నేనే చంపా.. అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా..!

ABN , First Publish Date - 2022-05-24T07:58:15+05:30 IST

తన (మాజీ) డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేసినట్లు వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ అంగీకరించారు.

నేనే చంపా.. అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా..!

  • పోలీసుల ముందు నేరం అంగీకరించిన ఎమ్మెల్సీ
  • ‘డ్రైవర్‌’ హత్య కేసులో ఉదయ భాస్కర్‌ అరెస్టు
  • జూన్‌ 6 వరకు రిమాండ్‌.. రాజమండ్రి జైలుకు
  • మీడియాకు వివరాలు వెల్లడించిన ఎస్పీ
  • బాకీ కోసం మాటామాటా పెరిగింది
  • కొట్టి నెట్టేయడంతో సుబ్రహ్మణ్యం మృతి
  • ప్రమాదంగా చిత్రించేందుకు ఎమ్మెల్సీ ప్లాన్‌
  • మృతదేహంపై విచక్షణ రహితంగా దాడి: ఎస్పీ
  • పోలీసుల కథనంపై అనుమానాలు
  • సుబ్రహ్మణ్యాన్ని ఉదయభాస్కరే
  • ఇంటి నుంచి తీసుకెళ్లాడన్న తల్లిదండ్రులు
  • పోస్టు మార్టంలో మద్యం ప్రస్తావన లేదు
  • కేసు తీవ్రత తగ్గించడానికి పోలీసుల యత్నం!?


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): తన (మాజీ) డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేసినట్లు వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ అంగీకరించారు. అయితే మాటామాటా పెరిగి కోపంతో కొట్టడంతో అతడు చనిపోయాడని ఎమ్మెల్సీ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. గురువారం రాత్రి ఈ సంఘటన జరుగగా.. ఉదయభాస్కర్‌ను అరెస్టు చేయని సంగతి తెలిసిందే. తమ అదుపులోనే ఉంచుకున్న పోలీసులు.. అన్ని వర్గాల నుంచీ నిరసనలు వెల్లువెత్తడంతో సోమవారం రాత్రి ఎట్టకేలకు అరెస్టు చేసినట్లు ప్రకటించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పాత ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీని విచారించారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు, ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు తదితరులు హత్యకు సంబంధించి పూర్తి వివరాలను ఆయన్నుంచి రాబట్టారు. హత్య చేయడానికి కారణాలు.. ఏ సమయంలో చేశారు.. ఎందుకు చేశారు.. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా ఎందుకు చిత్రీకరించారు వంటి అంశాలపై ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు రాత్రి నుంచి మృతదేహాన్ని సుబ్రహ్మణ్యం ఇంటికి తరలించే వరకు జరిగిన పరిణామాలన్నింటినీ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ పేరిట అడిగి వివరాలు సేకరించారు.


ఈ అరెస్టు  విషయమై సోమవారం సాయంత్రం వరకు హైడ్రామా నడిచింది. తమ అదుపులోనే ఉన్నా ఎమ్మెల్సీని అరెస్టు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు రేగాయి. సాయంత్రం ఐదున్నర గంటలకల్లా విచారణ, కేసు రికార్డు వివరాలు కొలిక్కి రావడంతో డీఐజీ పాలరాజు వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు ఉదయభాస్కర్‌ను రాత్రి 7.15 గంటలకు జీజీహెచ్‌కు వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చారు. అక్కడ పరీక్షలు పూర్తయ్యాక తిరిగి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. రాత్రి 9.14 గంటలకు మేజిస్ట్రేట్‌ ఎదుటహాజరు పరిచారు. ఎమ్మెల్సీ అనంతభాస్కర్‌ పేరు ఆధార్‌ కార్డులో అనంత సత్య ఉదయ భాస్కర్‌ అని ఉంటే కేసు డైరీ నివేదికలో ఉదయభాస్కర్‌ అని మాత్రమే ఉండడంతో మేజిస్ట్రేట్‌ మూడుచోట్ల తప్పులు గుర్తించి సరిచేయాలని ఆదేశించారు. దీంతో పదేపదే పోలీసులు మళ్లీ స్టేషన్‌కు వెళ్లి కేసు వివరాలు సరిచేయడానికి పరుగులు తీశారు. ఆ తర్వాత ఉదయభాస్కర్‌కు వచ్చే నెల 6 వరకు మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధించారు. దీంతో ఎమ్మెల్సీని రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. 


ఉదయభాస్కర్‌ పోలీసులకు ఏం చెప్పారంటే..

ఉదయభాస్కర్‌ను ప్రశ్నించడం పూర్తికావడంతో సోమవారం రాత్రి 8.30 గంటలకు ఎస్పీ కాకినాడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సుబ్రహ్మణ్యాన్ని తానే చంపినట్లు ఈ సందర్భంగా ఉదయభాస్కర్‌ అంగీకరించారని, ఆయన్ను అరెస్టు చేశామని చెప్పారు. ఎమ్మెల్సీ తమకు చెప్పిన వివరాలను ఎస్పీ వివరించారు.


అసలేం జరిగిందంటే..

