అడుగడుగునా.. నరకం

ABN , First Publish Date - 2022-04-26T09:12:16+05:30 IST

అడుగడుగునా ఆంక్షలు. నిషేధాజ్ఞలు. అడ్డుగా ముళ్ల కంచెలు, బారికేడ్లు. జాతీయ రహదారికి అటూ ఇటూ రోడ్లన్నీ మూసివేత.

అడుగడుగునా.. నరకం

  • పోలీసుల ఆంక్షలు, నిర్బంధాలు  
  • తాడేపల్లి పరిసరాల్లో ప్రజలు విలవిల 
  • పెద్దఎత్తున బలగాల మోహరింపు 
  • రోడ్లపై ముళ్ల కంచెలు, బారికేడ్లు 
  • కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌ 
  • రోగులనూ అడ్డుకున్న పోలీసులు
  • ఎండలో వాహనదారులు, స్థానికులకు ఇక్కట్లు 


మంగళగిరి, ఏప్రిల్‌ 25: అడుగడుగునా ఆంక్షలు. నిషేధాజ్ఞలు. అడ్డుగా ముళ్ల కంచెలు, బారికేడ్లు. జాతీయ రహదారికి అటూ ఇటూ రోడ్లన్నీ మూసివేత. వేలాది మంది పోలీసులతో తనీఖీలు. కిలో మీటర్ల పొడవునా ట్రాఫిక్‌ జామ్‌. ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు సీఎం నివాసం ఉన్న తాడేపల్లి పరిసరాల్లో కనిపించిన దృశ్యాలివి. పోలీసుల కట్టడి చర్యలతో స్థానికులు, ఆస్పత్రులకు వచ్చినవారు, వివిధ పనుల మీద వెళ్తున్నవారు అల్లాడిపోయారు. పోలీసుల తనిఖీలు, ట్రాఫిక్‌ జామ్‌తో ఎండలో గంటల కొద్దీ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సీపీఎస్‌ రద్దు చేయాలంటూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు తాడేపల్లిలోని సీఎం నివాసం  ముట్టడికి పిలుపు ఇవ్వడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో విజయవాడలో ఉపాధ్యాయుల సభ ఊహించని విధంగా విజయవంతం కావడంతో ఈ సారి భారీగా పోలీసులను మోహరించారు. తాడేపల్లి వైపు ఉపాధ్యాయులు రాకుండా అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకున్నారు. కాజ టోల్‌గేట్‌ నుంచి విజయవాడ వరకు జాతీయ రహదారిలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటుచేశారు. బస్సులు, కార్లు, ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలతో పాటు బైకులపై వెళ్లేవారిని సైతం పోలీసులు ఆపి తనిఖీలు చేశారు.


 వారి గుర్తింపు కార్డులను పరిశీలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని మంగళగిరిలోని పోలీస్‌ స్టేషన్లు, కల్యాణమండపాలకు తరలించారు. మంగళగిరిలోని ఎన్నారై జంక్షన్‌, తెనాలి ఫ్లైఓవర్‌ వద్ద, ఆత్మకూరు జంక్షన్‌, టీడీపీ కేంద్ర కార్యాలయం, డీజీపీ కార్యాలయం, వడ్డేశ్వరం అండర్‌పాస్‌, కొలనుకొండ అండర్‌పాస్‌, మంగళగిరి పాతబస్టాండ్‌, తాలూకా సెంటర్‌, ఎర్రబాలెం డాన్‌బోస్కో స్కూల్‌ వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇక తాడేపల్లి ప్రాంతంలో అయితే అడుగడుగునా ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. తాడేపల్లిలో ఇటు జాతీయ రహదారి నుంచి అటు మంగళగిరి-ప్రకాశం బ్యారేజీ ఆర్‌ఆండ్‌బీ రోడ్డు మధ్య ఉన్న చిన్నాపెద్ద రహదారులన్నింటినీ పోలీసులు పూర్తిగా మూసివేశారు. కనకదుర్గ వారధిపై అనేకమార్లు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పోలీసులు ముఖ్యంగా హైవేపై నిషేధాజ్ఞలు అమలు చేయడంతో విజయవాడ వైపుగా వెళ్లాల్సిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. మణిపాల్‌ ఆస్పత్రికి వెళ్తున్న రోగులు, వారి బంధువులను సైతం పోలీసులు అడ్డుకున్నారు. హైవేపై వెళ్లే వాహనాలను అడ్డుకోవడంతో ప్రకాశం బ్యారేజీ మార్గంలో విజయవాడ వైపు వెళ్లాల్సి వచ్చింది. తాడేపల్లి పరిసర ప్రాంతాలలోని స్థానికులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. విజయవాడ, మంగళగిరి వైపు వెళ్లడానికి, ఇళ్లకు చేరుకోవడానికి ఎండలో అలమటించారు. పోలీసుల కట్టడి చర్యలతో విసిగిపోయిన ప్రజలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-04-26T09:12:16+05:30 IST