రచ్చకెక్కిన పోలీస్‌ బదిలీలు

ABN , First Publish Date - 2022-07-03T06:10:19+05:30 IST

పోలీసు శాఖలో బదిలీల వ్యవహారం రచ్చకెక్కింది. ముఖ్యంగా జిల్లా పునర్విభజన అనంతరం సిబ్బందిని అటు నెల్లూరు, ఇటు బాపట్ల జిల్లాలకు పంపాల్సి ఉంది. అయితే ఆర్ముడ్‌ రిజర్వుడ్‌(ఏఆర్‌) సిబ్బంది బదిలీల ప్రక్రియ ఒక కొలిక్కి రాలేదు.

రచ్చకెక్కిన పోలీస్‌ బదిలీలు

సోషల్‌ మీడియాలో లేఖలు

అవినీతి ఆరోపణలు 

ఎస్పీ మలికగర్గ్‌ సీరియస్‌

విచారణకు ఆదేశం

డీఐజీ కార్యాలయం ఆరా  

ఒంగోలు(క్రైం), జూలై 2: పోలీసు శాఖలో బదిలీల వ్యవహారం రచ్చకెక్కింది. ముఖ్యంగా  జిల్లా పునర్విభజన అనంతరం సిబ్బందిని అటు నెల్లూరు, ఇటు బాపట్ల జిల్లాలకు పంపాల్సి ఉంది. అయితే ఆర్ముడ్‌ రిజర్వుడ్‌(ఏఆర్‌) సిబ్బంది బదిలీల ప్రక్రియ ఒక కొలిక్కి రాలేదు. జిల్లాలో 195మందిని ఇతర జిల్లాలకు పంపాల్సి ఉండగా ఇప్పటికి 133మందిని బదిలీ చేశారు. మిగిలిన వారిని సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం చేపట్టారు. అయితే సీనియారిటీ ప్రకారం కాకుండా సదరు సీటు చూసే గుమస్తా ఇష్టానుసారంగా బదిలీలకు సిద్ధమైనట్లు దుమారం రేగింది. సివిల్‌ సిబ్బంది బదిలీల్లోనూ అనేక అవకతవకలు జరిగినట్లు ప్రచారం నడుస్తోంది. ఏఆర్‌ సిబ్బంది బదిలీల్లో పెద్దఎత్తున చేతులు మారడమే కాకుండా వివిధ డ్యూటీల కేటాయింపులోనూ అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలతో కూడిన లేఖలు ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ వద్ద ప్రత్యక్షమయ్యాయి. ఈ విషయం శుక్రవారం సోషల్‌ మీడియాలో వైరలైంది.


ఆరోపణల చిట్టా..

కరపత్రం ప్రకారం.. ఏఆర్‌లో తుపాకీ పట్టినవాడు అలాగే ఉంటున్నాడు. ఇతర విభాగాల్లో విధి నిర్వహణకు వెళ్లేవారు అధికారులకు భారీగా ముడుపులు చెల్లించి వెళ్లిపోతున్నారు. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత భద్రత, బీడీ టీం, డాగ్‌స్క్వాడ్‌, ఆర్డర్లీ లాంటి పోస్టులకు వెళ్లాలనుకునే వారు అధికారులకు రూ.50వేలు చెల్లించాల్సిందే. అంతేకాదు పీటీసీ, డీటీసీతోపాటుగా ఎంటీ స్టోర్స్‌లో పనిచేసేవారు ఏళ్ల తరబడి అక్కడే ఉంటున్నారు. ఇతర జిల్లాలకు బదిలీల విషయంలో ఏఆర్‌ కార్యాలయం, పోలీసు కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ముడుపులు తీసుకొని చేస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు ఏఆర్‌ కార్యాలయంలో సీఎల్‌, ఈఎల్‌కు ఒక రేటు పెట్టి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలా సిబ్బందిని కొంతమంది అధికారులు వేధిస్తున్నారని బహిరంగ లేఖ రాశారు.


డీఐజీ కార్యాలయం ఆరా

ఏఆర్‌ సిబ్బంది బదిలీల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ప్రజాప్రతినిఽధులు డీఐజీకి సమాచారం ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. మరోవైపు బదిలీల ప్రక్రియ నిలిపివేయాలని మౌఖికంగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఈనేపథ్యంలో ఏఆర్‌ వ్యవహారాన్ని ఎస్పీ మలికగర్గ్‌ సీరియస్‌గా తీసుకున్నారు. అవినీతి ఆరోపణల్లో నిజమెంతో తేల్చాలని విచారణకు ఆదేశించారు. ఏఎస్పీ విచారణ ప్రారంభించారు.  శనివారం ఎస్పీ కార్యాలయానికి సంబంధిత అధికారులను పిలిపించుకొని మాట్లాడారు. వారి నుంచి సమగ్ర వివరాలు సేకరించినట్లు సమాచారం. 

Updated Date - 2022-07-03T06:10:19+05:30 IST