Americans లో కొత్త టెన్షన్.. ఆ వ్యాధిని జయించామంటూ అగ్రరాజ్యం ప్రకటించిన పదేళ్ల తర్వాత New York లో అనూహ్య పరిణామం..!

ABN , First Publish Date - 2022-07-22T15:35:52+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా (America)లో కొత్త టెన్షన్ మొదలైంది.

Americans లో కొత్త టెన్షన్.. ఆ వ్యాధిని జయించామంటూ అగ్రరాజ్యం ప్రకటించిన పదేళ్ల తర్వాత New York లో అనూహ్య పరిణామం..!

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా (America)లో కొత్త టెన్షన్ మొదలైంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత గురువారం తొలిసారిగా పోలియో వైరస్ కేసు నమోదైంది. ఆ వ్యాధిని జయించామంటూ అగ్రరాజ్యం ప్రకటించిన పదేళ్ల తర్వాత ఉత్తర మాన్‌హటాన్‌కు 30 మైళ్ల దూరంలో రాక్‌లాండ్ కౌంటీలో ఉంటున్న ఓ వ్యక్తికి పోలియో వైరస్ సోకినట్లు తేలింది. 20 ఏళ్ల ఓ యువకుడికి పోలియో పాజిటివ్‌గా తేలిందని గురువారం న్యూయార్క్ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అతడు జూన్‌లో ఆస్పత్రిలో చేరగా.. వివిధ పరీక్షల అనంతరం గురువారం యువకుడికి పోలియో ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం యువకుడు లేచి నిలబడుతున్నాడు, కానీ నడవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నాడని అతడికి చికిత్స అందించిన ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన యువకుడు ఇంటి వద్ద భార్యాపిల్లలతో ఆనందంగానే ఉన్నాడని చెప్పుకొచ్చారు. కాగా, యూఎస్‌లో చివరిసారిగా 2013లో పోలియో వైరస్ కనిపించినట్టు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది.


ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన పోలియో వైరస్ కేసు.. ఓరల్ పోలియో వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి నుంచి ఈ పౌరుడికి వైరస్ సోకినట్టుగా సంకేతాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కానీ, అమెరికాలో ఓరల్ పోలియో వ్యాక్సిన్ 2000లోనే బ్యాన్ చేశారు. అంటే.. అమెరికా పౌరుడికి ఈ వైరస్ దేశం వెలుపల నుంచి సోకి ఉండొచ్చని అధికారులు ప్రాథమిక అభిప్రాయానికి వచ్చారు. అలాగే ఆ యువకుడు నివసిస్తున్న ప్రాంతంలో మరిన్ని టెస్టులు చేయాల్సి ఉందన్నారు. అంతేగాక ఆ ప్రాంతం ప్రజలు ఒక వేళ టీకా వేసుకోకపోతే వెంటనే వేసుకోవాలని ఆరోగ్య అధికారులు సూచించారు. ఇక పోలియో అనేది నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే వైరల్ వ్యాధి. దీని కారణంగా కండరాలు బలహీనపడి కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీస్తుంది. 


ఇదిలాఉంటే.. 1988లో వరల్డ్‌వైడ్‌గా పోలియో రక్కసి స్వైర విహారం చేసిన విషయం తెలిసిందే. 125 దేశాలు పోలియోతో తల్లడిల్లాయి. కానీ, ప్రపంచ దేశాలన్ని కలిసికట్టుగా చర్యలు తీసుకోవడంతో 1988 నుంచి పోలిస్తే, ఇప్పుడు 99 శాతం కేసులు తగ్గిపోయాయి. అమెరికాలోనైతే 1950లోనే కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇక ఆరవైలలో పోలియో టీకా రావడం దాని ప్రభావం పూర్తిగా తగ్గింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు దేశాల్లోనే పోలియో కేసులు ఉన్నాయి. అత్యధికంగా పాకిస్థాన్‌లో 11 పోలియో కేసులు ఉంటే, ఆఫ్గనిస్థాన్‌లో ఒకటి, ఇప్పుడు అగ్రరాజ్యంలో ఒకటి నమోదైంది. దాయాది పాక్‌లో పోలియో కేసుల పెరుగుదలకు రెండు కారణాలు ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. మొదటిది- పోలియో చుక్కలు వేయించడంలో ఇక్కడి ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం. రెండవది- టీకా వేసిన తర్వాత వేలిపై మార్కింగ్ వేసుకోవడం లేదట. దాంతో ఎవరు టీకా వేసుకున్నారు, ఎవరు వేసుకోలేదు అనేది తెలియడం లేదు. 

Updated Date - 2022-07-22T15:35:52+05:30 IST