పద్ధతి లేని ‘యుద్ధం’!

ABN , First Publish Date - 2020-03-27T07:33:13+05:30 IST

హైదరాబాద్‌లో హాస్టళ్లు మూసివేస్తున్నారంటూ వందలాదిమంది కార్లు, బైకుల్లో ఏపీ సరిహద్దుకు చేరుకున్నారు. వారిని అనుమతించాలా, వద్దా? ఈ అంశంపై బుధవారం మధ్యాహ్నం...

పద్ధతి లేని ‘యుద్ధం’!

  • కరోనాపై పోరులో ఎవరికి వారే
  • శాఖల మధ్య సమన్వయం కరువు
  • ఒక్కటిగా నడిపించే వ్యవస్థ ఎక్కడ?
  • వెంటనే వార్‌ రూమ్‌ పెట్టాలి
  • మెరుపు నిర్ణయాలు తీసుకోవాలి
  • కీలక మార్గదర్శకాలపైనా ‘చీకటి’ జీవోలే
  • అధికారులు, సిబ్బందికి చేరని ఆదేశాలు
  • కట్టడిలో పాల్గొనాల్సిన వారికీ ఇక్కట్లు
  • ఇదే కొనసాగితే కోలుకోలేనంత ముప్పు
  • సీనియర్‌ అధికారుల్లోనే ఆందోళన


(అమరావతి - ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌లో హాస్టళ్లు మూసివేస్తున్నారంటూ వందలాదిమంది కార్లు, బైకుల్లో ఏపీ సరిహద్దుకు చేరుకున్నారు. వారిని అనుమతించాలా, వద్దా? ఈ అంశంపై బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల వరకు ఎటూ తేల్చలేకపోయారు. ఇదే సమస్య గురువారం గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద కూడా ఎదురైంది. హైదరాబాద్‌ నుంచి జనం తరలివచ్చే అవకాశాలపై మంగళవారం రాత్రి నుంచే ప్రచారం జరుగుతున్నా.... వారంతా చెక్‌పోస్టులకు చేరుకునే దాకా ఎలాంటి చేతలూ లేవు. ఫలితం... మహిళలు, పిల్లలతో సహా దాదాపు 1500 మందికి నడిరోడ్డుపై 8 గంటలపాటు యాతన!


లాక్‌డౌన్‌ నేపథ్యంలో కూరగాయలు, నిత్యావసరాల కోసం ఉదయాన్నే జనం తండోపతండాలుగా రైతు బజార్లు, మార్కెట్లకు వస్తున్నారు. ప్రమాదమని తెలిసినా తప్పడంలేదని, మరో మార్గం కనిపించడంలేదని వాపోతున్నారు. ‘సామాజిక దూరం’ పాటిస్తూనే ప్రజలకు నిత్యావసరాలు అందించడం ఎలా? దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ప్రణాళికా లేదు!

ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే! ఇలాంటివి ఎన్నెన్నో! కరోనాపై దేశం చేస్తున్నది యుద్ధం! అది రాష్ట్రంలోనూ జరుగుతోంది! కానీ సమరంలో సమన్వయం లేదు. ‘శత్రువు’ను ఓడించే పకడ్బందీ వ్యూహం లేదు. పరిస్థితిపై రెప్పవాలకుండా కన్నేసి ఉంచి... ఎప్పటికప్పుడు మెరుపు నిర్ణయాలు తీసుకునే ఏకీకృత వ్యవస్థ కనిపించడం లేదు. ఈ అలసత్వం, నిర్లక్ష్యం వల్ల కొంప మునిగే ప్రమాదముందని స్వయంగా ఉన్నతస్థాయి యంత్రాంగంలోనే ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా కట్టడి  అనగానే ఇప్పుడు అందరికీ గుర్తుకు వస్తున్నది పోలీసులే! ఎందుకంటే, ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి, రోడ్లెక్కిన వారిని తిట్టో, కొట్టో తిప్పి పంపిస్తున్నారు. ఆ తర్వాత ప్రజలకు గుర్తుకొస్తున్నది.. పగలూ రాత్రీ శ్రమిస్తూ వైద్య సేవలో నిమగ్నమైన వైద్య సిబ్బంది! అంతే!  కరోనాపై యుద్ధం ఈ రెండు శాఖలు చేస్తే సరిపోతుందా? కరోనా నియంత్రణలో వైద్య, ఆరోగ్యశాఖ, పోలీసు, ఫైర్‌, స్థానిక సంస్థలు, విపత్తు శాఖ, రెవెన్యూ విభాగాలు పాలుపంచుకొంటాయని కేంద్రం తెలిపింది. ఎలకా్ట్రనిక్‌ , ప్రింట్‌, సోషల్‌ మీడియాకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఈ విభాగాలు వాటికవే సమన్వయం చేసుకోలేవు. అంటే ప్రభుత్వ స్థాయిలో సమర్థ నాయకత్వం కలిగిన నేత, లేదా ఉన్నతాధికారి  ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు కావాలి. ఒక వార్‌రూమ్‌ ఏర్పాటు చేసి అనుక్షణం పరిస్థితులను గమనిస్తూ, మెరుపులా స్పందించాలి. ఇప్పుడు  అదేదీ లేదు. పొరుగు రాష్ట్రంతో సమన్వయం లేదు, రాష్ట్రంలోని వివిధ శాఖల మధ్య సమన్వయమూ లేదు. ఎవరి దారి, వారిదే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. 


