పందెం పంతం!

ABN , First Publish Date - 2021-01-13T14:45:19+05:30 IST

సంప్రదాయం మాటున.. కోడి పందేల బరులు..

పందెం పంతం!

పోలీసులు వర్సెస్‌ పందెం రాయుళ్లు

పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌

అనుమతించేది లేదంటూ హెచ్చరికలు

బరుల వద్ద పోలీసుల గస్తీ 

కత్తి దూస్తున్న పందెం రాయుళ్లు

నేటి నుంచి భారీగా కోడి పందేలకు సిద్ధం

ఎడ్ల పందేల పక్కనే కోతముక్క!


విజయవాడ(ఆంధ్రజ్యోతి): సంప్రదాయం మాటున.. కోడి పందేల బరులు సిద్ధమవుతున్నాయి. ఆ పక్కనే కోతముక్కకూ ఏర్పాట్లు చేస్తున్నారు. పందేలు నిర్వహిస్తే సహించేది లేదంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా లెక్కచేయని అధికారపార్టీ కార్యకర్తలు.. తమ నేతల కనుసన్నల్లో సైలెంట్‌గా బరులు సిద్ధం చేస్తుంటే.. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. గుడివాడ రూరల్‌ మండలం బిళ్లపాడులో కోడి పందేల నిర్వహణకు సిద్ధం చేసిన బరిని రూరల్‌ పోలీసులు ట్రాక్టర్‌తో దున్నించేశారు. అయినా అనేక ప్రాంతాల్లో బరులు సిద్ధమవుతూనే ఉన్నాయి. పోలీసులు ఏమి చేసినా బుధవారం ఉదయం నుంచే కోడిపందేలు నిర్వహిస్తామంటూ పందెం రాయుళ్లకు కొందరు సమాచారం చేరవేస్తూనే ఉన్నారు. పందేలు వేస్తే సహించేది లేదంటూ పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ సవాళ్ల సమరంలో చివరికి నెగ్గేదెవరు? పందెం రాయుళ్లా? పంతంతో బరులను అడ్డుకుంటున్న పోలీసులా? నేడు, రేపు ఏంజరుగుతుందో చూడాల్సిందే.


- మచిలీపట్నం మండలంలో మేకావానిపాలెం, శ్రీనవాసనగర్‌, రుద్రవరం, పోలాటితిప్ప తదితర ప్రాంతాల్లో పందేల నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  

- ఘంటసాల మండలం కొడాలి, మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ, వెంకటాపురం వద్ద పెద్దఎత్తున బరులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 

- పామర్రు మార్కెట్‌ యార్డు ఎదురుగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ భూముల్లో కోడిపందేల బరికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.

- నూజివీడుపట్నంలోనే ఈసారి పెద్దఎత్తున బరి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 

- జనార్థనపునరం, కొప్పాక తదితర ప్రాంతాల్లో బరులు సిద్ధమయ్యాయి.


గుడివాడ : గుడివాడ రూరల్‌ మండలం బిళ్లపాడులో కోడి పందేల నిర్వహణకు రాజకీయ పార్టీ నాయకులు సిద్ధం చేసిన బరిని రూరల్‌ పోలీసులు ట్రాక్టర్‌తో దున్నించి ధ్వంసం చేశారు. పుట్ట గుంట వద్ద జాతీయ రహదారిని ఆనుకుని అధికార పార్టీ పెద్దలు మంగళవారం ఉదయం కోడి పందేల బరిని సిద్ధం చేశారు. చేపల చెరువు గట్టు చదును చేసి బుసకతో బరి ఏర్పాటు చేశారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసు కుంటుంటే బహిరంగంగా జాతీయ హైవే పక్కనే షామియానాలు వేసి బరులు సిద్ధం చేస్తున్నా  నందివాడ పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలతో షామియానాను తీసివేశారు. 

- గుడివాడకు సమీపంలోని కే కన్వెన్షన్‌ ప్రాంగణంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేల ప్రాంగణం పక్కన కోతముక్క, కోడిపందేల నిర్వహణకు రంగం చేస్తున్నారని సమాచారం. గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు, గుడ్లవల్లేరు, పెంజెండ్రలలో కోడి పందేలు వేయడానికి రంగం చేస్తున్నారని తెలుస్తోంది.

