‘సగం’లోనే ముంచేసి!

ABN , First Publish Date - 2021-11-30T08:38:18+05:30 IST

‘‘మీ కష్టాలను నేను చూశాను. మీ బాధలను నేను విన్నాను. మీ అందరికీ ఇవాళ చెబుతున్నాను. ఆరు నెలల నుంచి సంవత్సరం నాకు సమయమివ్వండి. ఈ రాష్ట్రాన్ని ప్రక్షాళన చేస్తా. అవినీతి అన్నది పైస్థాయి నుంచి కింది స్థాయి దాకా లేకుండా చేస్తానని మాట ఇస్తున్నా’’

‘సగం’లోనే ముంచేసి!

  • అధికార ప్రస్థానంలో సగం పూర్తి
  • చట్టాలు, నిబంధనలు బేఖాతరు
  • ‘సర్వం నేనే’ అనేలా సాగుతున్న పాలన
  • వచ్చీ రాగానే ‘ప్రజా వేదిక’ కూల్చివేత
  • ఎమ్మెల్యేలకూ దొరకని సీఎం దర్శనం
  • అధికారులు చెప్పింది చేయాల్సిందే
  • సంక్షేమం పేరిట ‘పథకాల’ మాయ
  • రెండున్నరేళ్లలో రూ.3 లక్షల కోట్ల అప్పు
  • రాష్ట్రానికి శాపంగా మారిన విధానాలు


‘‘మీ కష్టాలను నేను చూశాను. మీ బాధలను నేను విన్నాను. మీ అందరికీ ఇవాళ చెబుతున్నాను. ఆరు నెలల నుంచి సంవత్సరం నాకు సమయమివ్వండి. ఈ రాష్ట్రాన్ని ప్రక్షాళన చేస్తా. అవినీతి అన్నది పైస్థాయి నుంచి కింది స్థాయి దాకా లేకుండా చేస్తానని మాట ఇస్తున్నా’’


రెండున్నరేళ్ల కిందట, అంటే 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగన్‌ చెప్పిన తొలి పలుకులు ఇవి. ఆయన చెప్పిన ఆరు నెలలు గడిచిపోయాయి. సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు... నేటితో ఆయన పాలనా ప్రస్థానంలో సగం పూర్తయింది. ఈ రెండున్నరేళ్లలో ఆయన రాష్ట్రాన్ని నిజంగానే ప్రక్షాళన చేశారా? ముందుకు తీసుకెళ్లారా... లేక ‘రివర్స్‌’ బాట పట్టించారా! ఆయన పాలనా తీరు ఎలా ఉంది? 



‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక, విశ్లేషణాత్మక కథనం 2లో...


‘ఎంత గొప్ప మాటలు! ఎంత గొప్ప నాయకుడు! ఇంతటి వినయ విధేయతలు ఏ నాయకుడిలోనూ కనిపించలేదు. ఎంతో మేలు చేస్తానంటున్నాడు. ఈ నాయకుడు చల్లగా ఉండాలి!’


...ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్‌ రెడ్డి తొలిపలుకులు విని జనంఇంతలా పులకించిపోయారు. ఇలా పులకించిన వారిలో తెలుగుదేశం అభిమానులూ ఉన్నారు.


‘‘అన్నా... అని పిలిచారు. మీరూ మేమూ కలిసి పనిచేద్దామన్నా అన్నారు. ఇంతబాగా ఏ ముఖ్యమంత్రీ పలకరించలేదు. ఇంత గొప్ప లక్షణాలు ఎవరిలోనూ కనిపించలేదు! ఈయన కోసం, ఈ రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు పని చేయాలి!’’


ముఖ్యమంత్రిగా జగన్‌ నిర్వహించిన తొలి సమీక్ష సమావేశంలో ఆయన శైలి మెచ్చి, నచ్చి సీనియర్‌ ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు మనసులో గట్టిగా చేసుకున్న తీర్మానం!


