పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టండి

ABN , First Publish Date - 2022-02-16T14:45:39+05:30 IST

ప్రశాంతంగా ఓటింగ్‌ జరిపేందుకు వీలుగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థికి మద్రాస్‌ హైకోర్టు జరిమానా విధించింది. అలాగే, ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను

పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టండి

- హైకోర్టును ఆశ్రయించిన స్వతంత్ర అభ్యర్థి

- జరిమానా విధించిన న్యాయస్థానం


అడయార్‌(చెన్నై): ప్రశాంతంగా ఓటింగ్‌ జరిపేందుకు వీలుగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థికి మద్రాస్‌ హైకోర్టు జరిమానా విధించింది. అలాగే, ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. చెన్నై నగర పాలక సంస్థకు ఈ నెల 19వ తేదీన ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. కార్పొరేషన్‌ 182 వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా సతీష్‌ కుమార్‌ అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. ఈయన మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికలను నిష్పక్షిపాతంగా జరిపేందుకు అనువుగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మునీశ్వర్‌నాధ్‌ భండారి, న్యాయమూర్తి భరత్‌ చక్రవర్తిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ ఆర్‌.షణ్ముగం వాదనలు వినిపిస్తూ.. నగర పాలక, పురపాలక సంస్థల ఎన్నికల సమయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, మార్గదర్శకాలకు లోబడి ఈ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోందని తెలిపారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా ధర్మాసనం ముందుంచారు. ఆయన వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. సతీష్ కుమార్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అంతేగాక తమ సమయాన్ని వృథా చేశారంటూ పిటిషనర్‌కు రూ.5 వేల జరిమానా విధించింది. 

Updated Date - 2022-02-16T14:45:39+05:30 IST