నినాదంలోనే తప్పు...

‘భయం వద్దు! అప్రమత్తంగా ఉందాం’... ఇది కరోనాపై ప్రభుత్వ పెద్దల నినాదం! ఇక్కడే  పెద్ద తప్పు జరుగుతోంది. ఎందుకంటే... కరోనాకు భయపడి తీరాల్సిందేనని, 21 రోజులు లాక్‌డౌన్‌ పక్కాగా పాటించకుంటే దేశం 21 సంవత్సరాలు వెనక్కి పోతుందని స్వయంగా ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మన యంత్రాంగం మాత్రం ‘భయం వద్దు’ అనే మూడ్‌లోనే ఉండిపోయింది. తొలుత ‘స్థానిక ఎన్నికల’ లెక్కలో పడిన ప్రభుత్వం... కరోనాను తేలిగ్గా తీసుకుంది. ఆ తర్వాత మేల్కొన్నా సమన్వయ లోపం వెంటాడుతోంది. కరోనా నేపథ్యంలో రాష్ట్రాలు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలో దిశా నిర్దేశం చేస్తూ కేంద్ర హోం శాఖ, డీఓపీటీ, వైద్య, ఆరోగ్యశాఖల నుంచి పుంఖానుపుంఖాలుగా ఉత్తర్వులు వచ్చాయి. కరోనాను జీవ విపత్తుగా ప్రకటిస్తూ దాన్ని విపత్తు జాబితాలో చేర్చాలంటూ కేంద్రం ఈనెల 14న లేఖ రాసింది. రాష్ట్ర సర్కారు దాన్ని వెంటనే అమలు చేయలేదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో  ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ జరగడానికి సరిగ్గా ఒక రోజు ముందు అంటే, 19న నింపాదిగా స్పందించింది.


చర్యలు ఎక్కడ?

ప్రజలను రోడ్లమీదకు రానివ్వకుండా, సామాజిక దూరం పక్కాగా పాటించేందుకు ప్రభుత్వ స్థాయిలో అనేక ముందస్తు ప్రత్యామ్నాయ  చర్యలు తీసుకునే  అవకాశం ఉన్నా... వాటిని వదిలేసినట్లుగా కనిపిస్తోంది. ఫలితంగా రైతు బజార్లకు ఒకేసారి వేలాది మంది పోటెత్తుతున్నారు. కేంద్రం జనాతా కర్ఫ్యూను ప్రకటించిన తర్వాత, తదుపరి చర్యలు ఏముంటాయి? కొత్తగా తీసుకునే కఠిన నిర్ణయాలను రాష్ట్రస్థాయిలో ఎలా ఎదుర్కోవాలి? విపత్తును దీటుగా ఎదుర్కొనేందుకు  ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా సర్వ సన్నద్ధం చేయాలో ముందుగానే అంచనాకు రాకపోవడంతో తగిన కార్యాచరణను రూపొందించుకునే అవకాశాన్ని కోల్పోయినట్లయిందని, దీని వల్ల రానున్న రోజుల్లో దుష్పరిణామాలు ఎక్కువగా ఉంటాయన్న ఆందోళనా సర్వత్రా వ్యక్తమవుతోంది.