ఇదంతా జరిగి సరిగ్గా రెండున్నరేళ్లు! ముఖ్యమంత్రిగా జగన్‌ రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన తొలి పలుకుల్లోని తీపి కొన్నాళ్లకే కరిగిపోయింది. పలకరింపుల్లోని ఆప్యాయత పైపూతే అని అర్థమైపోయింది. ఆయన అసలు తీరేమిటో అధికారులకు కొన్నాళ్లకే స్పష్టమైంది. ఏమిటి సంగతి అని ఇప్పుడు ఎవరినైనా పలకరిస్తే... ‘ముఖ్యమంత్రిగా జగన్‌ పాలన సగం పూర్తయింది. రాష్ట్రం మాత్రం పూర్తిగా మునిగిపోయింది’ అనే అంటున్నారు. 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘నా ఇష్టం. నా రాజ్యం. నాకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి... ఏమైనా చేస్తా!’... జగన్‌ వైఖరి ఇదేనని చెబుతారు. ‘‘ఆయన ఏదో అనుకుంటారు. అది జరిగి తీరాలంటారు. నిబంధనలు, చట్టాలు ఎలా ఉన్నా పట్టించుకోరు. అందుకే... పదేపదే కోర్టులతో చీవాట్లు తింటున్నాం’’ అని ఒక సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా... సంబంధిత అంశాల్లో అనుభవమున్న అధికారులు, న్యాయ నిపుణులను సంప్రదించకుండానే జగన్‌ నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి వాటిల్లో ‘అమ్మ ఒడి’  ఒకటి! ఈ పథకం మంచి చెడ్డలు, ఆచరణలో ఇబ్బందులు, అంతకుముందున్న ఇతర పథకాలను తొలగించడంవల్ల తలెత్తే పరిణామాలేవీ పట్టించుకోలేదు. ఎవరైనా అధికారి నోరు విప్పి సమస్యలను వివరిస్తే... సీఎం సమీక్షలకు మరోసారి ఆ అధికారికి పిలుపు అందదు. సీఎం చెప్పారని ఆర్భాటంగా స్కీమ్‌లు అమలు చేయడం, అవి రానురాను అప్పుల భారాన్ని మోసుకొస్తుండటంతో క్రమక్రమంగా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేలా కోతలు మొదలుపెట్టారు. ఇక ముఖ్యమైన చట్టాల సవరణ, బిల్లుల తయారీలోనూ సీఎం ఆదేశాలే కీలకం. రాష్ట్రం ఎడాపెడా సొంతంగా చట్టాలు చేసుకునే అవకాశంలేదు. అవి.. కేంద్ర చట్టాలను ధిక్కరించేలా రాష్ట్ర చట్టాలు ఉండకూడదు. ఈ విషయాన్ని కూడా జగన్‌ పట్టించుకోరు. చివరికి... కేంద్రం వాటిని ఆమోదించకుండా తిరుగు టపాలో పంపిస్తుంది. ‘దిశ’ దీనికి ఉత్తమ ఉదాహరణ. టైటిల్‌ బిల్లు కూడా ఇలాంటిదేనని రిటైర్డ్‌ అధికారులు తెలిపారు.


వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ సీఎం...

‘కరోనా వచ్చాక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు. కానీ... మా సీఎం ఎప్పటి నుంచో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌’ అని అధికారులు సరదాగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రతి ముఖ్యమంత్రికీ ‘క్యాంప్‌ ఆఫీస్‌’ ఉంటుంది. కానీ... అసలు ఆఫీస్‌ మాత్రం సచివాలయమే. జగన్‌ వచ్చీ రాగానే అమరావతిని అటకెక్కించారు. టీడీపీ హయాంలో నిర్మితమైన సచివాలయాన్ని ‘గుర్తించడం’ మానేశారు. కేబినెట్‌ సమావేశాలకు మాత్రమే ఆయన సచివాలయానికి వెళ్తున్నారు. మిగిలిన పని మొత్తం తాడేపల్లిలోని తన నివాసం ప్రాంగణంలోని క్యాంప్‌ ఆఫీసు నుంచే! ‘జగన్‌ ఎక్కడుంటే ఏం? సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు కదా?’ అని సమర్థించేవారూ ఉండొచ్చు. కానీ... ఆయన నిర్వహించే సమీక్షలు ఉత్తుత్తివే అని అధికార వర్గాలే చెబుతాయి. ‘‘సమీక్ష పేరిట క్యాంప్‌ ఆఫీసుకు ఎంపిక చేసిన అధికారులను పిలిపిస్తారు. ఒక అరగంట కూర్చోబెడతారు. జగన్‌ నాలుగు ముక్కలు తాను చెప్పాల్సింది చెబుతారు. అవతలి వారు చెప్పేది వినకుండా వెళ్లిపోతారు’’ ఇదే సీఎం సమీక్షల తీరు అని ఒక రిటైర్డ్‌ అధికారి తెలిపారు. విపక్షనేతగా యాత్రలు, ఓదార్పుల పేరిట నిత్యం రోడ్ల మీద ఉన్న జగన్‌... ముఖ్యమంత్రి కాగానే ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ మొదలుపెట్టారు.


