మృత్యువులోనూ డ్యూటీ మర్చిపోని పోలీస్! చేతిపై ఆ నెంబర్ రాసుకోవడంతో..

ABN , First Publish Date - 2020-07-08T00:12:52+05:30 IST

ఆ కానిస్టేబుల్‌కు తాను మరణం అంచున ఉన్నానని తెలుసు. అయినా అతడిలోని పోలీసు..తన విధి నిర్వహణపైనే దృష్టి పెట్టాడు.

మృత్యువులోనూ డ్యూటీ మర్చిపోని పోలీస్! చేతిపై ఆ నెంబర్ రాసుకోవడంతో..

చండీగఢ్: ఆ కానిస్టేబుల్‌కు తాను మరణం అంచున ఉన్నానని తెలుసు. అయినా అతడిలోని పోలీసు..తన విధి నిర్వహణపైనే దృష్టి  పెట్టాడు. నిందితుల వాహనం నెంబర్ చేతిపై రాసుకుని మరీ ప్రాణాలు విడిచాడు. దీంతో వారం రోజుల్లోనే ఇద్దరు పోలీసుల హత్య కేసు ఓ కొలిక్కొచ్చింది. ఈ దారుణానికి బాధ్యులైన ఆరుగురిలో ఐదుగరు కటకటాల పాలయ్యారు. ఆరో నిందితుడు పోలీసు తూటాలకు మరణించాడు.


సోసీపట్ జిల్లాలో జరిగిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను హరియాణా పోలీసులు ఇటీవల వెల్లడించారు. గత సోమవారం నాడు.. కర్ఫ్యూ సమయంలో కొందరు వ్యక్తులు రోడ్డుపై కారు నిలిపి మద్యం సేవించసాగారు. ఇది గమనించిన రవీందర్ సింగ్(కానిస్టేబుల్), కప్టాన్ సింగ్(ప్రత్యేకాధికారి) అనే ఇద్దరు పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు నిందితులకు మధ్య వాగ్వివాదం సాగింది. ఇంతలో అకస్మాత్తుగా నిందితులు వారిపై పదునైన ఆయుధాలలో దాడి చేసి తమ వాహనంలో పరారయ్యారు.


మరుసటి రోజు రక్తపుమడుగులో ఉన్న వారి మృత దేహాలను పోలీసులు గుర్తించారు. అనంతరం రంగంలోకి దిగిన వారు దర్యాప్తు ప్రారంభించారు. ఇక నేరం ఎలా జరిగిందనే దానిపై పోలీసులకు కొంత అవగాహన ఏర్పడినప్పటికీ..నిందితుల ఆచూకీ వెతిపట్టుకోవడంలో సమస్యలు ఎదురయ్యాయి. మరోవైపు.. రవీందర్ సింగ్ చేతిపై కారు నెంబర్ రాసి ఉన్నట్టు పోస్ట్ మార్టంలో బయటపడింది.


ఆ నెంబర్ సాయంతో..పోలీసులు ఐదురుగు నిందితులను అరెస్టు చేశారు. ఆరో నిందితుడు పోలీసు కాల్పుల్లో మరణించాడు. దీంతో జంట హత్యల మిస్టరీ వీడిపోయింది. చేసిన నేరానికి నిందితులు తగిన మూల్యం చెల్లించుకున్నారు. కాగా.. మరణంలోనూ తన బాధ్యత మరిచిపోని కానిస్టేబుల్ రవీందర్‌ను పోలీస్ బాస్ మనోజ్ యాదవ్ ప్రశంసించారు. ఆయన్ను ధీరోధాత్తుడిగా అభివర్ణించారు.


‘చివరి క్షణాల్లోనూ రవీందర్ సింగ్ ఓ పోలీసుగా తన బాధ్యత నిర్వర్తించారు. నిందితుల వాహనం నెంబర్‌ను చేతిపై రాసుకున్నారు. పోస్ట్‌మార్టం సందర్భంగా ఇది బయటపడింది’ అని తెలిపారు. మరోవైపు.. యూపీలో వికాస్ దూబే పైశాచికత్వానికి 8 మంది పోలీసులు అసువులు బాసిన ఘటన సంచలన రేపుతున్న నేపథ్యంలో హరియాణా పోలీసు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి ముఖ్య సూచనలు చేశారు. నిందితులను ఎదుర్కొనే సమయంలో ప్రామాణిక పద్ధతులను కచ్చితంగా పాటించాలని వారికి గుర్తు చేశారు.

Updated Date - 2020-07-08T00:12:52+05:30 IST