- కలిదిండి మండలంలో కోరుకొల్లు, కొచ్చెర్ల, పెదలంక, మూల్లంకల్లో కోడిపందేల బరులు సిద్ధమయ్యాయి. పామర్రు మండలంలో అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కొమరవోలు, కనుమూరు, బల్లిపర్రు, నిభానుపూడిల్లో కోడిపందేల బరులు సిద్ధమవుతున్నాయి. 

మోపిదేవి : మండల కేంద్రమైన మోపిదేవి శివారులో కొక్కిలిగడ్డ రెవెన్యూ పరిధిలో ప్రధాన రహదారిపైన భారీ ఎత్తున బరిని సిద్ధం చేస్తున్నారు. మినుము పంటను ట్రాక్టర్‌తో దున్నివేస్తున్నారు. మండలంలోని పెదప్రోలు పంచాయతీ శివారు శివరామపురం వద్ద చల్లపల్లికి సమీపంలో మరొక బరి సిద్ధం చేస్తున్నారు.  

నాగాయలంక: మండలంలోని పెదపాలెంలో కోడిపందేలు నిర్వహించేందుకు మాగాణి పొలంలో బరిని ఏర్పాటు చేయగా ఎస్సై కె.శ్రీనివాస్‌.. తన సిబ్బందితో కర్రలు, వలలను తొలగించారు.   

బంటుమిల్లి : బంటుమిల్లి, పెందుర్రు, తుమ్మిడి, అర్తమూరు తదితరగ్రామాలలో కోడి పందేలు, పేకాట, జూదం బరులు సిద్ధమవుతున్నాయి.  

కైకలూరు : కైకలూరు, భుజబలపట్నం, ఆలపాడు, కొల్లేటికోట, శృంగవరప్పాడు గ్రామాల్లో జూదాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

మండవల్ల్లి మండలంలో భైరవపట్నం, పెరికెగూడెం, కొవ్వాడలంక, ఇంగిలిపాకలంక, ఉనికిలి గ్రామాల్లో పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ముదినేపల్లి : బొమ్మినంపాడు, వడాలి గ్రామాల ఏరియాల్లో బరుల ఏర్పాట్లను ఎస్సై మణికుమార్‌ తొలగించినా నిర్వాహకులు వెనుకంజ వేయటం లేదు. 

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : హైకోర్టు ఆదేశాలను కఠినంగా అమలు చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో కోడి పందేలు జరుగనివ్వమని, కొన్నిరోజులుగా కోడి పందేల బరులను ధ్వంసం చేస్తున్నామని హనుమాన్‌జంక్షన్‌ సీఐ రమణ తెలిపారు. 


జూదాలపై నిరంతర దాడులు : ఎస్పీ

మచిలీపట్నం: పేకాట, కోడిపందేలపై జిల్లా వ్యాప్తంగా నిరంతర దాడులు జరుగుతున్నాయని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘించి కోడిపందేలు, పేకాట నిర్వహిస్తే నిర్వాహకులతో పాటు స్థల యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. కోడి పందేల కోసం సిద్ధం చేస్తున్న బరులను గుర్తించి ధ్వంసం చేస్తున్నారన్నారు. పందెం రాయుళ్లపై బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నామన్నారు.  జిల్లా వ్యాప్తంగా 432 పేకాట కేసులు నమోదు చేసి 732 మందిని అరెస్టు చేసి 65 లక్షల 83 వేల రూపాయల నగదు, 71 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 62 కోడి పందేల కేసులు నమోదు చేశామని, 142 మందిని అరెస్టు చేసి లక్షా 18 వేల 740 రూపాయల నగదు, 2240 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఎస్పీ వకుల్‌ జింథాల్‌, ఎస్బీ డీఎస్పీ ధర్మేంద్ర, ఎస్బీ సీఐ నాగేంద్రకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T14:45:19+05:30 IST