Abn logo
Mar 26 2020 @ 15:37PM

కరోనా లాక్‌డౌన్: ‘సింగం’ స్టైల్లో స్పందించిన పోలీసు!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఓ లాయర్‌కు, పోలీస్‌కు మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాక్‌డౌన్ సందర్భంగా పోలీసులు నేరుగా ప్రజలపై చేయిచేసుకోవడానికి వీల్లేదనీ, ఉద్యోగం ఊడిపోతుందనీ ఓ లాయర్ ఆడియో విడుదల చేయగా.. ఉద్యోగం పోతే పోలీసులు ‘పచారీ కొట్టు’ పెట్టుకుంటారు తప్ప విధులు విస్మరించరంటూ ఓ పోలీస్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం తమిళనాట వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ఈ ఆడియో క్లిప్పులపై వివరాల్లోకి వెళితే... లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారిపై లాఠీచార్జి చేస్తున్న పోలీసులను ఉద్దేశించి  సుప్రీంకోర్టు లాయర్‌గా చెప్పుకుంటున్న ఓ న్యాయవాది తొలుత ఆడియో విడుదల చేశారు. ‘‘సామాన్యులను వేధించే హక్కు మీకు ఎవరిచ్చారు. డీజీపీనా, ముఖ్యమంత్రా లేక ఉప ముఖ్యమంత్రా? ఎవరు చెప్పారు?..’’ అని ప్రశ్నించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే పోలీసులు చట్ట ప్రకారం కేసులు పెట్టి మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలనీ.. వాళ్లకు బెయిల్ ఇవ్వాలా లేదా అన్నది మేజిస్ట్రేట్ నిర్ణయిస్తారని లాయర్ పేర్కొన్నారు. ‘‘ప్రజలను ఇళ్లలో ఉండమని పోలీసులు కేవలం సలహా ఇవ్వగలరు. ఒకవేళ పోలీసులు చేయిచేసుకుంటే.. దాని తాలూకు వీడియోలను హైకోర్టులోనో, మానవ హక్కుల కమిషన్‌లోనో చూపిస్తే ఉద్యోగాలు పోతాయి..’’ అని సదరు లాయర్ తన ఆడియోలో చెప్పుకొచ్చారు. ఒకవేళ లాయర్లు నిషేదాజ్ఞలు ఉల్లంఘిస్తే వాళ్లనేమైనా చేయగలరా అంటూ సవాల్ విసిరారు. 


లాయర్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన కొద్ది గంటల్లోనే ఓ పోలీస్ అధికారి వాట్సాప్ వేదికగా ఆడియో విడుదల చేశారు. చట్టంలోని అన్ని సెక్షన్లు పోలీసులకు తెలుసుననీ... చట్టపరమైన అంశాలను లాయర్లు తమకు బోధించాల్సిన అవసరం లేదంటూ ఆయన పేర్కొన్నారు. లాయర్లు సహా పౌరులంతా కర్ఫ్యూ ఆదేశాలతో పాటు ఇతర చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొన్నారు. ‘‘మీరు మా మీద ఎలాంటి కేసులైనా పెట్టొచ్చు. మమ్మల్ని ఇంటికి పరిమితం చేయాలనుకున్నా మీ ఇష్టం. మాకెలాంటి సమస్యా లేదు...’’ అని సదరు సదరు పోలీస్ పేర్కొన్నారు. పోలీసులు అవసరమైతే పచారీకొట్టు పెట్టుకునైనా బతకగలరంటూ ‘‘సింగం’’ సినిమా స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. తమిళ సినిమా ‘‘సింగం’’లో విలన్‌కు ఓ ఎస్సై వార్నింగ్ ఇస్తూ తాను పోలీస్ ఉద్యోగం మీద మాత్రమే ఆధారపడి బతకడంలేదంటూ చెప్పే ఓ డైలాగ్ విశేషంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. కాగా తాము అకారణంగా ఎవరిపైనా చేయిచేసుకోబోమనీ... అనవసరంగా రోడ్లమీదికి వచ్చి పోలీసులతో గొడవపడితేనే అంతవరకు వెళుతుందని సదరు పోలీస్ తన ఆడియో క్లిప్‌లో పేర్కొన్నారు. 


ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో... ప్రజలను బయటికి రాకుండా చూసేందుకు పోలీసులు, అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. కొందరు అవసరం ఉన్నా లేకున్నా రోడ్లమీదికి వస్తూ పోలీసుల సహనానికి పరీక్ష పెడుతుండడంతో లాఠీచార్జిలు తప్పడం లేదని పోలీసులు అంటున్నారు. 

Advertisement
Advertisement
Advertisement