కలికిరి బరోడా బ్యాంకు కుంభకోణం: అసలు నిజాలు తెలిసి నివ్వెరపోతున్న అధికారులు, పోలీసులు!

ABN , First Publish Date - 2021-09-05T06:26:18+05:30 IST

కలికిరి బరోడా బ్యాంకులో..

కలికిరి బరోడా బ్యాంకు కుంభకోణం: అసలు నిజాలు తెలిసి నివ్వెరపోతున్న అధికారులు, పోలీసులు!
వెలుగు ఉద్యోగుల సమక్షంలో ఆలీఖాన్‌(టీ షర్టుతో వున్న వ్యక్తి)ను విచారిస్తున్న పోలీసులు

ఆలీఖాన్‌ నోటి నుంచి అసలు నిజాలు

ఆరు గంటలపాటు మెసెంజరును విచారించిన పోలీసులు


కలికిరి(చిత్తూరు): కలికిరిలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో చోటు చేసుకున్న కుంభకోణానికి సంబంధించి మెసెంజరు ఆలీఖాన్‌ నోటి వెంట జాలువారుతున్న వివరాల పరంపర విచారణాధికారులను నివ్వెరపరుస్తోంది. రూ.కోట్ల లావాదేవీలకు సంబంధించిన విషయాలను ఏ ఖాతా నుంచి ఎంత, ఎప్పుడు, ఎలా తీసింది.. దాన్ని ఎలా దారి మళ్ళించింది.. మరో ఖాతా నుంచి ఎలా పక్కదారి పట్టించి ట్రాన్స్‌ఫర్‌ చేసింది.. అందులో ఎవరెవరి వాటాలు ఎంతున్నాయనే విషయాలను ఆలీఖాన్‌ చకచకా విడమరిచి చెబుతుంటే రికార్డులతో సరిచూసుకుంటున్న అధికారులు, పోలీసులు అతడి చాకచక్యానికి, జ్ఞాపకశక్తికి నివ్వెరబోతున్నారు.


సీఐ నాగార్జునరెడ్డి, ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి శనివారం దాదాపు ఆరు గంటలపాటు వెలుగు అధికారులు, బ్యాంకు సిబ్బంది సమక్షంలో మొత్తం కుంభకోణానికి సూత్రధారి, పాత్రధారి అయిన మెసెంజరు ఆలీఖాన్‌ను విచారించారు. కేవలం 8 మహిళా సంఘాల పేర్లతో రూ.75 లక్షల రుణాలను మంజూరు చేసి వేర్వేరు ఖాతాల్లోకి మళ్ళించిన విషయాలకు మాత్రమే ప్రాథమికంగా విచారణను పరిమితం చేశారు. మేడికుర్తి సంఘమిత్ర ప్రసన్నలక్ష్మి గణపతి మహిళా సంఘం ఖాతా నుంచి రూ.11,38000 దారి మళ్ళినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తిరుపతి రీజనల్‌ మేనేజరు శేషగిరి ఇదే విషయమై మరో ఫిర్యాదు ఇచ్చారు. ఈ లోగా మండల మహిళా సమాఖ్య బీవోబీకి సంబంధించిన 224 గ్రూపులకు చెందిన ఖాతాలను పరిశీలించడం ప్రారంభించింది. శుక్రవారం నాటికి 116 గూపుల్లో లెక్కలు పరిశీలించడం పూర్తిచేశారు. ఇందులో 51 గ్రూపుల్లో రూ.1.70 కోట్లు దారి మళ్ళినట్లు గుర్తించారు. మరో 108 గ్రూపుల లెక్కలు చూడాల్సి వుంది. 


విచారణ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి!

అడ్డదిడ్డంగా ఐదేళ్ళుగా సాగిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కుంభకోణాన్ని బద్దలు కొట్టడం పోలీసులకు సవాలుగా పరిణమించింది. అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్న తర్జనభర్జనలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మొదటిసారిగా శనివారం వెలుగు అధికారుల సమక్షంలో రెండున్నర గంటల పాటు ఆలీఖాన్‌ను విచారించినట్లు సమాచారం. అనంతరం మరో నాలుగు గంటల పాటు బ్యాంకులోనే రాత్రి వరకూ విచారణ జరిపారు. కేసు దర్యాప్తులో గందరగోళం తలెత్తకుండా డ్వాక్రా గ్రూపుల్లోని అక్రమాలపై దృష్టి పెట్టాలని ఆ దిశగా విచారణ ప్రారంభించారు. 2019లో మేడికుర్తి గ్రామంలో గౌసియా సంఘం పేరుతో డమ్మీ గ్రూపును సృష్టించి రూ.7 లక్షలు కాజేసినట్లు ఆలీఖాన్‌ వెల్లడించినట్లు సమాచారం. ప్రజల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలోనే చొరబడి డబ్బు గల్లంతు చేసి నివ్వెరపోయేటట్లు చేసిన ఆలీఖాన్‌ మరో ఘనకార్యం విచారణలో వెలుగు చూసిందని తెలిసింది. వెలుగు అధికారులు గతంలో జరిపిన తనిఖీల్లో శ్రీబాలాజీ గ్రూపు లెక్కలన్నీ సవ్యంగా వున్నట్లు నిర్ధారించారు.


