ఎమ్మెల్సీ పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం

ABN , First Publish Date - 2021-03-01T06:43:37+05:30 IST

మార్చి 14న నిర్వహించే నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు.

ఎమ్మెల్సీ పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం
పోలింగ్‌ కేంద్రంగా ఎంపిక చేసిన కురవి జడ్పీహెచ్‌ఎ్‌స పాఠశాల

మహబూబాబాద్‌ జిల్లాలో 36,633 ఓటర్లు 


53 పోలింగ్‌ కేంద్రాలు 


మహబూబాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : మార్చి 14న నిర్వహించే నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. జిల్లాలోని 16 మండలాల్లో 36,633 మంది ఓటర్లు ఉండగా వారికోసం 53 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లలో పురుషులు అత్యధికంగా 25,386 మంది ఉండగా మహిళలు 11,243 మంది ఉన్నారు. ఇతరులు నలుగురు ఉన్నారు. పట్టభద్రులందరూ ఓటుహక్కు వినియోగించుకునేలా 16 మండలాలను తొర్రూరు, మహబూబాబాద్‌ డివిజన్‌లుగా విభజించి ప్రతీ మండల కేంద్రంలో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొర్రూరు డివిజన్‌లో చిన్నగూడూరు, దంతాలపల్లి, మరిపెడ, నర్సింహులపేట, నెల్లికుదురు, పెద్దవంగర మండలాలు ఉండగా 22 పోలింగ్‌ కేంద్రాలు, మహబూబాబాద్‌ డివిజన్‌లో గూడూరు, కేసముద్రం, మహబూబాబాద్‌, డోర్నకల్‌, కురవి, బయ్యారం, గార్ల, కొత్తగూడ, గంగారం మండలాలు ఉండగా ఇందులో 31 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా అధికారులు ఈ కేంద్రాలను పరిశీలించి అన్ని వసతులు కల్పించేలా ఏర్పాట్లు చేశారు. అత్యధికంగా మహబూబాబాద్‌ మండలంలోనే 9 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా తొర్రూరు మండలంలో 7 పోలింగ్‌ కేంద్రాల చొప్పున ఏర్పాటు చేశారు. అత్యల్పంగా చిన్నగూడూరు, గంగారంలలో ఒక్కొక్కటి చొప్పున పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దంతాలపల్లి, నర్సింహులపేట, పెద్దవంగర, గూడూరు, బయ్యారం, కొత్తగూడ మండలాల్లో రెండు పోలింగ్‌ కేంద్రాల చొప్పున, ఒక్క గార్ల మండలంలోనే మూడు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా మరిపెడ, నెల్లికుదురు, కేసముద్రం, డోర్నకల్‌, కురవి మండలాల్లో నాలుగు చొప్పున పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 


Updated Date - 2021-03-01T06:43:37+05:30 IST