విలేకరులపై లాఠీచార్జి

ABN , First Publish Date - 2020-03-27T07:38:06+05:30 IST

హనుమాన్‌జంక్షన్‌ ప్రాంత విలేకరులపై పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు గురువారం అమానుషంగా లాఠీచార్జి జరిపారు. ఈ ఘటనలో వివిధ పత్రికలకు చెందిన ఏడుగురు...

విలేకరులపై లాఠీచార్జి

పోలీసుల అమానుషం

చెక్‌పోస్టు మార్చాలన్నందుకు విచక్షణరహితంగా బాదిన ‘పశ్చిమ’ పోలీసులు


హనుమాన్‌ జంక్షన్‌, మార్చి 26: హనుమాన్‌జంక్షన్‌ ప్రాంత విలేకరులపై పశ్చిమ గోదావరి జిల్లా  పోలీసులు గురువారం అమానుషంగా లాఠీచార్జి జరిపారు. ఈ ఘటనలో వివిధ పత్రికలకు చెందిన ఏడుగురు రిపోర్టుర్లు గాయపడ్డారు. కరోనా ఆంక్షల అమలులో భాగంగా ఏలూరు పోలీసులు జంక్షన్‌లో అభయాంజనేయస్వామి ఆలయం వద్ద చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు. విజయవాడ, నూజివీడు. గుడివాడ నుంచి పశ్చిమగోదావరి వైపు వెళ్లే వాహనాలను అడ్డుకుని.. అనుమతి పత్రాలు ఉంటేనే పంపిస్తున్నారు.  రహదారి వెంబడి పశ్చిమగోదావరి జిల్లా లోపల కృష్ణా జిల్లాకు చెందిన కొయ్యూరు, బొమ్ములూరు, కండ్రిక తదితర గ్రామాలుఉన్నాయి. ఇక్కడ చెక్‌ పోస్టు పెడితే ఆ గ్రామాల ప్రజలు నిత్యావసర  సరుకులు, కూరగాయలకు ఇబ్బందిపడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని.. జిల్లా సరిహద్దు కలపర్రు వద్ద చెక్‌పోస్టు పెట్టాలని విలేకరులు సూచించారు. దీంతో చెప్పడానికి మీరెవరంటూ విలేకరులను లాఠీలతో చితక బాదారు. దీంతో రిపోర్టర్లు నాలుగు రోడ్ల కూడలిలో రోడ్డుపైనే బైఠాయించారు. చివరకు మంత్రి పేర్ని నాని.. పోలీసులపై చర్యలు తీసుకుంటామని, చెక్‌పోస్టును కలపర్రులో ఏర్పాటు చేయాలని ఆదేశించామని చెప్పడంతో ఆందోళన విరమించారు.


ప్రజలు సంయమనం పాటించాలి: పేర్ని

మచిలీపట్నం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ బారిన ప్రజలు పడకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని మంత్రి పేర్ని నాని పిలుపిచ్చారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గురువారం ఆయన ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, రెవెన్యూ అధికారులతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా కోనేరు సెంటరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఆపద రాకూడదనే పోలీసులు కొంత కఠిన ంగా ఉంటున్నారని చెప్పారు.

Updated Date - 2020-03-27T07:38:06+05:30 IST