స్టేషన్‌ బెయిల్‌ వసూల్‌

ABN , First Publish Date - 2021-04-15T06:34:48+05:30 IST

స్టేషన్‌ బెయిల్‌ను కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది ఆదాయమార్గంగా మార్చుకున్నారు.

స్టేషన్‌ బెయిల్‌ వసూల్‌

కేసును బట్టి రేటు  

రోడ్డు ప్రమాదాలైతే పెద్ద మొత్తంలో డిమాండ్‌  

చిన్నచిన్న వాటికీ రూ. 10వేలపైనే! 

ఇసుక ట్రాక్టర్‌ పట్టుబడితే రూ. 20వేలు ఇవ్వాల్సిందే! 

పోలీసు స్టేషన్లలో కొనసాగుతున్న అవినీతి పర్వం 


ఇటీవల ఇంకొల్లు సర్కిల్‌ పరిధిలోని రెండు పోలీసుస్టేషన్లలో ఇద్దరు రేషన్‌ డీలర్లపైన విజిలెన్స్‌ దాడులకు సంబంధించి నాన్‌బెయిల్‌బుల్‌ కేసులు నమోదు చేశారు. దీనికిగాను అధికారపార్టీ నేతల సిఫార్సుల మేరకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి రూ.20వేల చొప్పున వసూలు చేశారనే ఆరోపణలున్నాయి.

అద్దంకి సర్కిల్‌ పరిధిలోని ఓ పోలీసు స్టేషన్‌లో రేషన్‌ డీలర్‌పై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదైంది. స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు భారీగానే వసూలు చేసినట్లు తెలిసింది. ఇలా వరుసగా బెయిల్‌కు వసూళ్లు సాగుతూనే ఉన్నాయి.

గ్రానైట్‌కు ఖిల్లా అయినా చీమకుర్తి పోలీసు స్టేషన్‌లో స్టేషన్‌ బెయిల్‌ అంటే పండగే. గ్రానైట్‌ వ్యవహారాలకు సంబంధించి అనేక వివాదాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో గతనెలలో 10 వరకూ స్టేషన్‌ బెయిల్స్‌ ఇచ్చారు. అందుకుసంబంధించి భారీగా వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. 

బల్లికురవ, మార్టూరు పోలీస్‌స్టేషన్‌ల పరిధిలోనూ భారీగా స్టేషన్‌ బెయిల్‌ పంచాయితీ నడుస్తోంది. ఇక్కడ గ్రానైట్‌ క్వారీలు, పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అనేక ప్రమాదాలు, వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయా కేసులకు సంబంధించి గతనెలలో 10వరకూ స్టేషన్‌ బెయిళ్లు ఇచ్చి ఆ మేరకు వసూలు చేశారనే ప్రచారం ఉంది. 

ఇదీ జిల్లాలోని పోలీసు స్టేషన్లలో పరిస్థితి. ఇక్కడ ప్రతి వివాదమూ కాసులు కురిపిస్తోంది. ఇక స్టేషన్‌ బెయిల్‌ అంటే తక్కువలో తక్కువ రూ.10వేలు ఇవ్వాల్సిందే. లేకుంటే రకరకాల కొర్రీలు వేస్తుంటారు. ప్రధానంగా జాతీయ రహదారిపై స్టేషన్ల వారికి పండగే. అలాగే గ్రానైట్‌, మైనింగ్‌ జరిగే ప్రదేశాలు, భారీ ఎత్తున వ్యాపారాలు, లావాదేవీలు జరిగే ప్రాంతాల్లోని స్టేషన్ల అధికారులకు, సిబ్బందికి  41 సీఆర్‌పీసీ  బాగా కలిసొచ్చింది. బెయిల్‌కు డబ్బులు గుంజుతున్నారు. ఆ చట్టంలో ఉన్న నిబంధనలతో ఉన్నతాధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.

