పాపం.. కృపారాణి

ABN , First Publish Date - 2022-06-28T05:37:42+05:30 IST

కేంద్ర మాజీమంత్రి, వైసీపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణికి పరాభవం ఎదురైంది. సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో హెలిప్యాడ్‌ వద్దకు వెళుతున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ‘మీకు అనుమతి లేద’ని చెప్పడంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

పాపం.. కృపారాణి
కృపారాణికి సర్దిచెబుతున్న కృష్ణదాస్‌

సీఎంకు స్వాగతం పలికేందుకు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
కన్నీటిపర్యంతమవుతూ వెనుదిరిగిన కేంద్ర మాజీ మంత్రి
కలెక్టరేట్‌, జూన్‌ 27:
కేంద్ర మాజీమంత్రి, వైసీపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణికి పరాభవం ఎదురైంది. సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో హెలిప్యాడ్‌ వద్దకు వెళుతున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ‘మీకు అనుమతి లేద’ని చెప్పడంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాను కేంద్ర మాజీమంత్రినని, వైసీపీ సీనియర్‌ నాయకురాలినని చెప్పినా పోలీసులు అనుమతించలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. అక్కడ నుంచి వెనుదిరిగారు. అక్కడే ఉన్న ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. వాహనం ఎక్కి వెళ్లిపోతుండగా నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు బుజ్జగించే ప్రయత్నం చేశారు. తనకు దారుణ అవమానం జరిగిందని.. కేంద్ర మంత్రిగా, వైసీపీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన తనను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. తానెవరో జిల్లా అధికారులకు తెలియదా? అంటూ ఆమె కన్నీటిపర్యంతమవుతూ వెళ్లిపోయారు. సీఎం బహిరంగ సభకు సైతం ఆమె గైర్హాజరయ్యారు. అనుమతి లేకపోవడం వల్లే అడ్డుకున్నామని అధికారులు చెబుతుండగా... పార్టీలో కొందరు కీలక నాయకుల ప్రమేయం ఉందని కృపారాణి వర్గీయులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో కీలక నాయకురాలిగా ఉన్న ఆమె గత ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అప్పట్లోనే ఆమె చేరికను పార్టీలో కొంతమంది నాయకులు అడ్డుకున్నారన్న ప్రచారం సాగింది. తరువాత ఆమెను శ్రీకాకుళం పార్లమెంటరీ వైసీపీ అధ్యక్షురాలిగా నియమించారు. కానీ జిల్లా కేంద్రంలో ఎలాంటి సమీక్షలు, సమావేశాలు నిర్వహించినా ఆహ్వానించే వారు కాదు. దీనిపై ఆమె అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఓ ముఖ్య ప్రజాప్రతినిధితో కిల్లి కృపారాణికి విభేదాలున్నాయి. ఇవి ఎన్నికల ముందు వెలుగు చూసినా పార్టీ పెద్దల ప్రమేయంతో తాత్కాలికంగా సద్దుమణిగాయి. మొన్నటి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో కృపారాణి పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ముఖ్య ప్రజాప్రతినిధి అడ్డు పడ్డారన్న చర్చ ఉంది. అప్పటి నుంచి కృపారాణి కాస్త మనస్తాపంతోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనలో ఏకంగా అడ్డుకోవడంతో ఆమె కలత చెందారు. దీనిపై నేరుగా సీఎం జగన్‌కు ఫిర్యాదుచేసి అమీతుమీ తేల్చుకోవాలని ఆమెతో పాటు ఆమె వర్గీయులు భావిస్తున్నారు. వరుస పరిణామాల నేపథ్యంలో ఆమె కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.
 
 

Updated Date - 2022-06-28T05:37:42+05:30 IST