Abn logo
Apr 16 2021 @ 23:55PM

పోలింగ్‌కు అంతా సిద్ధం

వెంకటాచలం : పోలింగ్‌ సామగ్రిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఐజీ త్రివిక్రమవర్మ

2470 పోలింగ్‌ కేంద్రాలు.. 17,10,699 మంది ఓటర్లు

ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలు


 నెల్లూరు (ఆంధ్రజ్యోతి), ఏప్రిల్‌ 16 : తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. ఇందుకు సంబంధించి జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాలు సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేటతోపాటు చిత్తూరు జిల్లాలోని మూడు నియోజకవర్గాల తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడులలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 2470 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 17,10,699 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తిరుపతి ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రాధాన్యంగా తీసుకోవడంతో జిల్లా అధికార యంత్రాంగంపై కూడా తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ ప్రభావంతోనే రికార్డు స్థాయిలో 10,850 మంది సిబ్బంది తిరుపతి ఉప ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 1241 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ సరళిని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ద్వారా ప్రజలు కూడా ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. 877 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో భాగంగా 28 కంపెనీల కేంద్ర బలగాలు, మూడు స్పెషల్‌ పోలీసు ఫోర్స్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నాయి. 


డీకేడబ్ల్యూలో కౌంటింగ్‌


పోలింగ్‌ ముగిసిన అనంతరం ఈవీఎం యంత్రాలు, వీవీ ప్యాట్‌లను నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో భద్రపరచనున్నారు. ఇక్కడే మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా ఈ ఎన్నికలకు సంబంధించి సామగ్రి పంపిణీ శుక్రవారం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి క్యూబా ఇంజనీరింగ్‌ కాలేజీలో, గూడూరు నియోజకవర్గానికి సంబంధించి జడ్పీ హైస్కూల్‌లో, వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో, సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి నాయుడుపేట ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఈవీఎంలు, వీవీప్యాడ్‌, ఇతర పోలింగ్‌ సామగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ ప్రక్రియను కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు, ఐజీ త్రివిక్రమవర్మ, ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌, జేసీలు ఎన్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎంఎన్‌ హరేందిరప్రసాద్‌, టి బాపిరెడ్డిలు పరిశీలించారు. 


స్వచ్ఛందంగా ఓటు వేయండి!


ఓటర్లంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు కోరారు. శుక్రవారం ఆయన నెల్లూరులోని తిక్కన భవన్‌లో పోలీసు అబ్జర్వర్‌ రాజీవ్‌కుమార్‌, ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈవీఎంలు, ఇతర సామగ్రి కొరత లేకుండా అదనంగా అందుబాటులో ఉంచామని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల్లో వేసవి, కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకొని మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక కార్డును ఓటు వేసేందుకు తీసుకురావాలని  కోరారు.  పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకోని దివ్యాంగులకు ఓటు వేసే సమయంలో సహాయం చేసేందుకు  రెడ్‌క్రాస్‌ వలంటీర్లు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. 

పోలింగ్‌కు మేం రెడీ.. కేంద్రాలకు తరలివెళుతున్న సిబ్బంది


తడ : ఇరకందీవికి పోలింగ్‌ సామగ్రితో పడవలో బయలుదేరిన సిబ్బంది, పోలీసులు


Advertisement
Advertisement
Advertisement