ఒంగోలు (క్రైం), ఏప్రిల్‌ 14 : స్టేషన్‌ బెయిల్‌ను కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది ఆదాయమార్గంగా మార్చుకున్నారు. వసూళ్ల పర్వానికి తెరతీశారు. కేసును బట్టి రేటు నిర్ణయించి అందిన కాడికి దండుకుంటున్నారు. అడిగినంత ముట్టచెప్పిన వారికి వెంటనే బెయిల్‌ ఇస్తున్నారు. మిగిలిన వారిని జైలుకు పంపుతామని బెదిరించి మరీ జేబులు నింపుకుంటున్నారు. కొవిడ్‌ కాలంలో కోర్టులు నడవకపోవడం వీరికి మరింత కలిసొచ్చింది. కొన్నిచోట్ల నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించి నిందితుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏడేళ్లలోపు శిక్షపడే కేసులకు స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వవచ్చు. ఈ అవకాశాన్ని కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది ఆసరా చేసుకొని అవినీతికి పాల్పడుతున్నారు. చిన్నచిన్న కేసుల్లో 41 సీఆర్‌పీసీ ప్రకారం నోటీసులు ఇచ్చి పంపించేందుకు రూ.10వేలపైనే వసూలు చేస్తున్నారు. ఈ విషయంలో కొందరు పోలీసు అధికారులు నిందితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించి అధికమొత్తం డిమాండ్‌ చేస్తున్నారు. విధిలేక నిందితులు ఆ మొత్తాన్ని చెల్లించి బయటకు వస్తున్నారు. ముఖ్యంగా రోడ్డుప్రమాదాలు, ఇసుక ఆక్రమంగా తరలిస్తూ వాహనాలు పట్టుబడితే పోలీసులు పండుగ చేసుకుంటున్నారు. ఏడేళ్లలోపు శిక్షలు పడే సెక్షన్ల కింద నమోదు చేస్తున్న కేసులు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లకు కల్పతరువులా మారాయి. ఇలాంటి కేసుల్లో స్టేషన్‌ బెయిల్‌ తప్పనిసరి. దీన్ని ఆసరా చేసుకొని చిన్నచిన్న వివాదాలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన వారిపై ఆ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి బెయిల్‌కు భారీమొత్తాలు వసూలు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. 


కలిసొచ్చిన కరోనా కాలం

కరోనా కాలం పోలీసులకు బాగా కలిసి వచ్చింది. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఎత్తివేసే వరకూ వచ్చిన కేసుల్లో ఎక్కువ స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చినవే ఉన్నాయి. ఈ సమయంలో కోర్టులు పనిచేయకపోవడంతో చిన్నచిన్న వివాదాలకు సంబంధించిన వాటితోపాటు, రోడ్డుప్రమాదాల కేసుల్లోనూ 41 సీఆర్‌పీసీ ప్రకారం నోటీసులిచ్చారు. నిందితుల నుంచి భారీగా వసూలు చేశారు.  


ఇసుక ట్రాక్టర్‌కు రూ.20వేలు

ఇసుక అక్రమ రవాణా చేస్తూ ట్రాక్టర్లు పట్టుబడితే పోలీసుల పంట పండినట్లే. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్న ఇసుక ట్రాక్టర్ల యజమా నులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసే అధికారం పోలీసులకు ఉండటం వారికి ఆయాచితవరంలా మారింది. ఇసుక అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ట్రాక్టర్‌ను సీజ్‌ చేస్తున్న పోలీసులు యజమానిపై కేసు పెట్టి బెయిల్‌ కోసం రూ.20వేలు డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. దీంతో చేసేది లేక వారు అడిగినంత ముట్టజెప్పి బయటకు వస్తున్నారు. ఒంగోలు, పరిసర ప్రాంతాల్లోని పోలీసుస్టేషన్లలో ఈ తరహా వ్యవహారం ఎక్కువగా జరుగుతోంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు దృష్టిసారించి ఈ వసూళ్ల వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-04-15T06:34:48+05:30 IST