నిఘా కొరవడి.. గస్తీ తడబడి

ABN , First Publish Date - 2022-05-29T06:05:17+05:30 IST

జిల్లాలో ప్రతి రోజూ ఏదోచోట కర్ణాటక మద్యం రవాణా, నిషేధిత గుట్కా విక్రయాలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం సరిహద్దులోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 95 మందిని ఎస్పీఓల పేరుతో చెక్‌పోస్టుల్లో నియమించింది.

నిఘా కొరవడి.. గస్తీ తడబడి

అడ్డూ అదుపులేకుండా అక్రమ రవాణా

యథేచ్ఛగా ఇసుక తరలింపు

కర్ణాటక మద్యం దిగుమతి


ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులో పోలీసుల నిఘా పూర్తిగా కొరవడింది. ఈనేపథ్యంలో అక్రమంగా మద్యం, ఇసుక రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కర్ణాటక సరిహద్దులో సెబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులున్నా పర్యవేక్షణ చేసే సిబ్బంది లేకపోవడంతో ఇసుక పొరుగు రాషా్ట్రనికి యథేచ్ఛగా తరలిపోతోంది. ఇటీవల జిల్లాలో విచ్చలవిడిగా కర్ణాటక మద్యం, నిషేధిత గుట్కా దిగుమతి జోరుగా సాగుతోంది. మరోవైపు జిల్లా నుంచి రేషన బియ్యం, జీరో బిల్లులతో గ్రానైట్‌ను సరిహద్దు కర్ణాటక వైపు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.



పుట్టపర్తి, ఆంధ్రజ్యోతి

జిల్లాలో ప్రతి రోజూ ఏదోచోట కర్ణాటక మద్యం రవాణా, నిషేధిత గుట్కా విక్రయాలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం సరిహద్దులోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 95 మందిని ఎస్పీఓల పేరుతో చెక్‌పోస్టుల్లో నియమించింది. తర్వాత వారికి జీతాలివ్వలేక ఇటీవలే తొలగించారు. ప్రధాన రహదారుల్లో మినహా గ్రామీణ ప్రాంతాల్లో చెక్‌పోస్టులను దాదాపుగా ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో సరిహద్దులోని పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని పోలీసులు స్టేషన్లు వదలి రహదారుల్లో నిఘా, పహారా కాసే స్థితికి వచ్చింది. అయినా అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేయలేకపోతున్నారన్న విమర్శలకు దారితీస్తోంది.


సరిహద్దుల్లో యథేచ్ఛగా అక్రమ రవాణా

సరిహద్దు కర్ణాటకలోని బాగేపల్లి, గుడిబండ, గౌరిబిదనూరు, తుమకూరు, పావడగ, మధుగిరి, శిర, వశికేర, నక్కనహల్లి, బాణీగెర, చాకివేలు, బిళ్లూరు ప్రాంతాలతోపాటు అవకాశం ఉన్న ప్రాంతాల్లో కర్ణాటక రాష్ట్రం భారీగా మద్యం దుకాణాలను ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. ఇక్కడ నుంచి జిల్లాలోకి అక్రమ రవాణా విక్రయాలతో ప్రతి రోజు లక్షల్లో పోగుచేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సరిహద్దులో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కర్ణాటక మద్యం దుకాణాలే వెలసినట్లుగా వ్యాపారం సాగుతోంది. ప్రధానంగా హిందూపురం, మడకశిర, అగళి, గుడిబండ, అమరాపురం, పరిగి, లేపాక్షి, చిలమత్తూరు, గోరంట్ల, రొద్దం, అమడగూరు. ఓడీచెరువు, తనకల్లు, రామగిరి, కనగానపల్లి ప్రాంతల్లో సరిహద్దులు దాటి కర్ణాటక మద్యం ఏరులైపారుతోంది. ఈ మద్యం రవాణాకు జాతీయ రహదారితోపాటు జిల్లాలోకి వచ్చే అడ్డదారుల్లో కర్ణాటక నుంచి ప్రతి రోజు భారీగా తరలివస్తోంది. రెండు నెలల క్రితం వరకు సరిహద్దు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ప్రతి రోజు అక్రమ రవాణాలో ద్విచక్ర వాహనాలతోపాటు కార్లు, గూడ్స్‌ వాహనాలతోపాటు రూటు మార్చి ఏకంగా సెప్టిక్‌ ట్యాంకుల్లో కర్ణాటక మద్యాన్ని తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన సంఘటనలు జరిగాయి. అదేవిధంగా గుట్కా గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలతోపాటు కర్ణాటక నుంచే ఉమ్మడి జిల్లాలోకి అక్రమ రవాణా సాగుతోంది. గుట్కా వ్యాపారులు కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు, బాగేపల్లి, చింతామణి, చిక్‌బళ్లాపురం, తుమకూరు, బళ్లారి, పావగడ, మధుగిరి ప్రాంతాల నుంచి ద్విచక్ర వాహనాలతో మొదలుకుని గూడ్స్‌ వాహనాలు, కార్ల రవాణాతో దిగుమతి చేసుకుంటున్నారు. గతంలో హిందూపురం, మడకశిర, చిలమత్తూరు ప్రాంతాల మీదుగా గుట్కా తరలిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి నిషేధిత గుట్కాను భారీగా పట్టుకున్నారు. గుట్కా మూలాల కోసం కర్ణాటకలో  కూడా ఆంధ్ర పోలీసులు ఎంతగానో గాలించారు. ఇటీవల కర్ణాటక అక్రమ మద్యం, నిషేధిత గుట్కా అక్రమ రవాణాదారులపై నిఘా పెట్టలేదన్న విమర్శలకు దారితీస్తోంది. జిల్లాలోని అక్రమ మార్గాల్లో మద్యం, గుట్కా రవాణా సాగుతున్నా సరిహద్దులో తనిఖీలు లేకపోవడం అక్రమార్కులకు బాగా కలిసివస్తోంది. 


