రూ.6లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-06-17T05:26:33+05:30 IST

భద్రాచలంలో బుధవారం రూ.6లక్షల విలువ గల గంజాయిని భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు.

రూ.6లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత
వివరాలు వెల్లడిస్తున్న డాక్టర్‌ వినీత్‌

భద్రాచలం, జూన్‌ 16: భద్రాచలంలో బుధవారం రూ.6లక్షల విలువ గల గంజాయిని భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం ఏఎస్‌పీ డాక్టర్‌ వినీత్‌ తెలిపిన వివరాల ప్రకారం భద్రాచలం బస్టాండు సమీపంలో వాహ నాలు తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తుల చేతిలో బ్యాగు లతో అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని పట్టుకుని తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న బ్యాగుల్లో గంజాయిని గుర్తించినట్లు ఏఎస్‌పీ వెల్లడించారు. పట్టుబడిన గంజాయి 40 కేజీలు ఉండగా దాని విలువ మార్కెట్‌లో రూ.6 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీరు గంజాయిని తరలించేందుకు వినియోగిస్తున్న మోటారు సైకిల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఖమ్మానికి చెందిన మహమ్మద్‌ ఇంతియాజ్‌, ముత్తినేని కిషన్‌కుమార్‌, మహమ్మద్‌ ముజామిల్‌తో పాటు ఏపీలోని విశాఖపట్నానికి చెందిన కొర్రా దారాబాబు ఉన్నారు. వీరితో పాటు మరో నలుగురు ఒక ముఠాగా ఏర్పడి సుమారు రెండు సంవత్సరాలుగా గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలిందని ఏఎస్‌పీ తెలిపారు. కొర్రా దారబాబు వీరికి గంజాయి సరఫరా చేస్తున్నాడని, 2020నుంచి ఇప్పటి వరకు రూ.1,28,70,000 విలువ గల 859 కేజీల గంజాయిని వీరికి సరఫరా చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఇతడిపై గతంలో భద్రాచలం పోలీసుస్టేషన్‌లో గంజాయి అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయని, ముత్తినేని కిషన్‌కుమార్‌ వీరికి ఆర్ధిక సహాయం చేస్తూ వీరి నుంచి గంజాయి తీసుకొని మిగత వారి ద్వారా ఖమ్మం, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని తెలిపారు. ఇతడిపై నాలుగు కేసులు నమోదయ్యాయని, వీరందరిపై ఎన్‌డీపీఎస్‌ యాక్టు కింద కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్‌ చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు ఏఎస్పీ తెలిపారు.


Updated Date - 2021-06-17T05:26:33+05:30 IST