మూడు సబ్‌ డివిజన్లు

ABN , First Publish Date - 2022-06-27T06:59:49+05:30 IST

కోనసీమ జిల్లాలో పోలీస్‌ స్టేషన్లను విభజిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ఉన్న మొత్తం 25 స్టేషన్లను ఏడు సర్కిల్‌, రెండు అర్బన సర్కిల్‌ కార్యాలయాలతో పాటు మూడు పోలీసు సబ్‌ డివిజన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

మూడు సబ్‌ డివిజన్లు

  • కోనసీమ జిల్లాలో స్టేషన్ల విభజన
  • ఏడు సర్కిళ్లు, 25 పోలీసు స్టేషన్లు
  • అతిపెద్ద పోలీసు సబ్‌ డివిజనగా కొత్తపేట
  • రాజోలు సర్కిల్‌ కొత్తపేట సబ్‌ డివిజనలో విలీనం

అమలాపురం, జూన 26 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లాలో పోలీస్‌ స్టేషన్లను విభజిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ఉన్న మొత్తం 25 స్టేషన్లను ఏడు సర్కిల్‌, రెండు అర్బన సర్కిల్‌ కార్యాలయాలతో పాటు మూడు  పోలీసు సబ్‌ డివిజన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొత్తగా ఏర్పాటు కానున్న కొత్తపేట సబ్‌ డివిజన పరిధిలోకి పదకొండు మండలాల పోలీసు స్టేషన్లను చేర్చడంతో జిల్లాలోనే అతి పెద్ద సబ్‌ డివిజనగా ఆవిర్భవించింది. ఇప్పటివరకు అమలాపురం పోలీసు సబ్‌ డివిజన పదహారు మండలాలతో ఉండేది. దీనిని విభజించడంతో ఏడు పోలీస్‌ స్టేషన్ల పరిధికే పరిమితమైంది. రాజోలు నియోజకవర్గ ప్రాంతం అమలాపురం రెవెన్యూ డివిజన పరిధిలో ఉండే మూడు మండలాలను పోలీసు సబ్‌ డివిజన వచ్చేసరికి కొత్తపేట సబ్‌ డివిజనలో విలీనం చేశారు. గతంలో రెవెన్యూ, పోలీసు సబ్‌ డివిజన్లు ఒకే రీతిన ఉండేవి. ఇప్పుడు వాటి మధ్య వ్యత్యాసాలు రావడంతో పాలనాపరమైన సమస్యలు తలెత్తవచ్చని భావిస్తున్నారు. కొత్తగా పి.గన్నవరం సర్కిల్‌ ఏర్పాటైంది.

జిల్లాలో పోలీసుస్టేషన్ల విభజన ప్రక్రియ పూర్తయింది. పి.గన్నవరం పోలీసు సర్కిల్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తూ ఆ సర్కిల్‌ పరిధిలోకి అయినవిల్లి, అంబాజీపేట, పి.గన్నవరం, నగరం పోలీసు స్టేషన్లు వచ్చాయి. రావులపాలెం సర్కిల్‌ పరిధిలోకి రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు పోలీసు స్టేషన్లు వచ్చాయి. రాజోలు సర్కిల్‌ పరిధిలోకి రాజోలు మలికిపురం, సఖినేటిపల్లి పోలీసు స్టేషన్లు వచ్చాయి. పి.గన్నవరం, రావులపాలెం, రాజోలు సర్కిల్‌ పరిధిలో ఉన్న పదకొండు పోలీసు స్టేషన్లు కొత్తగా ఏర్పాటయ్యే కొత్తపేట సబ్‌ డివిజన పోలీసు కార్యాలయ పరిధిలో పనిచేయనున్నాయి. అమలాపురం రూరల్‌ సర్కిల్‌ పరిధిలోకి అల్లవరం, అమలాపురం తాలూకా, ఉప్పలగుప్తం పోలీసు స్టేషన్లు, ముమ్మిడివరం సర్కిల్‌ పరిధిలోకి ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన పోలీసు స్టేషన్లు వచ్చాయి. అమలాపురం రూరల్‌, ముమ్మిడివరం సర్కిల్‌తో పాటు అమలాపురం టౌన పోలీసు స్టేషన్లతో అమలాపురం పోలీసు సబ్‌ డివిజన ఏర్పాటైంది. ఇక రామచంద్రపురం సర్కిల్‌ పరిధిలోని రామచంద్రపురం, ద్రాక్షారామ, కె.గంగవరం మండల పోలీసు స్టేషన్లు ఉన్నాయి. మండపేట రూరల్‌ సర్కిల్‌లోకి మండపేట రూరల్‌, రాయవరం, అంగర పోలీసు స్టేషన్లు ఉన్నాయి. రామచంద్రపురం, మండపేట రూరల్‌ సర్కిల్‌తో పాటు మండపేట అర్బన సర్కిళ్లు కలిపి రామచంద్రపురం పోలీసు సబ్‌ డివిజన పరిధిలోకి వచ్చాయి. ఈ మేరకు ప్రిన్సిపల్‌ కార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పోలీసు సబ్‌ డివిజన్ల ఏర్పాటులో ప్రభుత్వం అనుసరించిన విభజన వైఖరి పట్ల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో ఇష్టానుసారంగా చేయడం వల్ల పరిపాలనాపరంగా సమస్యలు తలెత్తవచ్చని పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాజోలు నియోజకవర్గ ప్రజలు ఈ సమస్యను ఎదుర్కోవలసి ఉంది. 

Updated Date - 2022-06-27T06:59:49+05:30 IST