అంతకుముందు... రాష్ట్రంలో ప్రమాదాలు జరిగినా, విపత్తులు వచ్చినా ఆగమేఘాల మీద అక్కడ వాలేవారు. ప్రభుత్వాన్ని తూర్పారబట్టేవారు. వరదలొస్తే ఆకాశంలో కాదు... నేలమీదకు రావాలని ఒకసారి అప్పటి సీఎం చంద్రబాబును విమర్శించారు. ఆయన సీఎం అయ్యాక...  వరదలొచ్చినా, విపత్తులొచ్చినా బయటకు రావడం లేదు.  తప్పనిసరయితే ఏరియల్‌ సర్వేలతో సరిపెడుతున్నారు. ‘పైపైన తిరిగితే ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయి?’ అని విపక్షాలు ప్రశ్నిస్తే... ‘నేను వెళితే ఫోకస్‌ మొత్తం నామీదే ఉంటుంది. అధికారులు అనుభవపూర్వకంగా చెప్పారు’ అని ఓ వింత సమాధానం చెప్పడం విశేషం.


జనం సొమ్ముతో ‘సొంత’ మేలు!

పాలకుడు ప్రజాధనానికి ధర్మకర్తగా ఉండాలి. కానీ... సొంత మీడియాలో పని చేసే వారికి, ‘అస్మదీయులకు’ అర్హతలతో సంబంధం లేకుండా ఎడాపెడా ఏదో ఒక పోస్టు కట్టపెట్టడం జగన్‌ సర్కారుకే చెల్లింది. చట్టబద్ధత, నిబంధనలతో నిమిత్తం లేకుండా ఇష్టానుసారం ‘హోదా’లు కట్టబెడుతున్నారు. ఒక లెక్క ప్రకారం... 2 లక్షల రూపాయలకు పైబడి నెలవారీ జీతం తీసుకొనే వారి సంఖ్య వందకుపైనే ఉంది. వీరికి సలహాదారులని, స్పెషల్‌ అధికారులని పేర్లుపెడుతున్నారు. ఈ సలహాదారుల్లో ఒక్కరంటే ఒక్కరూ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిన దాఖలాలు లేవు. సలహాలు ఇవ్వాలనుకుని భంగపడి... సిగ్గుతో కొందరు ఇంటికి వెళ్లిపోయారు. అత్యధికులు హోదాను, జీతాన్ని ఇంట్లోనే కూర్చుని అనుభవిస్తున్నారు. వారు ఉన్నారా? లేరా? ఏం చేస్తున్నారు? ప్రజల సొమ్ము జీతంగా తీసుకొంటూ డ్యూటీ చేస్తున్నారా? అని ఎవ్వరూ అడగరు. అడగకూడదు అంతే!


ఏపీ... ఎవరికి తెలుసు?

నిన్నటికి నిన్న టాటా గ్రూప్‌ దక్షిణాదిలో 2వేల కోట్ల రూపాయలతో  సెమీ కండక్టర్‌ అసెంబ్లింగ్‌  పరిశ్రమ పెట్టాలనుకొంది. ఇందుకు ఏ రాష్ట్రం అనువైనదో బేరీజు వేసుకుంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలను మాత్రమే పరిశీలించింది. కానీ... దక్షిణాదిలోనే ఆంధ్రప్రదేశ్‌ అనేది ఒకటుందన్న విషయం ‘టాటా’ పట్టించుకోలేదు. 


ప్రజలను కలిసిందేదీ?

