ట్యాంక్ బండ్‌పై ఈసారి కొత్త పద్ధతిలో గణేష్‌ నిమజ్జనం!

ABN , First Publish Date - 2021-09-07T18:48:25+05:30 IST

ట్యాంక్‌బండ్‌పై గణేష్‌ నిమజ్జనం కోసం ఈ ఏడాది కొత్త పద్ధతి...

ట్యాంక్ బండ్‌పై ఈసారి కొత్త పద్ధతిలో గణేష్‌ నిమజ్జనం!

  • మానవ అవసరం లేకుండా నిమజ్జనం
  • ఈ సారి కొత్త పద్ధతి..
  • ట్రయల్‌ రన్‌ నిర్వహించిన సిటీ పోలీస్‌

హైదరాబాద్‌ సిటీ/ కవాడిగూడ : ట్యాంక్‌బండ్‌పై గణేష్‌ నిమజ్జనం కోసం ఈ ఏడాది కొత్త పద్ధతి అవలంభిస్తున్నామని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ ఏడాది వినాయక విగ్రహాలను సురక్షితంగా, వేగవంతంగా నిమజ్జనం చేసేందుకు కొత్త పద్ధతులు అవలంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సారి విగ్రహాలను నిమజ్జనం చేసే క్రేన్‌ ప్లాట్‌ఫాం కింద ఖాళీ డ్రమ్ములు లేదా థర్మాకోల్‌ షీట్స్‌ను వినియోగిస్తున్నామని తెలిపారు. 


వాహనం పైనుంచి విగ్రహాన్ని ప్లాట్‌ఫాం పైకి తరలించిన తర్వాత క్రేన్‌ ద్వారా హుస్సేన్‌సాగర్‌ నీటిలోకి తీసుకెళతామని, నీటిని తాకిన వెంటనే ఖాళీ డ్రమ్ములు లేదా థర్మాకోల్‌ షీట్స్‌ ఉన్న వైపు పైకి లేస్తుందని, దాంతో విగ్రహం ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా నీటిలోకి వెళ్లిపోతుందన్నారు. ఈ సరికొత్త పద్దతిలో నిమజ్జన ప్లాట్‌ఫాం మీదకు మనుషులు వెళ్లే అవసరం లేదన్నారు. కొత్త పద్దతి ద్వారా ప్రతి విగ్రహం నిమజ్జనం చేసేందుకు 4 నుంచి 6 నిమిషాల సమయం ఆదా అవుతుందన్నారు.


ఎన్టీఆర్‌ మార్గ్‌,  పీవి మార్గ్‌లలో పెద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై చిన్న విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అడిషనల్‌ కమిషనర్‌ చౌహాన్‌, సెంట్రల్‌జోన్‌ జాయింట్‌ సీపీ విశ్వప్రసాద్‌, సెంట్రల్‌జోన్‌ అడిషనల్‌ డీసీపీ రమణారెడ్డి, ట్రాఫీక్‌ డీసీపీ మురళీకృష్ణ, చిక్కడపల్లి ఏసీపీ చల్లా శ్రీధర్‌, గాంధీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-07T18:48:25+05:30 IST