‘హత్య జరిగిన రోజు గురువారం రాత్రి ఉదయభాస్కర్‌కు కొండయ్యపాలెంలో మద్యం తాగి రోడ్డుపై డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కనిపిస్తే కారు ఎక్కించుకుని ఆనక డ్రైవింగ్‌ అప్పగించాడు. అక్కడి నుంచి జన్మభూమి పార్కు ఏరియాలో టిఫిన్‌ తీసుకుని శ్రీనగర్‌లోని ఉదయభాస్కర్‌ ఇంటికి వెళ్లారు. సుబ్రహ్మణ్యం వివాహ సమయంలో ఎమ్మెల్సీ డబ్బులు సర్దుబాటు చేశారు. డ్రైవర్‌ ఇంకా రూ.20వేలు బాకీ ఉండడంతో అక్కడ అడిగాడు. ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించాడు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం తిరగబడడంతో ఇద్దరి మధ్య వాదన పెరిగింది. దీంతో తాను వెనక్కి నెట్టానని, దిమ్మ తగిలి డ్రైవర్‌ తలకు గాయమైందని, సుబ్రహ్మణ్యం మళ్లీ ఆగ్రహంతో తిరగబడడంతో కోపం వచ్చి రెండోసారి మెడపై చేయి పెట్టి నెట్టడంతో అక్కడ గేటుకు ఆనుకుని ఉన్న ఇనుప చువ్వలాంటిది గుచ్చుకుని ఇంకో గాయమైందని, దీంతో అతడిని కారులో ఎక్కించుకుని భానుగుడి వైపు ఆస్పత్రులకు వెళ్లేలోపు మధ్యలో ఎక్కిళ్లు వచ్చాయని, దీంతో నీళ్లిచ్చానని.. అవి తాగిన సుబ్రహ్మణ్యం ఆ తర్వాత స్పృహ లేకుండా పడి ఉండడంతో చనిపోయినట్లు గుర్తించానని ఉదయభాస్కర్‌ చెప్పారు. సుబ్రహ్మణ్యానికి తరచూ తాగి రోడ్డు ప్రమాదం చేసే అలవాటు ఉండడంతో ఈ హత్యను రోడ్డు ప్రమాదం ఖాతాలో నెట్టేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కాకినాడ ఎన్‌ఎ్‌ఫసీఎల్‌ దాటి డంపింగ్‌ యార్డు వద్దకు వెళ్లానని, అక్కడ మృతదేహాన్ని కారు నుంచి కిందకు దించి పెద్దకర్రతో తీవ్రంగా కొట్టినట్లు ఎమ్మెల్సీ చెప్పారు. తద్వారా రోడ్డు ప్రమాదంలో జరిగిన గాయాలుగా అంతా నమ్ముతారని భావించారు. అందులో భాగంగానే అమృత ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులతో పరీక్ష చేయించి చనిపోయాడని చెప్పేలా చేశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు గురువారం అర్ధరాత్రి 1.30 గంటలకు అప్పగించగా.. మృతదేహాన్ని చూస్తే రోడ్డు ప్రమాదంగా లేదని, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వారు చెప్పడంతో కారు వదిలి పరారైనట్లు ఉదయభాస్కర్‌ మాకు చెప్పారు. ఆయన వాంగ్మూలాన్ని లిఖితపూర్వకంగా నమోదు చేయడంతోపాటు వీడియో రికార్డు చేశాం. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు, ఏ-1 వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కరేనని నిర్ధారించి అదుపులోకి తీసుకున్నాం’ అని ఎస్పీ వివరించారు. క్రైం నంబరు 195/22.. ఐసీసీ సెక్షన్లు 302, 201 రెడ్‌ విత్‌ 34, ఎస్సీ, ఎస్టీ యాక్టు(1989)లోని సెక్షన్లు 3 (1)(ఆర్‌)(ఎస్‌), 3(2) ప్రకారం నమోదు చేశామన్నారు. కేసులో మరిన్ని విషయాలు పూర్తి దర్యాప్తులో తెలుస్తాయని తెలిపారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా కాకినాడ డీఎస్పీ వి.భీమారావును నియమించామన్నారు. సమావేశంలో అడ్మిన్‌ ఎస్పీ పి.శ్రీనివాసు, ఎస్‌బీ డీఎస్పీలు ఎం.అంబికాప్రసాద్‌, ఎం.వెంకటేశ్వరరావు, సీఐలు పాల్గొన్నారు.


అప్పుడలా..ఇప్పుడలా..

ఉదయభాస్కర్‌ చెప్పాడంటున్న కథనంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో తమ ఇంటికి వచ్చి ఉదయభాస్కర్‌.. సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లాడని  తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని తల్లి రత్నం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టం చేశారు. కానీ విలేకరుల సమావేశంలో ఎస్పీ ఇది చెప్పలేదు. పైగా సుబ్రహ్మణ్యం మద్యం సేవించిన విషయం గురించి పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో లేదు. తల్లిదండ్రులు చెప్పిన దానికి, పోలీసులు చెప్పిన వివరాలకు పొంతన లేదు. ఉదయభాస్కర్‌ కావాలని చంపలేదని, అనుకోకుండా నెట్టేయడంతోనే సుబ్రహ్మణ్యం చనిపోయాడని చెప్పడం ద్వారా.. ఉద్దేశపూర్వక హత్య కాదని ప్రచారం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక వివరాల ప్రకారం సుబ్రహ్మణ్యం మృతదేహంపై 30 గాయాలున్నాయి. ఇవన్నీ హత్య చేసిన తర్వాత ఉదయభాస్కర్‌ రోడ్డుప్రమాదమని చిత్రీకరించడంకోసం కొట్టిన దెబ్బలా.. లేదా ఇన్ని దెబ్బలు తగలడంతోనే సుబ్రహ్మణ్యం చనిపోయాడా అనేది తేలాల్సి ఉంది.

Updated Date - 2022-05-24T07:58:15+05:30 IST