సిబ్బంది కావలెను!

ABN , First Publish Date - 2022-05-15T05:38:35+05:30 IST

పోలీసుశాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. కొన్నేళ్లుగా నియామకాలు లేవు. రిటైర్డ్‌ అయిన వారి స్థానాలూ ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. పోలీసులపై పనిభారం పెరగడంతోపాటు కేసుల దర్యాప్తుపైనా ఆ ప్రభావం పడుతోంది. 2వేల మంది సిబ్బందికి గాను 1,700 మంది ఉన్నారు.

సిబ్బంది కావలెను!

పోలీసుశాఖలో వేధిస్తున్న కొరత
చాన్నాళ్లుగా నియామకాలు లేవాయె
కేసుల దర్యాప్తులోనూ ఇబ్బందులు
ఒత్తిడితో సతమతమవుతూనే విధులు
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

పోలీసుశాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. కొన్నేళ్లుగా నియామకాలు లేవు. రిటైర్డ్‌ అయిన వారి స్థానాలూ ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. పోలీసులపై పనిభారం పెరగడంతోపాటు కేసుల దర్యాప్తుపైనా ఆ ప్రభావం పడుతోంది. 2వేల మంది సిబ్బందికి గాను 1,700 మంది ఉన్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో 45 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఐదుగురు డీఎస్పీలు, 11 మంది సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, 79 మంది ఎస్‌ఐలు, నలుగురు ఏఆర్‌ రిజర్వు ఇన్‌స్పెక్టర్లు, 9 మంది ఆర్‌ఎస్‌ఐలు ఉన్నారు. అన్ని విభాగాల సిబ్బంది 1700 మంది మాత్రమే ఉన్నారు. ఉండాల్సింది 2వేల మంది కాగా ఇంకా 300 మంది తక్కువగా ఉన్నారు. ఒక్కో స్టేషన్‌లో అవసరాన్ని బట్టి 10 నుంచి 15 మంది పనిచేయాలి. పట్టణ ప్రాంతాల్లో ఆ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ సిబ్బంది అందుకు అనుగుణంగా లేరు. పోస్టుల భర్తీలో కాలయాపనే ఇందుకు కారణం. జిల్లాలో ఒక స్పీకర్‌, ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఉన్నారు. వీరు జిల్లాల్లో పర్యటించినప్పుడు భద్రత కూడా పోలీసులదే.

సివిల్‌ పోలీసులే ఇతర విధులకు..
సివిల్‌ పోలీసులనే ఇతర శాఖలకు కేటాయించడంతో స్టేషన్లలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఏసీబీ, సీఐడీ, ఇంటెలిజెన్స్‌, ట్రాన్స్‌కో, రైల్వే, విజెలెన్స్‌, డ్రగ్‌ కంట్రోల్‌, ఆర్టీసీ.. ఇలా పలు శాఖలకు సివిల్‌ పోలీసులనే కేటాయిస్తున్నారు. ఇక వీఐపీ బందోబస్తు, జాతర్లు, ప్రజాప్రతినిధుల గన్‌మెన్లు, డాగ్‌స్క్వాడ్‌ బృందాలు, ఎస్కార్టులు, హెడ్‌క్వార్టర్స్‌ విధులకు ఏఆర్‌ పోలీసులున్నా వారు సరిపడనంత లేకపోవడంతో సివిల్‌ పోలీసులనే పంపుతున్నారు. ఒక్కో స్టేషన్‌ పరిధిలో రాత్రి పూట సమస్యాత్మక ప్రాంతాలను బట్టి ఐదు లేక ఆరు పోలీసు బీట్లు వేయాల్సి ఉన్నా సిబ్బంది కొరతతో వాటిని తగ్గిస్తున్నారు. దీంతో కొన్ని ప్రాంతాలకే బీట్లు పరిమితమవుతున్నాయి. కొందరు పగలు విధులు నిర్వహించినా కొన్ని పరిస్థితుల్లో మళ్లీ రాత్రి పని చేయాల్సి ఉంటుంది. దీంతో వారు ఒత్తిడికి గురవుతున్నారు.

కేసుల దర్యాప్తుపై ప్రభావం
సిబ్బంది కొరత ప్రభావం కేసుల దర్యాప్తుపైనా పడుతోంది. సిబ్బందిని సకాలంలో ఘటనా స్థలాలకు పంపించడం, అక్కడ ప్రత్యక్ష సాక్షులను విచారించడంతో పాటు నిందితుల కోసం గట్టి నిఘా ఏర్పాటు వంటివి చేయాల్సి ఉంటుంది. ఈ కేసుల దర్యాప్తు సాగుతుండగానే మళ్లీ రోజువారీ నేరాల దర్యాప్తు, నిందితుల వివరాలను సేకరించడం వంటి పనులు ఉంటాయి. నాలుగేళ్ల క్రితం బలగ సమీపంలోని  అపార్ట్‌మెంట్‌లో అత్తాకోడళ్లు హత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తు ఏమైందో ఇప్పటికీ తెలియదు. ఇటీవల శ్రీకాకుళం వన్‌టౌన్‌, టూటౌన్‌, రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోరీలు జరిగాయి. సీసీ కెమెరాలను, హార్డ్‌డిస్క్‌లను ముందుగా తొలగించేసి ఆతర్వాత చోరీలకు పాల్పడుతున్నారు. ఈ కేసుల దర్యాప్తు కొనసాగుతూనేఉంది.

ప్రభుత్వానికి విన్నవించాం: జీఆర్‌ రాధిక, ఎస్పీ
పోలీసు సిబ్బంది కొరతపై ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ఉన్నతాధికారులకు తెలియజేశాం. త్వరలో సిబ్బంది నియామకాలు జరిగే అవకాశముంది. కేసుల దర్యాప్తులో ఇబ్బందిలేకుండా సిబ్బందిని కేటాయిస్తున్నాం.

 

Updated Date - 2022-05-15T05:38:35+05:30 IST