ఆలయాలపై నిఘా

ABN , First Publish Date - 2021-01-06T06:40:57+05:30 IST

జిల్లాలో దేవాలయాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రెవెన్యూ, పోలీస్‌శాఖలు అప్రమత్తమయ్యాయి.

ఆలయాలపై నిఘా

అప్రమత్తమైన అధికార యంత్రాంగం 

జిల్లాలో 3,832 దేవాలయాల గుర్తింపు

కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి 

నిత్యం పోలీసు గస్తీకి ఆదేశం

జిల్లాలో ఆలయాల భద్రతపై యంత్రాంగం దృష్టి సారించింది. రాష్ట్రంలో ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో అటు పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ చర్యలు చోటుచేసుకోకుండా నిఘా ఉంచారు. 438 దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశాల మేరకు ప్రతి ఆలయానికి పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసు అధికారులు ప్రతి గ్రామంలో పర్యటించి ఆలయాలను పరిశీలిస్తున్నారు. అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు.  మత సామరస్యంపై కూడా  చైతన్యవంతం చేస్తున్నారు.  ప్రతి దేవాలయాన్నీ ఓ పోలీసు దత్తత తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. 

ఒంగోలు (క్రైం), జనవరి 5: జిల్లాలో దేవాలయాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రెవెన్యూ, పోలీస్‌శాఖలు అప్రమత్తమయ్యాయి. అంతర్వేది ఘటనతో రాష్ట్రమంతా అప్రమత్తమైన పోలీసులు ప్రధాన దేవాలయాలపై దృష్టిసారించి జాగ్రత్తలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోసారి విజయనగరం జిల్లా రామతీర్థం ఘటన పునరావృతం కావడంతో అలజడి నెలకొంది. దీంతో పోలీసుశాఖ తిరిగి నిత్యం అన్ని దేవాలయాలను పర్యవేక్షించడంతోపాటు, గస్తీ ఏర్పాటుకు ఉపక్రమించింది. గత నాలుగురోజులుగా జిల్లా పోలీసు యంత్రాంగం దేవాలయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడంతోపాటు సీసీకెమెరాలు ఏర్పాటుపై దృష్టిసారించారు. జిల్లాలో 3,832 ఆలయాలు ఉన్నట్లు గుర్తించారు. 438 దేవాలయాల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేయించారు. దేవదాయశాఖ కూడా ముఖ్యమైన 40 దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రతి దేవాలయానికి పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశారు. నోడల్‌ అధికారిగా వీఆర్‌వో, సభ్యులుగా పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, వలంటీర్లు ఉండేవిధంగా చర్యలు చేపట్టారు. ఈ కమిటీలు నిత్యం దేవాలయాలను సందర్శించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావులేకుండా చర్యలు తీసుకునేలా ఆదేశాలిచ్చారు. అదేక్రమంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ప్రతి దేవాలయాన్ని ఓ పోలీసు దత్తత తీసుకునే విధంగా ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా గ్రామాల్లో అన్ని మతాల పెద్దలతో ఆయా పోలీస్‌స్టేషన్లలో సమావేశాలు ఏర్పాటు చేసి వదంతులను నమ్మవద్దని అసత్య ప్రచారాలతో ఎలాంటి విధ్వంసచర్యలకు పాల్పడవద్దని అవగాహన కల్పిస్తున్నారు.


వదంతులను నమ్మొద్దు : ఏఎస్పీ రవిచంద్ర

అసత్య ప్రచారాలతోపాటు, వదంతులను నమ్మవద్దని అదనపు ఎస్పీ రవిచంద్ర హెచ్చరించారు. సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి ఆర్చి ఉదంతం కేవలం తుప్పు పట్టినందువల్లే అమ్మవారి చేతులు విరిగిపడ్డాయని ఆలయ ఈవో బైరాగి తెలియజేశారని వివరించారు. ఇలాంటి ఘటనల గురించి నిజాలు తెలియకుండా అసత్యప్రచారాలు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 


Updated Date - 2021-01-06T06:40:57+05:30 IST