దీనిపైనా అర్ధరాత్రి జీవోలే

జగన్‌ సర్కారు  అధికారంలోకి వచ్చాక మొదలైన ఓ వింత సంప్రదాయం... అర్ధరాత్రి సమయంలో జీవోలు జారీ చేయడం! చివరికి... కరోనా అంశంపైనా అర్ధరాత్రి జీవోలు వెలువడుతున్నాయి. వాటిలో పేర్కొన్న మార్గదర్శకాలు సంబంధిత సిబ్బందికి వెంటనే చేరడంలేదు. అధికారుల పరిస్థితే ఇలా ఉంటే, సామాన్య ప్రజల సంగతి ప్రత్యేకంగా చెప్పేదేముంది! ఉద్యోగులు ఇంటినుంచి పనిచేయాలంటూ 24వ తేదీనే ఉత్తర్వులు ఇచ్చారు. కానీ, వాటిని ఆయా శాఖాధిపతులు కింది ఉద్యోగులకు తెలియజేయలేదు. తాము ప్రత్యేకంగా ఆదేశాలు ఇస్తామంటూ కొందరు విభాగాధిపతులు చెబుతూ, అప్పటి వరకు విధులకు రావాలంటూ ఆదేశించారు. కానీ... అప్పటికే సర్కారు లాక్‌డౌన్‌ ప్రకటించింది. దారులు మూసుకుపోయాయి. ఉద్యోగుల ఆందోళన, విన్నపాలతో శాఖల వారీగా ఉద్యోగులు ఆఫీసులకు రావొద్దని, ఇంటినుంచే పనిచేయాలని ఆదేశాలు ఇచ్చారు. 



అందరినీ కొడతాం!

‘రోడ్లమీదకు వస్తే ఈడ్చికొడతాం. మీడియా అన్నది కూడా చూడం’ అని గుంటూరు జిల్లాకు చెందిన డీఎస్పీ బాహాటంగా హెచ్చరించారు. మీడియా ప్రతినిధులను అడ్డుకోవద్దని  స్వయంగా ప్రధాని ఆదేశించారు. మరి... వారినే కొడితే, అత్యవసర సేవలకు వెళ్లే ఇతర సిబ్బంది పరిస్థితి ఏమిటి? జనం రోడ్లెక్కడం, వారు ఎందుకొస్తున్నారో తెలుసుకునే ఓపిక లేక పోలీసులు లాఠీలకు పనిచెప్పడం నిత్యకృత్యంగా మారింది.


సమన్వయ లోపం...

‘‘ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, రోడ్లపై వాహనాలు, ప్రజలను కట్టడిచేయడానికి పోలీసులు అహోరాత్రులు పనిచేస్తున్నారు. ఇదే చర్యల్లో పాలుపంచుకొనేందుకు విధులకు హాజరవుతున్న ఇతర ఉద్యోగులు, మీడియాపై పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. రోడ్లపైకి ఎందుకొస్తున్నారంటూ లాఠీలతో కొడుతున్నారు. చివరకు అత్యవసర సేవల్లో పాల్గొనే సిబ్బంది కూడా దాడులకు గురవుతున్నారు. రెవెన్యూ అధికారులు కూడా బాధితులే. సమన్వయం ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి?’’ - ఓ సీనియర్‌ అధికారి


అంతా అయోమయం...

‘‘ప్రభుత్వం అర్ధరాత్రి ఉత్తర్వులు ఇస్తోంది. అవి మా దాకా రావడం లేదు. లాక్‌డౌన్‌లో ఉద్యోగులు ఏం చేయాలో ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించి దాన్ని అమలు చేయాలని విభాగాధిపతులను ఆదేశిస్తే మాకు ఇబ్బందులు ఉండవు. సమన్వయం కొరవడుతోంది. ఆఫీసులకు వెళ్లేందుకు రోడ్లమీదకు వస్తే పోలీసులు తిడుతున్నారు. ఐడీ కార్డులను చూపించినా కొడుతున్నారు!’’

- రెవెన్యూ ఉద్యోగ సంఘం నేత


Updated Date - 2020-03-27T07:33:13+05:30 IST