పోలీస్‌ స్పందనకు 61 అర్జీలు

ABN , First Publish Date - 2021-10-19T05:32:18+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం అని, అర్జీదారులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు కోరారు.

పోలీస్‌ స్పందనకు 61 అర్జీలు
కార్యక్రమం నిర్వహిస్తున్న ఎస్పీ

కాకినాడ క్రైం, అక్టోబరు 18: ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం అని, అర్జీదారులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు కోరారు.  జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుంచి 61 అర్జీలను ఎస్పీ స్వీకరించారు. ఇందులో సివిల్‌ వివాదాలకు చెందినవి 30, కుటుంబ తగాదాలు 9, ఇతర సమస్యలపై 22 ఫిర్యాదులు వచ్చాయి. సంబంధిత అధికారులపై ఫిర్యాదులపై తక్షణం స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదేశించారు. ఈనెల 11న నిర్వహించిన స్పందనలో స్వీకరించిన 64 అర్జీల్లో 50 ఫిర్యాదులు పరిష్కరించినట్లు చెప్పారు. మిగతా 14 అర్జీలు పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఆత్రేయపురం మండలం కట్టుంగకు చెందిన దళిత మహిళను కాళీకృష్ణ మాయమాటలతో మోసం చేసి వివాహం చేసుకుని అనంతరం ఇద్దరు సంతానంతో వదిలేశాడు. దీంతో జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా పోలీసులు స్పందించి ఆమెకు జరిగిన అన్యాయంపై కేసు నమోదు చేసి పరిహారం ఇవ్వాలని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు జిల్లా కలెక్టర్‌కు సిఫారసు చేశారు. దీంతో ప్రభుత్వం రూ. లక్ష రూపాయలు మంజూరు చేయడంతో ఎస్పీ అందించారు. అలాగే మలికిపురానికి చెందిన గెద్దాడ శ్రీనివాసరావు ఇంటి పక్కన కొంత మంది అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడం, ఇరుగుపొరుగు వారికి తీవ్ర అసౌకర్యం కల్పించడంతో ఈనెల 4న స్పందనలో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై ఎస్పీ రవీంద్రనాఽథ్‌బాబు ఆదేశాల మేరకు ఈనెల 14న ప్రత్యేక పోలీసు బృందం ఆ ఇంటిపై దాడి చేసి అక్కడ ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సమస్య పరిష్కరించినందుకు శ్రీనివాసరావు ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - 2021-10-19T05:32:18+05:30 IST