ఏది నిజం..? ఎవరిది అబద్ధం..?

ABN , First Publish Date - 2021-12-11T15:26:32+05:30 IST

సంపన్న కుటుంబాలను కిట్టీపార్టీలతో ఆకట్టుకుని, రూ. కోట్లు కొల్లగొట్టిన శిల్పాచౌదరి ఉదంతం రోజుకోమలుపు తిరుగుతోంది. తమకేపాపం తెలియదంటూ వాంగ్మూలమిచ్చినట్లు

ఏది నిజం..? ఎవరిది అబద్ధం..?

శిల్పాచౌదరిని విచారించిన పోలీసులు

మొదటి రోజు ముగిసిన కస్టడీ

ప్రియదర్శిణి, రోహిణి వడ్డీకోసం వేధించారు : శిల్ప

పోలీసులతో వాగ్వాదం..?


హైదరాబాద్‌ సిటీ/నార్సింగ్‌: సంపన్న కుటుంబాలను కిట్టీపార్టీలతో ఆకట్టుకుని, రూ. కోట్లు కొల్లగొట్టిన శిల్పాచౌదరి ఉదంతం రోజుకోమలుపు తిరుగుతోంది. తమకేపాపం తెలియదంటూ వాంగ్మూలమిచ్చినట్లు తెలిసింది. ఇంతకు ముందు రెండ్రోజుల పోలీసు కస్టడీలో శిల్పాచౌదరి నుంచి రాబట్టాల్సిన వివరాలన్నీ రాలేదని పేర్కొంటూ దర్యాప్తు అధికారులు మరో మూడు రోజుల కస్టడీకి పిటిషన్‌ వేశారు. కోర్టు అనుమతితో శుక్రవారం నుంచి మూడ్రోజుల పాటు శిల్పను తమ కస్టడీలోకి తీసుకుని, విచారించనున్నారు. ముఖ్యంగా శిల్ప కొల్లగొట్టిన రూ. కోట్లను రికవరీ చేయడంపై పోలీసులు దృష్టిపెట్టారు. ఈ క్రమంలో శిల్ప చెప్పిన ముగ్గురు వ్యక్తుల వద్ద నిజంగా కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారా? అనే కోణంపై దృష్టిసారించారు. శిల్పను, ఆ ముగ్గురినీ ముఖాముఖి కూర్చోబెట్టి ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. దాంతో.. ఏది నిజం..? ఎవరిది అబద్ధం..? అనేది తేటతెల్లమవుతుందని నార్సింగ్‌ పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు శిల్పాచౌదరి తనను సినీనటుడు సుధీర్‌బాబు భార్య ప్రియదర్శిని, మరోమహిళ రోహిణి రెడ్డి అధిక వడ్డీల కోసం వేధించారంటూ పోలీసుల విచారణలో వాపోయినట్లు తెలిసింది. వీరికి 2016 నుంచి కేవలం వడ్డీల రూపంలో నెలకు రూ. 5 లక్షలు చెల్లించేదానినని శిల్ప పేర్కొన్నట్లు సమాచారం. 


‘‘నేను అధిక వడ్డీల పేరుతో డబ్బులు వసూలు చేసేదాన్ని. అంతకు మించిన వడ్డీకి రాధికారెడ్డికి అప్పు ఇచ్చేదాన్ని. రాధిక నన్ను మోసం చేసింది’’ అని చెప్పినట్లు సమాచారం. అయితే.. రాధికారెడ్డి మాత్రం.. తానే శిల్పకు డబ్బులిచ్చి మోసపోయానని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. పోలీసులు వీరందరినీ ముఖాముఖి కూర్చోబెట్టి ప్రశ్నించనున్నారు. ఇంతకు ముందు కస్టడీలో శిల్ప ‘జెంటిల్‌మన్‌’ సినిమా స్టోరీని పోలీసులకు వినిపించిన విషయం తెలిసిందే. ఓ ఆస్పత్రి నిర్మాణానికి ఆమె రూ. కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. ఆ ఆస్పత్రి ఎవరిది? ఎక్కడ నిర్మిస్తున్నారు? పెట్టుబడి మొత్తం ఎంత? అందులో శిల్ప వాటా ఎంత? ఆస్పత్రిలో పెట్టుబడికి కారణమేంటి? అనే కోణాలపై దర్యాప్తు అధికారులు దృష్టిసారించారు. ఇక శిల్ప కిట్టీపార్టీలపైనా పోలీసులు వివరాలు సేకరించాల్సి ఉంది. ఒక్కో కిట్టీపార్టీకి శిల్ప రూ. 50 లక్షల నుంచి రూ. 5 కోట్ల వరకు ఖర్చు చేసేదని పోలీసులు గుర్తించారు. ఈ కోణంపైనా ఆమెను విచారించనున్నారు. కాగా.. శుక్రవారం నాటి విచారణ సందర్భంగా పోలీసులతో శిల్పాచౌదరి వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. తనపై లేనిపోనివి సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Updated Date - 2021-12-11T15:26:32+05:30 IST