటి వరకూ అందలేదు. అసలే కరోనాతో పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతాంగానికి సకాలంలో యంత్రాలను అందిస్తే వారికి పెట్టుబడి ఖర్చులు కొంతమేర కలిసొచ్చేవి. కానీ ప్రభుత్వం ఈ రాయితీ పరికరాలకు సంబంధించిన విధివిధానాలు జారీ చేసేటప్పటికే ఖరీఫ్‌ ప్రారంభమయింది. దీంతో వాటిని అందించడంలో జాప్యం జరిగింది. రబీలోనైనా అవి అవి అందుతాయని రైతులు ఆశపడుతనాఆ్నరు. 


ఒంగోలు(జడ్పీ), సెప్టెంబరు 30 :  రైతులను గ్రూపులుగా ఏర్పాటు చేసి వారికి సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేసే కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంలో వ్యక్తిగతంగా రైతులకు రాయితీపై పరికరాలు ఇచ్చారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం దానిని పక్కన బెట్టి రైతులకు గరిష్ఠ ప్రయోజనం చేకూరుతుందంటూ కమిటీల ఏర్పాటుకు ఉపక్రమించింది.  జిల్లాలో ఉన్న 879 రైతు భరోసా కేంద్రాల ద్వారా వీటి ఎంపికను పూర్తి చేసింది. ఈ గ్రూపుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించగా ఆచరణలో అందుకు భిన్నంగా జరిగింది.  


గత ప్రభుత్వంలో వ్యక్తిగత రాయితీ 

గత ప్రభుత్వంలో రైతులకు కావాల్సిన వ్యవసాయ పరికరాలను రాయితీపై వ్యక్తిగతంగా అందించే వారు. అప్పట్లో ఇలా జిల్లాలో 20,000 మంది లబ్ధిపొందారు. దాదాపు రూ. 50 కోట్లపైనే జిల్లాకు నిధులు మంజూరయ్యాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన గత సంవత్సరం ఈ రాయితీ పరికరాల ఊసే లేదు. ఈ ఏడాది దానికి శ్రీకారం చుట్టినా  కమిటీల పేరుతో కాలయాపన, అస్మదీయులకు అగ్రతాంబూలం ఇత్యాది అంశాలన్నీ రాయితీల ఉద్దేశాన్ని నీరుగార్చేవిధంగా ఉన్నాయి.


రైతు భరోసా కేంద్రాల ద్వారా అద్దెకు పరికరాలు

ఎంపికైన గ్రూపులకు 40 శాతం రాయితీపై ప్రభుత్వం వ్యవసాయ యంత్రాలు ఇస్తుంది. అందుకు అయ్యే మొత్తం ఖర్చులో 50 శాతం బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందుతుంది. 10 శాతం మాత్రమే రైతులు భరించాల్సి ఉంటుంది. ఒక్కో గ్రూపునకు అందించే  పరికరాల విలువ అవసరాన్ని బట్టి రూ. 10లక్షల దాకా ఉంటుంది. ఈ యంత్రాలను కమిటీ సభ్యులు వారి అవసరాలకు వినియోగించుకోవచ్చు. రైతు భరోసా కేంద్రాల దగ్గర అందుబాటులో ఉంచి ఆ కేంద్రం పరిధిలో ఉండే గ్రామాల రైతులకు నామమాత్రపు అద్దె ప్రాతిపదికన ఇవ్వవచ్చు. కానీ గ్రామస్థాయిలో ఇది సత్ఫలితాలివ్వాలంటే గ్రూపుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి. కానీ అలా జరగలేదు. పార్టీల పేరుతో అన్నదాతల మధ్య విభజన రేఖ గీయడంతో అసలు ఆశయం నీరు గారుతోంది. కొన్ని గ్రామాల్లో అయితే అసలు రైతులు కాని వారిని కూడా ఈ కమిటీలలో చేర్చారని, అలాంటి వారివల్ల తమకు ఏమి న్యాయం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. మెజారిటీ రైతుల అభిప్రాయం మేరకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉండగా అధికార పార్టీ సభ్యుల ఇష్టం మేరకు నిర్ణయాలు జరిగిపోతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. 


గ్రామ సభల ఊసే కరువు

గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి బహిరంగంగా రైతుల అభిప్రాయాలు తీసుకుని ఈ కమిటీల ఎంపిక చేపట్టినట్లయితే బాగుండేదని పలువురు అంటున్నారు. అలాకాకుండా అధికార పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులతోనే ఈ కమిటీలను ఎంపిక చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మెజారిటీ రైతుల అభిప్రాయం మేరకు అవసరమైన పరికరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిబంధనలు చెప్తున్నప్పటికీ కమిటీలలో ఉన్న సభ్యుల ఇష్టాయిష్టాల మేరకే నిర్ణయం జరిగిపోతున్నదని వారు వాపోతున్నారు. దీని వలన తమకు ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని వారు పెదవివిరుస్తున్నారు. 


అధికారుల పర్యవేక్షణ అవసరం

యంత్ర పరికరాలు రైతు భరోసా కేంద్రాలకు చేరిన తర్వాత అద్దెకు యంత్రాలు ఇచ్చే నిర్ణయాధికారాన్ని గ్రూపులోని సభ్యులకు వదిలేయకుండా అధికారులు కూడా పర్యవేక్షించాలని రైతులు కోరుకుంటున్నారు. గ్రామాలలో ఉండే విభేదాల కారణంగా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని పరికరాలను అందకుండా చేస్తారని వారు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా అర్హులంతా ఆ పరికరాల ప్రయోజనాన్ని పొందాలంటే గ్రూపులతో అధికారులు సమన్వయం చేసుకుని అందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుతున్నారు. 


పారదర్శకతకు పెద్దపీట

జిల్లాలోని 879 భరోసా కేంద్రాల ద్వారా రైతు కమిటీల ఎంపిక దాదాపు పూర్తయింది. ఎలాంటి ఒత్తిళ్లకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియను నిర్వహించాం. ఆయా గ్రూపుల పేరుతో బ్యాంకు ఖాతాలు కూడా తెరిచాం. ఎక్కడైనా అనర్హులు ఉన్నట్టు మా  దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. అంతిమంగా ప్రతి రైతు ఈ యంత్రపరికరాల ద్వారా లబిఽ్ధ పొందాలన్నదే మా ఆశయం. దానికోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం

Updated Date - 2020-10-01T10:58:41+05:30 IST