కుల చిచ్చుతో రాజకీయ చలిమంట!

ABN , First Publish Date - 2021-10-17T06:25:41+05:30 IST

ఆర్థిక సంక్షోభంతో దివాలా తీసే దిశగా ఆంధ్రప్రదేశ్‌ పయనిస్తోందని ఆర్థిక నిపుణులు, మేధావుల విశ్లేషణలు వింటున్న తర్వాత ‘ఏపీ ఆర్థిక సంక్షోభం-ప్రజల భవిష్యత్తు’పై తక్షణం రౌండ్‌టేబుల్‌ సమావేశం జరగాలని జనసేన కోరుకుంటోందని...

కుల చిచ్చుతో రాజకీయ చలిమంట!

ఆర్థిక సంక్షోభంతో దివాలా తీసే దిశగా ఆంధ్రప్రదేశ్‌ పయనిస్తోందని ఆర్థిక నిపుణులు, మేధావుల విశ్లేషణలు వింటున్న తర్వాత ‘ఏపీ ఆర్థిక సంక్షోభం-ప్రజల భవిష్యత్తు’పై తక్షణం రౌండ్‌టేబుల్‌ సమావేశం జరగాలని జనసేన కోరుకుంటోందని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఆ మధ్య ట్వీట్‌ చేశారు. ఆ సమావేశం జరగాలని కోరుకోవడం వరకు బాగానే ఉంది కానీ, అందులో ఫలానా వాళ్లు పాల్గొనాలని ఆయన సూచించిన వ్యక్తులపై చాలామంది అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొంటున్న పరిస్థితులపై సోషల్‌ మీడియాలో తరచూ పోస్టులు పెట్టే కొలికపూడి శ్రీనివాసరావు ఈ అంశంపై తనదైన శైలిలో స్పందించారు. ‘పవన్‌ కల్యాణ్‌ సూచించిన వారిలో చాలామంది జగన్‌కు మద్దతు ఇస్తున్న వాళ్లు ఉన్నారు. జగన్‌ సృష్టించిన ఆర్థిక అరాచకం గురించి మళ్లీ వీళ్లే చర్చలు జరుపుతారన్న మాట.. కానివ్వండి!’ అని కొలికపూడి వ్యాఖ్యానించారు. ఆయన వ్యక్తంచేసిన ఆవేదనలో అర్థం ఉంది. ఎందుకంటే పవన్‌ కల్యాణ్‌ సూచించిన వారిలో జస్టిస్‌ లక్ష్మణరెడ్డి, ఆంజనేయ రెడ్డి, ఐవైఆర్‌ కృష్ణారావు, వడ్డే శోభనాద్రీశ్వరరావు, యలమంచిలి శివాజీ వంటి వారు చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడం ద్వారా జగన్‌కు ఉపయోగపడ్డారు. జస్టిస్‌ లక్ష్మణ రెడ్డి వంటివారు రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ ఊరూవాడా తిరిగి సభలూ సమావేశాలూ నిర్వహించారు. ఇప్పుడు ఆయన లోకాయుక్తగా సేద తీరుతున్నారు. ఐవైఆర్‌ కృష్ణారావు వంటివారు ‘ఎవరి రాజధాని?’ అని అప్పట్లో చిందులు వేశారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడే రాజధాని అమరావతి పురుడు పోసుకోవడం గమనార్హం. రాజధానికి అంత భూమి ఎందుకు అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు, యలమంచిలి శివాజీ వంటివారు జగన్‌ మీడియాలో అనేక వ్యాసాలు రాశారు. ఎందరో మహానుభావులు అన్నట్టుగా ఇలా చాలామంది మేధావులుగా ప్రకటించుకుని రాజధాని అమరావతిపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచి పోషించారు. ఈ కారణంగా ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి అమరావతిని పీక నులిమి చంపుతున్నా ప్రజల నుంచి స్పందన రావడం లేదు. జగన్‌ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతోంది. అయినా ఏపీ రాజధాని ఏది? అంటే చెప్పలేని పరిస్థితి! ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత దుస్థితికి ఇలాంటి మేధావులు అందరూ కారణమే. అలాంటివారే ముందుకు వచ్చి రాష్ర్టాన్ని కాపాడాలని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కోరుకోవడం ఆయన అమాయకత్వాన్ని సూచిస్తోంది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్టుగా రాష్ట్ర ప్రస్తుత పరిస్థితికి తలా ఒక చేయి వేసిన వారిలో పలువురు ఇప్పటికీ బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోవడం విశేషం. సంక్షేమం అని చెప్పుకోవడం మినహా జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో సాధించింది ఏమీ లేదంటే అతిశయోక్తి కాదు. నవరత్నాల పేరుతో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు కూడా తూట్లు పొడుస్తున్నారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడో విద్యాసంవత్సరం నడుస్తోంది. ఇప్పటివరకు ‘అమ్మ ఒడి’ పథకాన్ని జనవరిలో అమలు చేసేవారు. ఇకపై జూన్‌ నెలలో ఈ పథకం కింద డబ్బులు ఇస్తామని అంటున్నారు. అంటే ప్రస్తుత విద్యాసంవత్సరంలో చదువుకుంటున్న వారికి ‘అమ్మ ఒడి’ డౌటే అన్న మాట. మిగతా పథకాలకు కూడా ఇలాగే తూట్లు పొడుస్తున్నారు. అయినా ప్రభుత్వం చేస్తున్న అప్పులు మాత్రం పెరిగిపోతున్నాయి. ‘‘రహదారుల మరమ్మతులకు అప్పు దొరికింది. ఇప్పటికైనా టెండర్లు వేయండి’’ అని కాంట్రాక్టర్లను అధికారులు వేడుకునే దౌర్భాగ్యం! రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ప్రతి నెలా ఒకటవ తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడా ఆందోళన బాట పట్టలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అదీ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకంటే అవమానం ఇంకొకటి ఉంటుందా? సంక్షేమం పేరు చెప్పి ఇతరుల ప్రయోజనాలను హరించాలనుకుంటే ఎలా? ఇప్పుడు జగన్‌రెడ్డి పాలనలో జరుగుతున్నది ఇదే. ప్రభుత్వ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. అయినా ఢిల్లీ ప్రభువులు రక్షకులుగా ఉన్నందున జగన్‌రెడ్డి ప్రభుత్వం రోజులు నెట్టుకొస్తోంది. విద్యుత్‌ సంక్షోభం విషయమే తీసుకుందాం. రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఏర్పడటానికి కారణం ఏమిటి? బొగ్గు నిల్వలు లేకపోవడమే కదా! సకాలంలో కొనుగోళ్లు చేసి ఉంటే బొగ్గు కొరత ఏర్పడి ఉండేది కాదు కదా! దక్షిణాది రాష్ర్టాలలో ఆంధ్రప్రదేశ్‌ మినహా ఎక్కడా విద్యుత్‌ కోతలు లేవు. అంటే ప్రస్తుత కొరత జగన్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యమే కదా! బకాయిలు చెల్లిస్తే బొగ్గు సరఫరా చేస్తామని ఆయా సంస్థలు చెబుతున్నప్పటికీ బకాయిలు చెల్లించలేని పరిస్థితి. అయినా ముఖ్యమంత్రి మాత్రం విద్యుత్‌ కొరతపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ‘నిధులకు కొరత లేదు’ అంటూ ఉత్తుత్తి ప్రకటన చేశారు. నిధులు ఉండిఉంటే బొగ్గు సరఫరా నిలిచిపోయేది కాదు కదా? విద్యుత్‌ కోతలు మరచిపోయిన ఈ రోజుల్లో రాష్ట్రంలో కోతలు విధించిన ఘనత జగన్‌ ప్రభుత్వానికే దక్కుతుంది. అందుకే జగనన్న విసనకర్ర పథకం ప్రవేశపెడతారా? అంటూ సోషల్‌ మీడియాలో వ్యంగ్యాస్ర్తాలు సర్క్యులేట్‌ అవుతున్నాయి. ఆర్థిక సంక్షోభం కమ్ముకురావడంతో ప్రభుత్వ శాఖలన్నీ దాదాపుగా నిద్రపోతున్నాయి. ఒక్క పోలీసు శాఖ మాత్రం ముఖ్యమంత్రి హిట్‌లిస్ట్‌లో ఉన్నవారిపై కేసులు పెట్టి వేధిస్తూ చురుగ్గా పనిచేస్తోంది. విద్యుత్‌ సంక్షోభం వంటి ప్రధాన అంశాలపై కూడా మంత్రులు గానీ, ముఖ్యమంత్రి గానీ స్పందించరు. సమస్య ఏ శాఖదైనా ప్రభుత్వ సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే స్పందిస్తారు. విద్యుత్‌ శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి అనే ఆయన ఒకరు ఉన్నారన్న విషయం ప్రజలు కూడా మరచిపోయారు. ఆర్థిక విధ్వంసానికి కారకుడైన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఇప్పటికీ రాష్ర్టాన్ని గాడినపెట్టడం ఎలా అని ఆలోచించకపోవడం విషాదం. సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం ప్రత్యర్థులపై కేసులు పెట్టి అరెస్టు చేయించడం అనే వ్యూహాన్ని ముఖ్యమంత్రి ఎంచుకున్నారు. జరుగుతున్న అనర్థం తెలిసి కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టుగా శాసనసభ్యులు, కొంతమంది మంత్రులు ధనార్జనపై దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయం ఆలోచించవలసిందిగా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తను ప్రభుత్వ అధికారి ఒకరు కోరగా, ‘మీ రాష్ట్రంలో ఏం మిగిలిందని పెట్టుబడి పెట్టాలి?’ అని సదరు పారిశ్రామికవేత్త ఈసడించుకున్నారట. రాష్ర్టానికి కొత్త పెట్టుబడులు రాకపోయినా గతంలో ఎవరో నెలకొల్పిన పార్కులు, ఇతర వ్యాపారాలను కబళిస్తోన్న గౌతం అదానీకి మాత్రం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారు. గంగవరం పోర్టును తనకు అమ్మేస్తే పది వేల కోట్ల రూపాయలకు పైగా చెల్లిస్తానని కొన్నేళ్ల క్రితం ఇదే గౌతం అదానీ ఆఫర్‌ ఇచ్చారు. అయినా పోర్టు యాజమాన్యం అంగీకరించలేదు. దీంతో ఆగ్రహించిన అదానీ ‘ఇదే పోర్టును సగం ధరకే సొంతం చేసుకుంటా.. మీరే చూస్తారుగా!’ అని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. అన్నంత పనీ చేశారు ఆయన. గంగవరం పోర్టు యాజమాన్యం గతంలో సైప్రస్‌ అనే దేశంలో ఎవరికో 25 వేల డాలర్లను పంపిన విషయం తెలుసుకున్న అదానీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులను ప్రయోగించారు. దీంతో పోర్టు యాజమాన్యం దిగిరాక తప్పలేదు. ఇప్పుడు ఇదే అదానీ బీచ్‌ శాండ్‌పై కన్నేశారు. ఈ క్రమంలో హెటిరో డ్రగ్స్‌ అధినేత పార్థసారథి రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌కు బినామీగా ముందుకు వచ్చారని చెబుతున్నారు. అంటే అదానీతో జగన్‌కు వ్యాపార భాగస్వామ్యం ఉండబోతోందా? అన్న అనుమానం సహజంగానే వస్తోంది. అంతకుముందే విశాఖపట్నంలోని బే పార్క్‌ హోటల్‌ను కూడా పార్థసారథి రెడ్డితో కొనిపించారు. ఈ నేపథ్యంలో పార్థసారథి రెడ్డి సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయగా, 150 కోట్ల రూపాయల నగదు దొరికింది. మరో 500 కోట్ల రూపాయల నగదుకు లెక్కలు తేలవలసి ఉందని ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రకటించారు. ఒక ఫార్మా కంపెనీలో ఇంత పెద్దఎత్తున నగదు లభించడం విశేషం. గతంలో జగన్‌రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన అవినీతి కేసుల్లో పార్థసారథిరెడ్డి సహ నిందితుడిగా ఉన్నారు. అయినా ఆయన ఇప్పటికీ జగన్‌తో కలసి పయనించడమే ఆశ్చర్యంగా ఉంది. జగన్‌రెడ్డికి గుజరాత్‌కు చెందిన గౌతం అదానీ అంత ఆప్తుడిగా ఎందుకు మారాడన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ఉంది. రాష్ట్రం గురించి, ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేయని జగన్‌రెడ్డి ఈ రెండున్నరేళ్లలో ఆర్థికంగా మరింత బలపడ్డారు. ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నందున తనకు ఢోకా లేదని ఆయన భావిస్తున్నారు. అవసరమైతే అదానీ కూడా అండగా నిలుస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈడీ కేసుల విచారణలో జాప్యం జరగడానికి ఆ శాఖ అధికారుల సహకారం ఉందని చెబుతున్నారు. ఈ కేసుల సాగదీత ఎంత కాలమో చూడాలి.