మండల, జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు అనేకం ఉంటాయి. ముఖ్యమంత్రికి విన్నవించుకుంటే ఫలితముంటుందని ప్రజలు భావిస్తారు. సీఎం ఆఫీసు నుంచి వివరణ కోరితే జిల్లా అధికారులూ స్పందిస్తారు. ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రులు ‘ప్రజాదర్భార్‌’ అనే మరో పేరుతోనే నేరుగా ప్రజలను కలిసేవారు. వారిచ్చే వినతులను స్వీకరించేవారు. చంద్రబాబు ‘ప్రజా వేదిక’లో ప్రజలను కలిసేవారు. జగన్‌ ముఖ్యమంత్రికాగానే చేసిన మొట్టమొదటి పని... ఆ ‘ప్రజా వేదిక’ను కూల్చేయడమే! ఆ తర్వాత ఆయనవన్నీ రాజ దర్భార్‌లే! ప్రజలను కలిసేందుకు ఒక వేదికే లేదు. అలాంటి కార్యక్రమమూ లేదు. ఈ రెండున్నరేళ్లలో ఆయన ప్రజల్లోకి వెళ్లిన సందర్భాలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. సమీక్షలు నిర్వహించినా, బటన్‌ నొక్కి నిధులు విడుదల చేసినా, ప్రారంభోత్సవాలు/శంకుస్థాపనలు చేయాల్సి వచ్చినా... అన్నీ తాడేపల్లి భవనం నుంచే!


ఎవరికి ‘మేలు’...

జగన్‌ వ్యవహారశైలి కొందరు అధికారులకు బాగా నచ్చుతోంది. ఎందుకంటే... ఆయన చెప్పింది చేస్తే చాలు. అంతకుమించి ఏదీ అడగరు. ఆ శాఖకు సంబంధించిన పథకాలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో చూడరు. ‘‘ముఖ్యమంత్రి ఇదేమిటి అని అడగకపోవడమే హాయి. ఏదైనా చేస్తేనే సమస్య. అసలు ఏదీ చేయకపోతే ఏ సమస్య ఉండదు కదా!’’ అని కొందరు అధికారులు భావిస్తున్నారు. తాను చెప్పింది చెప్పినట్లు చేసే అధికారులు ఎలాంటి వారైనా ముఖ్యమంత్రి పట్టించుకోరు. లెక్కలేనన్ని ఆరోపణలు వచ్చినా, ఇంటెలిజెన్స్‌ నివేదికలు ఉన్నా సరే! ఉదాహరణకు... న్యాయశాఖ కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఆ పోస్టులో ఉండి అవినీతికి పాల్పడ్డారంటూ హైకోర్టు జోక్యం చేసుకొని సస్పెండ్‌ చేసింది. అంతే తప్ప... ముఖ్యమంత్రి ఏమీ చేయలేదు. పైగా... ‘మాకు ఆయనే న్యాయశాఖ కార్యదర్శిగా కావాలి’ అని అప్పట్లో పట్టుపట్టారు.  మరోవైపు... ఏదైనా శాఖలో సమాచారం లీక్‌ అవుతోందనే అనుమానంతో అధికారులను, సిబ్బందిని సస్పెండ్‌ చేయడమనే కొత్త వైఖరి ఈ ప్రభుత్వమే మొదలుపెట్టింది. 


తాగుడుతో సంక్షేమం

దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పారు. ఇప్పుడు... మద్యంపై వచ్చే భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి, దాంతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని స్పష్టంగా చెబుతున్నారు. మద్యం వద్దంటే సంక్షేమం ఆగిపోతుందనే వ్యూహం తెరపైకి తెచ్చారు.


సంక్షేమ మాయ

‘మాది తిరుగులేని సంక్షేమం’ అంటూ జగన్‌ సర్కారు గొప్పలు చెప్పుకుంటుంది. కానీ... పథకాల పేరు, అమలు తీరు మార్చడం తప్ప కొత్తగా చేకూర్చి న లబ్ధి ఏదీ లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నా రు. సంక్షేమంలో ఉన్న మతలబు ఇది...పెరగని పింఛను: 2000 ఉన్న సామాజిక పింఛనును విడతల వారీగా రూ.3 వేలు చేస్తామన్నారు. అది... ప్రస్తుతం రూ.2250 వద్దే ఆగిపోయింది.


అందరికీ ఇస్తూ... 

అమ్మఒడి, ఆసరా, చేయూత,  స్వయం సహాయక సంఘాలకు రుణం, బ్యాంకు లింకేజీ, సంపూర్ణ పోషణ, పాలవెల్లువ, రైతుభరోసా, ఇళ్ల స్థలాలు, వాహనమిత్ర, ఆరోగ్యశ్రీ వంటివి రాష్ట్రంలో అందరికీ అమలు చేస్తున్న పథకాలు. కానీ, జగన్‌ సర్కారు అతి తెలివి ప్రదర్శిస్తూ కులాలు, మతాల వారీగా లబ్ధిదారుల లెక్క తీసి... వారికి చేసిన మేలుగా చెప్పుకొంటోంది. 


