పోలీసులకు అలుపు లేదు.. ప్రజలకు కునుకు లేదు!

ABN , First Publish Date - 2020-04-04T10:46:05+05:30 IST

పోలీసులకు అలుపు లేదు.. ప్రజలకు కునుకు లేదు!

పోలీసులకు అలుపు లేదు.. ప్రజలకు కునుకు లేదు!

కరోనా కేసులు బయటపడిన పట్టణాలు, గ్రామాల్లో జల్లెడ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): పట్టణాలు, గ్రామాలకు కరోనా వైరస్‌ వ్యాపించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు, అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కరోనా సోకినట్లు గత రెండు మూడు రోజుల్లో నిర్ధారణ అయిన వారు ఎక్కువగా మునిసిపాలిటీలు, గ్రామాలకు చెందిన వారు కావడంతో స్థానికులు ఉలిక్కిపడుతున్నారు. ముఖ్యంగా తమ పక్క ఇంట్లోనే కరోనా సోకిన వారు ఉన్నారన్న విషయం తెలిసి కంటిమీద కునుకు లేకుండా పోయింది. బయటకు రావడానికి జంకుతున్నారు. నిత్యావసర వస్తువులకు కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల అధికారులే ఇంటింటికి వాటిని సరఫరా చేస్తున్నారు. ప్రజల పరిస్థితి ఇలా ఉంటే, పోలీసులు, అధికారులు అలుపెరుగక ఇంటింటిని జల్లెడ పడుతున్నారు. వైరస్‌ సోకిన వారు అప్పటికే ఎవరెవరిని కలిశారు? ఏయే ప్రాంతాల్లో పర్యటించారనే సమాచారం సేకరించి, ఆయా ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. మెదక్‌ పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా సోకడంతో వారి ఇంటికి కిలోమీటరు పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఆస్పత్రిని ఐసోలేషన్‌ కోసం కేటాయించారు. అక్కడ 19 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. ఇలా దాదాపు  ప్రతి జిల్లాలోనూ కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలు సేకరిస్తున్నారు. అనుమానితులను గుర్తించి క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. 

Updated Date - 2020-04-04T10:46:05+05:30 IST