ధన్‌బాద్ జడ్జి హత్య కేసులో రాజకీయ కోణం!

ABN , First Publish Date - 2021-07-31T23:36:13+05:30 IST

జార్ఖండ్‌లోని ధన్‌బాద్ అదనపు జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్

ధన్‌బాద్ జడ్జి హత్య కేసులో రాజకీయ కోణం!

ధన్‌బాద్ : జార్ఖండ్‌లోని ధన్‌బాద్ అదనపు జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ దారుణ హత్య వెనుక రాజకీయ కోణం ఉందని బీజేపీ నేత రంజయ్ సింగ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. రంజయ్ హత్య కేసును ఉత్తమ్ విచారిస్తున్నారని తెలిపారు. జడ్జి హత్య కేసును సుప్రీంకోర్టు స్వీయ విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. 


ఉత్తమ్ ఆనంద్ హీరాపూర్‌లోని జడ్జీల కాలనీలో నివసించేవారు. బుధవారం ఉదయం ఆయన మోర్నింగ్ వాక్‌కు వెళ్ళి, తిరిగి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడి, ఓ ఆసుపత్రిలో మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనను రోడ్డు ప్రమాదంగా మొదట్లో భావించారు. కానీ ఆయన కుటుంబ సభ్యులు దీని వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించారు. 


బీజేపీ నేత  రంజయ్ సింగ్ తండ్రి కేశవ్ సింగ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుడిని, ధన్‌బాద్ జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను రాజకీయ ప్రత్యర్థులు హత్య చేశారని ఆరోపించారు. ఉత్తమ్ చాలా నిజాయితీపరుడని, తన కుమారుడి హత్య కేసును ఆయన విచారిస్తున్నారని చెప్పారు. ఆయన నిజాయితీపరుడైనందువల్లే ఆయనను రాజకీయ ప్రత్యర్థులు హత్య చేశారన్నారు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. జడ్జి ఉత్తమ్‌పైనే తాము ఆశలు పెట్టుకున్నామని చెప్పారు. 


జడ్జి ఉత్తమ్ హత్య కేసుపై సుప్రీంకోర్టు స్వీయ విచారణ జరుపుతోంది. జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి శుక్రవారం నోటీసులు పంపించింది. ఓ వారంలోగా దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశించింది. 


Updated Date - 2021-07-31T23:36:13+05:30 IST