అయితే పోలీసుల విచారణలో తేలిన అంశం ఆలీఖాన్‌ బరితెగింపును తేటతెల్లం చేస్తోంది. ఈ గ్రూపులో నుంచి ఫేక్‌ అకౌంట్‌ ద్వారా రూ.5.60 లక్షలు దారి మళ్ళినట్లు పోలీసులు తేల్చారని తేలింది. అలాంటిదేమీ లేదని వెలుగు అధికారులు తోసిపుచ్చినట్లు తెలిసింది. అయితే ఈ గ్రూపుకు సంబంధించి బ్యాంకు జారీ చేసిన స్టేట్‌మెంట్‌ నకిలీదిగా తేలినట్లు తెలిసింది. అంటే ఆలీఖాన్‌ స్టేట్‌మెంట్‌లను ఎడిట్‌ చేసి నకిలీ స్టేట్‌మెంట్లు తయారు చేశాడని వెల్లడయ్యింది. ఈ స్టేట్‌మెంట్‌ ఆధారంగా గ్రూపులో లెక్కలన్నీ బాగున్నాయని వెలుగు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం స్టేట్‌మెంట్లు కూడా నకిలీవిగా తేలడంతో వెలుగు అధికారులు అవాక్కయిపోతున్నారు. ఇలాంటి గ్రూపుల లెక్కలన్నీ తనిఖీలు చేసి చార్డెడ్‌ అకౌంటెంటు దగ్గర ఆడిట్‌ కూడా చేయించామని, నివేదికలను జిల్లా సహకార అధికారి, జిల్లా రిజిస్ట్రార్లకు సమర్పించేశామని, ఇప్పుడు వెల్లడయిన ఈ ఫేక్‌ స్టేట్‌మెంట్ల గోలేమిటని వెలుగు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 


బ్యాంకులో ఉద్యోగులందరికీ వాటాలిచ్చా

కొల్లగొట్టిన డబ్బును ఏమి చేశావని అడిగిన పోలీసుల ప్రశ్నలకు ఆలీఖాన్‌ నింపాదిగా సమాధానాలు చెప్పినట్లు సమాచారం. దాదాపు రూ.80 లక్షలు ఖర్చు పెట్టి తనతో పాటు ఘనంగా అక్కా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేశానని చెప్పాడని తెలిసింది. ఇందిరమ్మ కాలనీలో తనకూ, అక్కా చెల్లెళ్ళకూ ఇళ్ళు కట్టానని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇంకా ఇతర ప్రాంతాల్లో వున్న ఆస్తుల గురించి కూడా వెల్లడించినట్లు సమాచారం. తాను చేసిన అక్రమాలన్నింటిలో బ్యాంకు అధికారులకు భాగస్వామ్యముందని చెప్పినట్లు తెలిసింది. వాస్తవానికి తాను చేసిన అక్రమాలన్నింటినీ వారే ప్రోత్సహించారని, గతంలో తాను చేసిన ఒకటి రెండు తప్పులను చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేసి తన చేత ఈ పనులన్నీ చేయించినట్లు ఆలీఖాన్‌ వివరించాడు. రెండు నకిలీ సంఘాలను సృష్టించగా అందులో ఒకటి బ్యాంక్‌ అధికారులే చేశారని తెలిపినట్లు సమాచారు.


అగమ్యగోచరంగా వ్యక్తిగత ఖాతాదారుల పరిస్థితి

అధికమొత్తంలో పక్కదారి పట్టిన 8 సంఘాల గురించి విచారణ ప్రారంభించిన పోలీసు అధికారులు ఆ పరిధిలోనే విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రూ.కోట్లలో నష్టపోయిన వ్యక్తిగత ఖాతాదారులను ఎవరు పట్టించుకుంటారో తెలియడం లేదు. డిపాజిట్లలో డబ్బు గల్లంతయిన వారు, బంగారు, పంట రుణాల కోసం చేసిన చెల్లింపులు లెక్కల్లోకి రాని వారు, సేవింగ్స్‌ ఖాతాల ద్వారా పోగొట్టుకున్న వారి పరిస్థితి ఏమిటనేది తేలకుండా వుంది. ఇందులో కొంతమంది ఇప్పటికే బ్యాంకులో ఫిర్యాదులిచ్చారు. అయితే ఎంత మంది ఫిర్యాదు చేశారనే విషయాన్ని బ్యాంకు అధికారులు గోప్యంగా వుంచుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన రీజనల్‌ మేనేజరుగానీ, బ్యాంకులో జరిగిన పరిణామాల గురించి శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేసిన హైదరాబాదు జోనల్‌ అధికారిగానీ వ్యక్తిగత ఖాతాల్లో జరిగిన అక్రమాల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. దీంతో పోలీసు అధికారులు సైతం తమ విచారణను డ్వాక్రా గ్రూపుల వరకే పరిమితం చేశారని తెలిసింది.


ఆగిపోయిన డ్వాక్రా గ్రూపుల లెక్కల తనిఖీ

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఖాతాలున్న డ్వాక్రా గూపులకు చెందిన లెక్కలు తనిఖీ చేసే పని శనివారం పూర్తిగా ఆగిపోయింది. శనివారం మొత్తం స్టేట్‌మెంట్లు అందజేస్తామని హామీ ఇచ్చిన బ్యాంకు అధికారులు మాట నిలుపుకోకపోవడంతో తనిఖీల కోసం బయట నుంచి వచ్చిన పదిమంది వెలుగు అధికారులు, సంఘాలకు చెందిన వందలమంది మహిళా సభ్యులు ఉస్సూరుమన్నారు. ఈ లోగా వెలుగు అధికారులను విచారణ కోసం పోలీసులు పిలిపించడంతో తనిఖీ కార్యక్రమం అటకెక్కింది. ఇంకా 108 సంఘాల లెక్కలు పరిశీలించాల్సి వుంది. ఈ లోగా సాయంకాలం 30 గ్రూపులకు సంబంధించిన స్టేట్‌మెంట్లను బ్యాంకు అధికారులు అందజేసినా ఫలితం లేకపోయింది. ఇక సోమవారం తిరిగి పరిశీలన చేయనున్నారు. 

Updated Date - 2021-09-05T06:26:18+05:30 IST