తీరుమారని పోలీసులు

ABN , First Publish Date - 2022-08-17T06:27:13+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు మరోసారి అరెస్టులు, గృహనిర్బంధాలకు దిగారు.

తీరుమారని పోలీసులు
అరెస్టులపై పోలీసులను ప్రశ్నిస్తున్న సీపీఎం నాయకులు

సీఎం పర్యటనతో సీపీఎం, సీఐటీయూ నేతల ముందస్తు అరెస్టు

నిరసన వ్యక్తం చేస్తూ మునగపాకలో రాస్తారోకో

అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని పోలీసులతో వాగ్వాదం


మునగపాక, ఆగస్టు 16: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు మరోసారి అరెస్టులు, గృహనిర్బంధాలకు దిగారు. ఎలమంచిలి, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో సీపీఎం, సీఐటీయూ, ఇతర ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మునగపాక మండలంలో సీపీఎం నాయకులను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేయడంతో ఆ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకోకు దిగారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని, పౌర హక్కులకు భంగం కలిగే విధంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని విడనాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ నాయకులను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని వాదనకు దిగారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని స్టేషన్‌ నుంచి బయటకు తీసుకువెళ్లిపోవడానికి వారు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, రాత్రి ఒంటి గంట ప్రాంతంలో పోలీసులు తమ ఇంటికి వచ్చి అరెస్టు చేశారని అన్నారు. ముఖ్యమంత్రి వచ్చినప్పుడల్లా సీపీఎం నాయకులను అరెస్టు చేయడం పోలీసులకు ఆనవాయితీగా మారిందని ధ్వజమెత్తారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు మాట్లాడుతూ, పొలంలో వరినాట్లు వేయడానికి వెళ్తున్న తనను పోలీసులు పట్టుకొని స్టేషన్‌కు తరలించారని, సెల్‌ఫోన్లను బలవంతంగా లాక్కొన్నారని ఆరోపించారు. తాము దొంగల్లా, దోపిడీదారుల్లా కనిపిస్తున్నామా? అని పోలీసులను నిలదీశారు. మత్స్యకార, జనసేన నాయకుడు చోడపల్లి అప్పారావు మాట్లాడుతూ, ఉదయం వాకింగ్‌కు వెళ్తున్న తనను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు.  

కాగా అనకాపల్లి పట్టణ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున సీపీఎం జిల్లా నాయకుడు ఎ.బాలకృష్ణ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణలను వారి ఇళ్ల వద్ద అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఎం పర్యటన ముగిసిన తరువాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సీపీఎం నాయకులు గంటా శ్రీరామ్‌, కాళ్ల తేలయ్యబాబు తదితరులు పార్టీ కార్యాలయం నుంచి బయటకు పోలీసులు పహారా కాశారు.


Updated Date - 2022-08-17T06:27:13+05:30 IST