సరిహద్దు దాటేస్తోంది

శ్రీ సత్యసాయి జిల్లా నుంచి కొన్నేళ్లుగా రేషన బియ్యం, గ్రానైట్‌, ఇసుక అక్రమ మార్గాల్లో తరలిపోతున్నాయి. జిల్లా మీదుగా కర్ణాటకకు తరలిస్తూ పలు సార్లు కోట్ల విలువైన ఎర్రచందనాన్ని చిలమత్తూరు, హిందూపురం, పెనుకొండ పోలీసులకు పట్టుబడిన సంఘటనలూ లేకపోలేదు. అదేవిధంగా ఉమ్మడి జిల్లా తాడిపత్రి, అనంతపురం, ధర్మవరం, కర్నూలు ప్రాంతాల నుంచి పేదలకు అందించే రేషన బియ్యం పట్టుబడ్డాయి. ఇక గ్రానైట్‌, ఇసుక సరిహద్దులోని ప్రాంతాలతోపాటు ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల నుంచి లారీల్లో కర్ణాటకకు అక్రమ రవాణా కొన్నేళ్లుగా సాగుతోంది. ఇటీవల జిల్లాలోకి వచ్చే ప్రధాన రహదారులతోపాటు గ్రామీణ దారుల్లో నిఘా లేకపోవడంతో అక్రమ రవాణాకు పోలీసులు అడ్డుకట్టు వేయలేకపోతున్నారు. ఈఏడాది మార్చిదాకా ప్రతి రోజు కర్ణాటక మద్యం, గుట్కా, రేషన బియ్యం, ఎర్రచందనం రవాణాపై నిఘా పెట్టి పట్టుకున్న పోలీసుల నిఘా ఇటీవలికాలంలో పూర్తిగా కొరవడింది. ఈ నేపథ్యంలో కర్ణాటక మద్యం రవాణా, గుట్కా విక్రయాలతోపాటు జిల్లా నుంచి రేషన, ఇసుక, గ్రానైట్‌ రవాణాపై పోలీసులు నిఘా పెట్టి ఉక్కుపాదం మోపకపోతే మద్యం, గుట్కా మాఫియాలు రెచ్చిపోయే అవకాశాలున్నాయి.


నిఘా పెట్టాం

ఉమ్మడి జిల్లాలోకి కర్ణాటక నుంచి వచ్చే రహదారుల్లో నిఘా పెట్టాం. కర్ణాటక, ఏపీలో మద్యం ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో కర్ణాటక నుంచి మద్యం అక్రమ రవాణా తగ్గింది. సరిహద్దు చెక్‌పోస్టుల్లో మళ్లీ ఎస్పీఓలను నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అక్రమ రవాణా కాకుండా నిఘా పెట్టి కట్టడి చేస్తాం. 

రామ్మోహనరావు,  సెబ్‌ ఏఎస్పీ

Updated Date - 2022-05-29T06:05:17+05:30 IST