రేపు 13 కేంద్రాల్లో పాలిసెట్‌

ABN , First Publish Date - 2022-05-28T07:26:07+05:30 IST

పాలిసెట్‌-2022కి జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు కో-ఆర్డినేటర్‌ ద్వారకనాథరెడ్డి పేర్కొన్నారు.

రేపు 13 కేంద్రాల్లో పాలిసెట్‌

హాజరుకానున్న 5,324మంది విద్యార్థులు

జిల్లా కో-ఆర్డినేటర్‌ ద్వారకనాథరెడ్డి వెల్లడి


తిరుపతి(విద్య), మే 27: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకోసం ఆదివారం ఉదయం 11నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు జరిగే పాలిసెట్‌-2022కి జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు కో-ఆర్డినేటర్‌ ద్వారకనాథరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎస్వీపాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. జిల్లాలో తిరుపతి, గూడూరుల్లోని 13 కేంద్రాల్లో ఈపరీక్ష జరగనుందన్నారు. ఈ పరీక్షకు 5,342మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. తిరుపతిలోని ఏడు కేంద్రాల్లో  3,934 మంది, గూడూరులోని ఆరు కేంద్రాల్లో 1,390 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. ఉదయం 10గంటల నుంచి విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని, హాల్‌టికెట్‌తోపాటు హెచ్‌బీ పెన్సిల్‌, బాల్‌పాయింట్‌ పెన్‌, ఆధార్‌కార్డులను వెంటతెచ్చుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్‌ అనుమతి ఉండదని స్పష్టం చేశారు. 


పరీక్ష కేంద్రాలిలా..

తిరుపతిలోని కేటీరోడ్డులో ఉన్న ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌, ఎస్‌జీఎస్‌ హైస్కూల్‌(కేటీరోడ్డు), బాలాజీకాలనీలోని ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్వీయూ క్యాంప్‌సస్కూల్‌(బాలాజీకాలనీ సర్కిల్‌), శ్రీపద్మావతి గర్ల్స్‌ హైస్కూల్‌(బాలాజీకాలనీ సర్కిల్‌), ఎస్పీడబ్ల్యూ జూనియర్‌ కళాశాల, ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. అలాగే గూడూరులోని గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ (తిలక్‌నగర్‌), గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిరామిక్‌ టెక్నాలజీ (తిలక్‌నగర్‌), ఎస్‌కేఆర్‌ గవర్నమెంటు డిగ్రీ కళాశాల (తిలక్‌నగర్‌), డీఆర్‌డబ్ల్యూ కాలేజ్‌ (డీఎస్పీ ఆఫీసు దగ్గర), జడ్పీ బాలుర హైస్కూల్‌ (డీఎస్పీ ఆఫీసు దగ్గర), నేషనల్‌ హైవేలోని ఆదిశంకర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ పాలిటెక్నిక్‌ కేంద్రాలుగా ఉన్నాయి. 

Updated Date - 2022-05-28T07:26:07+05:30 IST