జగన్‌.. మళ్లీ సేమ్‌ ప్లాన్‌!

తన ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత నెలకొంటోందని గ్రహించిన జగన్‌రెడ్డి మళ్లీ గత ఎన్నికలకు ముందు అనుసరించిన ఎత్తుగడల అమలుకు శ్రీకారం చుట్టారు. గతంలో ఒక సామాజికవర్గానికి వ్యతిరేకంగా మిగతా వర్గాలను సమీకరించే ఎత్తుగడను అమలు చేయగా, ఇప్పుడు తనకు నమ్మకం లేని, ఇష్టం లేని సామాజికవర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా కమ్మ-, కాపులు కొట్టుకు చచ్చేలా సోషల్‌ మీడియాలో నకిలీ ఖాతాలతో పోస్టులు పెట్టిస్తున్నారు. ఇప్పటివరకు కమ్మ సామాజికవర్గాన్ని వర్గ శత్రువుగా పరిగణిస్తూ వచ్చిన జగన్‌రెడ్డి ఇప్పుడు కాపు సామాజికవర్గాన్ని కూడా వర్గ శత్రువుగా ప్రకటించారని ఆ సామాజికవర్గం నాయకులు బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో కమ్మ-, కాపుల మధ్య కుంపట్లు రాజేస్తే మిగతా వర్గాలు సహజంగానే ఆ రెండు వర్గాలకు దూరమవుతాయని జగన్‌ అండ్‌ కో ఆలోచనగా చెబుతున్నారు. ఈ వికృత రాజకీయాలు మరోసారి ఫలిస్తే ఆంధ్రప్రదేశ్‌ను ఎవరూ కాపాడలేరు. అసత్యాల పునాదులపై అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ఇప్పటికీ ముఖ్యమంత్రిగా కూడా అసత్యాలనే నమ్ముకుంటున్నారు. ఈ క్రమంలోనే బొగ్గు కొనుగోళ్లకు నిధుల కొరత లేదంటూ ప్రకటనలు. ఉద్యోగులకు ఒకటవ తేదీనే జీతాలు, పెన్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని నమ్మబలుకుతున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయవద్దా అంటూ ప్రశ్నించే వారి నోళ్లు మూయిస్తున్నారు. ఓట్ల కోసం జరుగుతున్న పంపకాలను సంక్షేమం అని గదమాయించి బతుకుతున్నారు. ప్రభుత్వం ఏ పనికి టెండర్‌ పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడాన్ని మించిన దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? పరిస్థితులు ఇలాగే దిగజారితే రాష్ట్రం చేయి దాటి పోతుంది. వచ్చే ఎన్నికల తర్వాత వెంకటేశ్వరస్వామి, జీసస్‌, అల్లా ముగ్గురూ కలసి ముఖ్యమంత్రిగా అవతరించినా రాష్ర్టాన్ని బాగుచేయలేరు. జగన్‌రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారంతా రాష్ర్టానికి ద్రోహం చేసినవారే. రాజశేఖర రెడ్డి పాలనలా ఉంటుందని అనుకున్నామే గానీ ఆయన లక్షణాలలో ఒక్కటి కూడా జగన్‌రెడ్డికి రాలేదని తమకు తెలియదని గతంలో ఆయనను సమర్థించిన కొంతమంది మేధావులు అంతర్గత సంభాషణల్లో వాపోతున్నారు. ‘గత ఎన్నికల్లో జగన్‌రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేసినందుకు ఇప్పుడు చీకట్లో చెప్పుతో కొట్టుకుంటున్నాను’ అని ఒకాయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు. ఇప్పటివరకూ మౌనంగా ఉంటూ వచ్చినవాళ్లు ఇప్పటికైనా ఆ మౌనాన్ని వీడని పక్షంలో భవిష్యత్తులో పశ్చాత్తాపపడినా ఫలితం ఉండదు.


