పోలీసులమంటూ.. ఓ రౌడీషీటర్‌ అనుచరులతో కలసి..

ABN , First Publish Date - 2020-08-15T18:14:16+05:30 IST

పోలీసులమంటూ ఓ రౌడీషీటర్‌ అనుచరులతో కలసి హల్‌చల్..

పోలీసులమంటూ.. ఓ రౌడీషీటర్‌ అనుచరులతో కలసి..

పోలీసుల పేరిట దోపిడీయత్నం 

కనమనపల్లెలో రౌడీషీటర్‌ హల్‌చల్‌

చెట్టుకు కట్టేసి చితకబాదిన గ్రామస్తులు


కుప్పం/గుడుపల్లె(చిత్తూరు): పోలీసులమంటూ ఓ రౌడీషీటర్‌ అనుచరులతో కలసి హల్‌చల్‌ చేశాడు. ఆపై దోపిడీకి ప్రయత్నించి దొరికి పోవడంతో గ్రామస్తులు దేహశుద్ధి చేసిన సంఘటన శుక్రవారం గుడుపల్లె మండలం కనమనపల్లెలో జరిగింది. వివరాలివీ... కుప్పం రూరల్‌ సీఐ యతీంద్ర కథనం మేరకు.. గుడుపల్లె మండలం కనమనపల్లెకు చెందిన వెంకటేష్‌, సురేష్‌కు గంజాయి తాగే అలవాటుంది. ఈ విషయం కుప్పం మున్సిపాలిటీ షికారీకాలనీకి చెందిన రౌడీషీటర్‌ రత్న(36) గుర్తించాడు. గురువారం సాయంత్రం వీరిద్దరూ కమనపల్లె సమీపంలోని నాయనిచెరువు వద్ద ఉండగా, కుప్పానికి చెందిన ప్రతాప్‌(22), గణేష్‌(29), హరిహరన్‌తో కలసి రత్న అక్కడికి వచ్చాడు.


తాము కుప్పం పోలీసులమనీ గంజాయి తాగడం, విక్రయించడం నేరమంటూ వెంకటేష్‌, సురేష్‌ను చితకబాదారు. వెంకటేష్‌ జేబులోని రూ.5వేలను లాక్కుని, కనమనపల్లెలోని ఆయన ఇంటికి వెళ్లారు. గంజాయి ఎక్కడ దాచావంటూ వెంకటేష్‌ కుటుంబసభ్యులను రత్న బెదిరించి బీరువా తాళాలు తీయించారు. అందులోని రెండు జతల బంగారు కమ్మలు, జత వెండిపట్టీలు, రూ.10వేల నగదు తీసుకున్న అనుచరుల చేతికిచ్చి కుప్పం వెళ్లమని చెప్పాడు. ఆ తర్వాత వెంకటేష్‌ను రత్న చావబదుతూ ఉండడంతో కుటుంబసభ్యులు కేకలు వేశారు. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు రత్నను రౌడీషీటర్‌గా గుర్తించి చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రత్నకు సహకరించిన ముగ్గురు అనుచరులను అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్లు కుప్పం రూరల్‌ సీఐ యతీంద్ర చెప్పారు. 


Updated Date - 2020-08-15T18:14:16+05:30 IST