బడుగులకు అన్యాయం

దళితులు, గిరిజనుల కోసం అంతకుముందు ప్రత్యేకంగా  అమలు చేసిన సంక్షేమ, ఆర్థిక స్వావలంబన కార్యక్రమాలను ప్రభుత్వం ఎత్తేసింది. గతంలో వివిధ కులాల కార్పొరేషన్లు, ఆర్థిక సంస్థలకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించేవారు. ఆ కార్పొరేషన్లు ప్రత్యేకంగా ఆయా వర్గాలకు చెందిన వారికోసం కార్యక్రమాలు అమలు చేసేవి. జగన్‌ వచ్చాక వాటిని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మాత్రమే మార్చేశారు. వాటి ‘ఆర్థిక రెక్కలు’ విరిచేశారు.


అభివృద్ధి.. దాని గురించి అడగొద్దు

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంక్షేమం, అభివృద్ధి రెండూ ముఖ్యమే. అప్పులు చేసి ‘సంక్షేమ మాయ’ చేస్తున్న సర్కారు... అభివృద్ధిని అటకెక్కించింది. పెట్టుబడులు, పరిశ్రమలు ‘రివర్స్‌’ బాటలో ఉన్నాయి. ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. 


రెవెన్యూ పెంచుకోకపోతే ఎలా?

జీతాల నుంచి పథకాల దాకా... అన్నింటికీ అప్పుల మీద ఆధారపడటమే! సొంతంగా ఆదాయం పెంచుకోవాలన్న ధ్యాసే లేదు. రెవెన్యూ పెంచుకోవడమంటే... పన్నులు పెంచడం కాదు. ప్రైవేటు రంగంలో కార్యకలాపాలు పెరిగే వాతావరణం కల్పించి... పన్ను ఆదాయం పెంచుకోవడం. తెలంగాణలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఏపీకి వచ్చేసరికి... ‘అక్కడ ఏముందని పెట్టుబడి పెట్టాలి?’ అనే ప్రశ్నే వినిపిస్తోంది. 


అప్పుల కుప్ప... 

పంచుడు తప్ప ఆదాయం పెంచే పనులేవీ చేయకపోవడంతో సహజంగానే రాష్ట్రంపై అప్పుల భారం రోజురోజుకూ పెరుగుతోంది. జగన్‌ సర్కారు ఈ రెండున్నరేళ్లలో రూ.3 లక్షల కోట్లకుపైనే అప్పులు తెచ్చింది. అన్నిరకాల పెండింగ్‌ బిల్లులు దాదాపు రూ.75వేల కోట్లు ఉన్నట్లు ఒక అంచనా! ఈ అప్పులు, అప్పుల కోసం చేసే తప్పులు సమీప భవిష్యత్తులోనే రాష్ట్రానికి శాపంగా మారనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


‘రివర్స్‌’ వ్యూహం

‘అవినీతి జరిగిన కాంట్రాక్టులన్నింటినీ రద్దు చేస్తాం. అర్హతలను మార్చేస్తాం. రివర్స్‌ టెండరింగ్‌ పద్ధతి ప్రవేశపెడతాం’ అని ప్రమాణస్వీకారం రోజున చెప్పారు. కానీ... మళ్లీ కొత్తగా కాంట్రాక్టులు ఇచ్చుకునేందుకే ఈ ‘రివర్స్‌’ వ్యూహం అనుసరించారనే విమర్శలు ఉన్నాయి. పోర్టులు చేతులు మారడం, కాంట్రాక్టర్లు మారడం తప్ప కొత్తగా జరిగిందేమీ లేదు. ఇదిలావుంటే, రాజకీయంగా తన కు ఉపయోగపడిన నిచ్చెనమెట్లను కూడా సీఎం తొక్కేసుకుంటూ పోతున్నారన్న విమర్శలున్నాయి. ఈ బాధితుల్లో ఉద్యోగులే తొలిస్థానంలో ఉన్నారు. జగన్‌ విజయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి పాత్ర కీలకం. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను.. ‘ఈనెల జీతం వస్తే చాలు’ అని అనుకునే దీనస్థితిలోకి నెట్టారు. అలాగే, జగన్‌ దాదాపు అన్ని కులాలను వాడుకున్నారు. కాపులను ఓటుబ్యాంకుగా వాడుకున్న ఆయన.. అధికారంలోకి రాగానే వారికి ఉన్న రిజర్వేషన్‌ ఎత్తివేశారు.