‘మా’ కులచిచ్చు వెనుక అదృశ్యహస్తం!

ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికలు, తదనంతర పరిణామాల విషయానికి వద్దాం. ఈ ఎన్నికల పుణ్యమా అని సినిమా పరిశ్రమలోని కులాల కుంపట్లు మరోసారి రాజుకున్నాయి. సినిమావాళ్లు మరీ ఇంత సంకుచితంగా దిగజారి వ్యవహరిస్తారా? అని పలువురు విస్తుపోయారు. ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రకాశ్‌రాజ్‌ ఓడిపోయారు. విజయం సాధించిన మంచు విష్ణు తరఫున ఆయన తండ్రి మోహన్‌బాబు, మద్దతు ఇచ్చిన నరేష్‌ పోల్‌ మేనేజ్‌మెంట్‌లో పైచేయి సాధించారు. ప్రకాశ్‌రాజ్‌కు మద్దతు ప్రకటించిన చిరంజీవి వర్గం తెర వెనుకకే పరిమితమైపోయింది. మధ్యలో నాగబాబు వంటి వారు చేసిన వ్యాఖ్యలు కూడా ప్రకాశ్‌రాజ్‌ ఓటమికి పరోక్ష కారణం అయ్యాయి. స్వతంత్ర అభిప్రాయాలు కలిగిన ప్రకాశ్‌రాజ్‌ ఈ తరహా ఎన్నికలకు పనికిరారు. అయినా ప్రేరణ ఏమిటో తెలియదు గానీ ఆయన పోటీ చేశారు,- ఓడిపోయారు. ఈ సందర్భంగా కొట్టుకోవడాలూ, కొరుక్కోవడాలూ, తిట్టుకోవడాలు.. అన్నీ చూశాం. మొత్తంగా సినీనటుల పరువు బజారున పడింది. పైకి కనిపిస్తున్నది ఇంతే గానీ లోతుగా పరిశీలిస్తే దీని వెనుక బోలెడు రాజకీయాలు ఉన్నాయి. ‘మా’ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై కూడా పడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమ కమ్మ-, కాపు వర్గాలుగా విడిపోయిందని అంటున్నారు గానీ దాని వెనుక ఎవరున్నారు? ఎవరికి ప్రయోజనం? అన్న ప్రశ్నలకు సమాధానం అన్వేషించవలసి ఉంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గానీ, తెలుగుదేశం పార్టీకి గానీ ‘మా’ ఎన్నికలతో సంబంధం లేదు. అయితే ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనలు, తదనంతర పరిణామాల వెనుక అదృశ్యశక్తి ఉన్నట్టుగా అనిపిస్తోంది. జగన్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అడుగులు తెలుగుదేశం పార్టీ వైపు పడుతున్నాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ‘మా’ ఎన్నికలు జరిగాయి. ‘మా’ అధ్యక్షుడిగా నెగ్గిన మంచు విష్ణు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి బావమరిది అవుతారు. తెర వెనుక నుంచి ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన చిరంజీవి, నాగబాబు జనసేనాని సోదరులు. మంచు విష్ణు కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. దీంతో మెగా ఫ్యామిలీని ఓడించడం కోసం కమ్మ, -రెడ్డి ఒక్కటయ్యారని ప్రచారం చేశారు. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి కాపులు సహజంగానే దూరమవుతారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీతో చేతులు కలుపుదామన్న ఆలోచనతో పవన్‌ కల్యాణ్‌ ఉండి ఉంటే ఈ ప్రచారం అందుకు ప్రతిబంధకం అవుతుంది. ఈ పరిణామం వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది? ఆలోచించాలి! ఎన్నికల అనంతరం మోహన్‌బాబు తన కుమారుడు విష్ణుతో కలసి నందమూరి బాలకృష్ణను కలిశారు. ఇది పథకం ప్రకారం జరిగిందో లేక యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు గానీ తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కూడా అయిన బాలకృష్ణ పర్యవసానాలు ఆలోచించకుండా విష్ణుకు మద్దతు ప్రకటించారు. ఆ వెంటనే మోహన్‌బాబు రెండో కుమారుడు మనోజ్‌ జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. చూసేవాళ్లకు ఇదంతా గజిబిజిగా ఉంటుంది గానీ దీని వెనుక మరేదో ఉంది. జగన్‌రెడ్డిని గద్దె దించడమే తన లక్ష్యమని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించగా, చిరంజీవి మాత్రం జగన్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. మూడు రాజధానుల విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ వ్యతిరేకించగా చిరంజీవి సమర్థించారు. దీన్నిబట్టి జగన్‌ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే విషయంలో మెగా ఫ్యామిలీలో ఏకాభిప్రాయం లేదని భావించాలి. అదే సమయంలో బాలకృష్ణ చర్యల వల్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఇరకాటంలో పడ్డారు. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి మాత్రమే లాభిస్తుంది. కమ్మ, రెడ్డి ఒక్కటేనని ప్రచారం చేయడం వల్ల కాపులను తెలుగుదేశం పార్టీకి దూరం చేయవచ్చు. పవన్‌ కల్యాణ్‌ నుంచి చిరంజీవిని దూరం చేయగలిగితే ఎంతో కొంత లాభపడేది జగన్‌ మాత్రమే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ వాతావరణం ప్రకారం చంద్రబాబు,- పవన్‌ కల్యాణ్‌ కలిసి పోటీ చేస్తే జగన్‌రెడ్డి అధికారం కోల్పోవడం తథ్యంగా కనిపిస్తోంది. ఈ కారణంగానే వీరిరువురూ కలిసినా ఓట్ల బదిలీ సజావుగా జరగకుండా నివారించడానికి కమ్మ,-కాపుల మధ్య వైషమ్యాలకు తెర తీశారని చెప్పవచ్చు. ‘మా’ ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఈ అనుమానాలకు ఊతమిస్తోంది. కాపులను కించపరుస్తూ పెడుతున్న పోస్టులను కమ్మ సామాజికవర్గం వారే పెడుతున్నారని అనుమానించేలా ఫలానా ‘చౌదరి’ అంటూ ఆ పోస్టుల కింద పేర్లు పెడుతున్నారు. నిజానికి పేరు చివర చౌదరి అన్న తోక తగిలించుకొనే కమ్మవారు చాలా తక్కువ ఉంటారు. కానీ వైసీపీ సోషల్‌ మీడియా మాత్రం అందరికీ ‘చౌదరి’ అనే తోక తగిలిస్తోంది. ఈ ట్రిక్‌నే ఉపయోగిస్తూ ఇప్పుడు నకిలీ ఖాతాల ద్వారా కాపులను రెచ్చగొట్టేలా ప్రచారం చేస్తున్నారు. వెయ్యి మంది సభ్యులు కూడా లేని ‘మా’కు జరిగిన ఎన్నికలను కూడా రాజకీయం కోసం వాడుకోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది. చిత్ర పరిశ్రమ సాలీనా టర్నోవర్‌ 1,500 కోట్ల రూపాయలకు మించి ఉండదు. అయినా మనకు ఎంతోమంది స్టార్లు తయారయ్యారు. వారి వెనుక కులాలు చేరాయి. గతంలో సినీనటుల కులాల గురించి ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు కులం పిచ్చి పెరిగిపోవడంతో ఎప్పుడో చనిపోయిన అద్భుత నటులకు కూడా కులాలు అంటగట్టారు. ఈ ధోరణినే జగన్‌రెడ్డి వంటి వారు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. అదే సమయంలో ఇప్పుడు కమ్మ, -కాపులను వర్గ శత్రువులుగా ప్రకటించుకున్నారు. ‘మా’ ఎన్నికలు కూడా ఈ శక్తులకు ఉపయోగపడ్డాయి. సినిమావాళ్లు ఇప్పటికైనా సంకుచిత ధోరణులకు స్వస్తి చెప్పని పక్షంలో ప్రభుత్వాలకు గులాంగిరీ చేయక తప్పదు. రాజకీయ నాయకులకు పావులుగా చిక్కితే మొత్తం చిత్ర పరిశ్రమ మనుగడకే ప్రమాదం ముంచుకొస్తుంది. తస్మాత్‌ జాగ్రత్త!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2021-10-17T06:25:41+05:30 IST