అడవిలోకి వెళ్లిన స్నేహితుల బృందం.. తప్పిపోయిన వ్యక్తి కోసం Police సెర్చ్ ఆపరేషన్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , First Publish Date - 2021-10-02T22:39:20+05:30 IST

మందుబాబులు ఒక్కోసారి తమను తామే మర్చిపోయి.. మత్తులో తేలుతుంటారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గడుపుతుంటారు. ఒక్కోసారి హద్దులు మీరి పోలీసులతో గుణపాఠాలు నేర్పించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ సందర్భం

అడవిలోకి వెళ్లిన స్నేహితుల బృందం.. తప్పిపోయిన వ్యక్తి కోసం Police సెర్చ్ ఆపరేషన్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..

మందుబాబులు ఒక్కోసారి తమను తామే మర్చిపోయి.. మత్తులో తేలుతుంటారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గడుపుతుంటారు. ఒక్కోసారి హద్దులు మీరి పోలీసులతో గుణపాఠాలు నేర్పించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ సందర్భం ఎందుకొచ్చిందంటే.. ఇక్కడ ఓ మందుబాబు.. పోలీసుల బృందానికి నిద్ర లేకుండా చేశాడు. చివరకు అసలు విషయం తెలియగానే.. అవాక్కవడం పోలీసుల వంతైంది. సినిమాలో కామెడీ సీన్లకు మించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

 

బెహాన్ ముట్లు అనే(50) అనే టర్కిష్ వ్యక్తి.. తన స్నేహితులతో కలిసి మందేశాడు. అంతా సరదాగా గడుపుదామనుకున్నారు. అందుకోసం నగరానికి సమీపంలో ఉన్న సయ్యాకా అనే గ్రామీణ ప్రాంతానికి వెళ్లారు. అక్కడి అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా.. ఉన్నట్టుండి బెహాన్.. కనిపించకుండాపోయాడు. ఆందోళన చెందిన మిగతా స్నేహితులు అతడి కోసం చాలా సేపు గాలించారు. కానీ కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.


మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. బెహాన్ కోసం రంగంలోకి దిగారు. అడవిలో గంటల తరబడి వెతకడం ప్రారంభించారు. సెర్చ్ ఆపరేషన్‌లో ఉన్న పోలీసులకు.. ఓ స్థానికుడు కూడా సాయం చేశాడు. అతను పోలీసుల వెంటే ఉంటూ బెహాన్ ముట్లు కోసం గాలిస్తున్నాడు. గంటల తరబడి వెతికినా.. ముట్లు జాడ కనిపించలేదు. దాదాపు అడవి మొత్తం జల్లెడ పట్టారు. కానీ అతడి ఆచూకీ మాత్రం కనిపించలేదు. వెతికి వెతికి విసిగిపోయిన పోలీసులకు కోపం వచ్చి.. ‘‘ఎక్కడున్నావ్‌రా ముట్లూ..’’ అంటూ గట్టిగా అరిచారు.


పోలీసుల బృందానికి సాయం చేస్తున్న వ్యక్తి.. ఈ మాటలు విన్నాడు. ‘‘సార్ మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు’’.. అని ప్రశ్నించాడు. ముట్లు కోసం అని పోలీసులు తెలపగా.. ఆ ముట్లు నేనే సర్.. అంటూ చావుకబురు చల్లగా చెప్పాడు. దీంతో పోలీసులంతా.. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మందుబాబును వెంటే తిప్పుకొని.. ఫూల్స్ అయ్యామని తెలుసుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయారు. పీకల దాకా మద్యం సేవించిన ఆ వ్యక్తి.. గంటల పాటు తన కోసం తానే వెతుక్కున్నానని తెలుసుకున్నాడు. విషయం తెలిసి మిగతా స్నేహితులు, స్థానికులు తెగ నవ్వుకున్నారు. దీనికి సంబంధించి వజియేట్ అనే మీడియా సంస్థ ట్విట్టర్‌లో ఓ ఫొటోను పోస్టు చేసింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.



Updated Date - 2021-10-02T22:39:20+05:30 IST