గోల్డ్‌లోన్‌ గోల్‌మాల్‌పై పోలీసు విచారణ

ABN , First Publish Date - 2020-10-01T08:38:27+05:30 IST

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ సమనస బ్రాంచిలో జరిగిన గోల్డ్‌లోన్‌ గోల్‌మాల్‌ వ్యవహారంపై అమలాపురం రీజనల్‌ మేనేజర్‌ కోలా జగదీశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు విచారణ

గోల్డ్‌లోన్‌ గోల్‌మాల్‌పై పోలీసు విచారణ

అమలాపురం రూరల్‌, సెప్టెంబరు 30: భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ సమనస బ్రాంచిలో జరిగిన గోల్డ్‌లోన్‌ గోల్‌మాల్‌ వ్యవహారంపై అమలాపురం రీజనల్‌ మేనేజర్‌ కోలా జగదీశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు విచారణ చేపట్టారు. అమలాపురం డీఎస్పీ షేక్‌ మసూమ్‌బాషా ఆధ్వర్యంలో తాలూకా సీఐ జి.సురేష్‌బాబు, తాలూకా ఎస్‌ఐ సీహెచ్‌.రాజేష్‌ల బృందం సమనస బ్రాంచిలో రాత్రి వరకు విచారణ కొనసాగించారు.


బ్రాంచి క్యాష్‌ ఇన్‌చార్జి, గోల్డ్‌లోన్‌ పర్యవేక్షునిడిగా పనిచేస్తున్న బీవీవీ.సత్యసుబ్రహ్మణ్యశర్మ 25 నకిలీ బ్యాంకు ఖాతాలను సృష్టించడంతో పాటు బంగారు ఆభరణాలు లేకుండానే రూ.1.05 కోట్ల మేర రుణాలు తీసుకున్న వ్యవహారంపై డీఎస్పీ మసూమ్‌బాషా బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నించారు. అదేవిధంగా బ్యాంకు ఖాతాలను పరిశీలించి బంగారు ఆభరణాలు లేకుండానే కుటుంబ సభ్యులు, బంధువులు, బ్యాంకులో పనిచేసే సిబ్బంది పేరిట రుణాలు తీసుకుని శర్మ స్వాహా చేసిన వ్యవహారంపై  విచారించారు.


ఈవ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఎంతవరకు ఉంటుందో విచారించారు. ప్రధానంగా క్యాష్‌ ఇన్‌చార్జితో పాటు మరో కస్టోడియన్‌గా ఉండే అక్కౌంటెంట్‌ పాత్ర ఎంతమేర ఉందో విచారించారు. రీజనల్‌ బ్యాంకు మేనేజర్‌ జగదీశ్వరరావు అమలాపురం తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్యాంకులో ఎవరెవరి పేరున ఖాతాలు తెరిచి ఎంతమేర ఎప్పుడెప్పుడు నిధులు ఎలా డ్రా చేసారనే అంశంపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆయా ఖాతాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.


25నకిలీ బ్యాంకు ఖాతాలు సృష్టించగా శర్మ తన కుటుంబ సభ్యుల పేరిటే 17ఖాతాలను తెరిచి రూ.73.16లక్షలు డ్రా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైతం బ్యాంకు ఉన్నతాధికారులు పోలీసులకు అందజేశారు. మరికొన్ని రోజుల పాటు ఈవ్యవహారంపై విచారణ జరుగుతుందని తాలూకా సీఐ సురేష్‌బాబు తెలిపారు. 


Updated Date - 2020-10-01T08:38:27+05:30 IST