అదే ఆఖరు..

జగన్‌ సీఎం అయిన తొలి రోజుల్లో... ఒక సీనియర్‌ అధికారిని పిలిపించుకుని మాట్లాడారు. ‘మీ సేవలు, సలహాలు కావాలి. రెగ్యులర్‌గా నన్ను గైడ్‌ చేయండి’ అని కోరారు. దీంతో ఆ అధికారి ఎంతో ఆనందించారు. ‘చంద్రబాబు ఎప్పుడూ ఇంతటి అభిమానం చూపలేదు’ అని మనసులోనే అనుకున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆ అధికారి చూసే శాఖ సమీక్షా సమావేశం జరిగింది. జగన్‌ ఒక ఆదేశం జారీ చేసి... దానిని అమలు చేయాలన్నారు. అలా చేస్తే సమస్యలు వస్తాయని, ఆ నిర్ణయాన్ని దీర్ఘకాలం కొనసాగించలేమని ఆ ఉన్నతాధికారి జగన్‌తో అన్నారు. ‘అయినప్పుడు చూద్దాంలే’ అని సీఎం ముక్తసరిగా స్పందించారు. అంతే! ఆ అధికారికి అదే ఆఖరి సమావేశం. ఆ తర్వాత ఎప్పుడూ ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలోకి అనుమతి లభించలేదు. 


జగన్‌

విపక్షంలో ఉండగా నిత్యం ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు చేసిన జగన్‌... ముఖ్యమంత్రి కాగానే తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసుకు పరిమితమయ్యా రు. సామాన్యుల సంగతి పక్కనపెడితే ... ఎమ్మెల్యేలు, మంత్రులకే ఆయన దర్శనం దొరకదు. నేతలు, అధికారులు... ఎవరైనా సరే, ‘ఆహ్వానం’ ఉంటేనే క్యాంప్‌ కార్యాలయంలోకి ప్రవేశం లభిస్తుంది. 


వైఎస్‌

వైఎస్‌ ఉమ్మడి రాష్ట్ర సీఎంగా నిత్యం ఉదయమే హైదరాబాద్‌లోని తన తన క్యాంపు కార్యాలయం(ప్రస్తుతం ప్రగతిభవన్‌)లో  ప్రజాదర్బార్‌ నిర్వహించేవారు. నేరుగా ఉద యం ప్రజాదర్బార్‌కు వెళ్లి నిల్చుంటే వారి వద్దకే వెళ్లి వినతిపత్రాలు తీసుకునేవారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా ఎలాంటి అపాయింట్‌మెంట్‌ అవసరం లేకుండా వైఎ్‌సను కలిసేవారు. పరిపాలన విషయంలో అధికారులతో వైఎస్‌ సుదీర్ఘమైన సమీక్షలు నిర్వహించేవారు. అవతలి వారు చెప్పేది వినేవారు. ఏదైనా విషయంలో అధికారులు గట్టిగా వ్యతిరేకిస్తే... ‘కాస్త చూడండి’ అనే వారు తప్ప, చెప్పింది చేయాల్సిందే అని ఆదేశించేవారు కాదు. నిర్దిష్టంగా ‘కొన్ని’ విషయాల్లో మాత్రమే పట్టుపట్టి పని చేయించుకున్నారు తప్ప... ఇతర విషయాల్లో అధికారుల మాటనే గౌరవించేవారు. 


చంద్రబాబు

చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయన అధికారిక కార్యకలాపాలు ఉదయం 7 గంటలకే మొదలయ్యేవి. ప్రతిదానినీ సూక్ష్మస్థాయిలో చూడటం ఆయన నైజం. ఫలానా పని ఫలానా తేదీలోపు పూర్తి కావాలనుకుంటే... అందుకు తగిన విధంగా వివిధ స్థాయుల్లో ఒత్తిడి పెంచుతారు. ఏదైనా ఒక ప్రణాళిక ప్రకారమే జరిగేది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, నిపుణులతో తప్పనిసరిగా చర్చించేవారు. వరదలవంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో... సర్వం తానై వ్యవహరిచి, తాను పరిగెత్తి, యంత్రాంగాన్నీ పరుగులు తీయించేవారు.



Updated Date - 2021-11-30T08:38:18+05:30 IST