Abn logo
Nov 27 2020 @ 10:59AM

పోలీస్‌ వ్యవస్థకు సమాంతరంగా ఎస్‌ఈబీ విస్తరణ

చిత్తూరులో అసిస్టెంట్‌ కమిషనరేట్‌

తిరుపతి అర్బన్‌, మిగిలిన జిల్లాకు ఇద్దరు జేడీలు

తిరుపతి, చిత్తూరు, మదనపల్లెల్లో ఎస్‌ఈబీ సూపరింటెండెంట్‌ కార్యాలయాలు


కలికిరి(చిత్తూరు): ఏడాదిన్నర క్రితం పురుడు పోసుకున్న స్సెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఇప్పుడు  పోలీసు వ్యవస్థకు సమాంతరంగా విస్తరించనుంది.  జోన్లు, కమిషనరేట్‌, జాయింట్‌ డైరెక్టరేట్లు, సూపరింటెండెంట్‌ కార్యాలయాలు, స్టేషన్లు, చెక్‌పోస్టులు, బోర్డర్‌ మొబైల్‌ పెట్రోలింగ్‌ టీమ్‌లు, టాస్క్‌ఫోర్స్‌, ఇంటిలిజెన్స్‌, టెక్నికల్‌ శాఖలు, కమిషనరేట్‌ కంట్రోల్‌ రూంలాంటి కార్యాలయాలతో వివిధ స్థాయుల్లో జిల్లావ్యాప్తంగా బలోపేతం కానుంది. పోలీసు వ్యవస్థలో వున్నట్టే వేకెన్సీ రిజర్వ్‌ పోస్టులను కూడా సృష్టించారు. వీటన్నింటినీ కొత్తగా మంజూరు చేస్తూ గురువారం ఆదేశాలు వెలువడ్డాయి. రాయలసీమ జిల్లాలకు కలిపి అనంతపురంలో ఎస్‌ఈబీ జోనల్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడే డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం ఏర్పాటు కానుంది. ఇక చిత్తూరులో ఏర్పాటయ్యే అసిస్టెంట్‌ కమిషనరేట్‌కు అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, సహాయ అకౌంట్స్‌ ఆఫీసర్‌తో పాటు వివిధ కేడర్లలో 14మంది సిబ్బంది పోస్టులను మంజూరు చేశారు. తిరుపతి అర్బన్‌, తతిమ్మా చిత్తూరు రూరల్‌ జాయింట్‌ డైరెక్టరు కార్యాలయాలకు కూడా సిబ్బందిని కేటాయించారు. ఇక తిరుపతి, మదనపల్లెల్లో ఏర్పాటయ్యే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌, చిత్తూరు అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయాలకు 15 సిబ్బంది పోస్టులను మంజూరు చేశారు. ఇవిగాకుండా స్టేట్‌ హెడ్‌ క్వార్టర్‌తో అనుసంధానంగా పనిచేయడానికి మూడు హెచ్‌సీ, ఆరు కా నిస్టేబుల్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. వేకెన్సీ రిజర్వ్‌ స్థానాలుగా రెండు హెచ్‌సీ, రెండు కానిస్టేబుల్‌ పోస్టులను కూడా మంజూరు చేశారు.  


18 ఎస్‌ఈబీ స్టేషన్ల ఏర్పాటు

జిల్లాలో ఏర్పాటు కానున్న ఎస్‌ఈబీ స్టేషన్లకు సంబంధించి..చిత్తూరు ఎస్‌ఈబీ డివిజన్‌లో చిత్తూరు అర్బన్‌ (4 మండలాలు), చిత్తూరు రూరల్‌ (5), కార్వేటినగరం (4), పాకాల (3), పుత్తూరు (4), సత్యవేడు (4), నగరి (3), మదనపల్లె ఎస్‌ఈబీ డివిజన్‌లో మదనపల్లె (4), మొలకలచెరువు (4), పుంగనూరు (6), పలమనేరు (4), కుప్పం (4), వాయల్పాడు (4), పీలేరు (5), తిరుపతి ఎస్‌ఈబీ డివిజన్‌లో తిరుపతి అర్బన్‌ (అర్బన్‌ మాత్రం), తిరుపతి రూరల్‌ (3), శ్రీకాళహస్తి (5), తిరుమల (తిరుమల మాత్రం). ప్రతి స్టేషన్‌కు చిత్తూరు డివిజన్‌లో ఒక ఇన్‌స్పెక్టరు, ఒక ఎస్‌ఐ, ఒక హెచ్‌సీ, ముగ్గురు హెడ్‌ కానిస్టేబుల్‌, 10 కానిస్టేబుల్‌ పోస్టులను కేటాయించారు. కార్వేటినగరానికి ఒక ఎస్‌ఐని అదనంగా ఇచ్చారు. పాకాలకు రెండు హెచ్‌సీ పోస్టులు మాత్రమే కేటాయించారు. ఇక తిరుపతి డివిజన్‌లోని స్టేషన్లకు సీఐ, ఎస్‌ఐలతోపాటు ఇద్దరేసి హెచ్‌సీలను ఇవ్వగా తొమ్మిది మంది వంతున కానిస్టేబుళ్ళను కేటాయించారు. శ్రీకాళహస్తికి ఒక కానిస్టేబుల్‌ను అదనంగా ఇచ్చారు. ఇక మదనపల్లె డివిజన్‌లోని ఏడు స్టేషన్లలో ఒక్కోదానికి సీఐ, ఎస్‌ఐలతోపాటు ముగ్గురు హెచ్‌సీలను, 10మంది కానిస్టేబుళ్ళ వంతున కేటాయించారు. మదనపల్లె స్టేషన్‌కు ఒక హెచ్‌సీని అదనంగా ఇవ్వగా వాయల్పాడుకు ఒక కానిస్టేబుల్‌ పోస్టును తగ్గించారు. కాగా మదనపల్లె, పలమనేరుల్లో రెండు బోర్డర్‌ మొబైల్‌ పెట్రోలింగ్‌ టీములను మంజూరు చేశారు. ఒక్కో దానికి ఒక ఎస్‌ఐ, హెచ్‌సీ, ముగ్గురేసి కానిస్టేబుల్‌ పోస్టులను ఇచ్చారు. క్యాటిల్‌ ఫారం, చీకిలిబైలు, నరహరిపేట, వి.కోట, రామసముద్రంలలో  ఏర్పాటయ్యే ఎస్‌ఈబీ చెక్‌పోస్టులకు ఒక్కోదానికి సీఐ, ఎస్‌ఐ, రెండు హెచ్‌సీ, ఆరు కానిస్టేబుల్‌ పోస్టులిచ్చారు. అయితే క్యాటిల్‌ ఫారం, చీకిలిబైలుకు రెండేసి ఎస్‌ఐ, ఒక్కో హెచ్‌సీ పోస్టులను అదనంగా కేటాయించారు. 


ఎస్‌ఈబీ అధికార పరిధిలోకి మరిన్ని వ్యవహారాలు

మద్యం, ఇసుక వ్యవహారాలకు మాత్రమే పరిమితమై పనిచేస్తున్న స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఇక నుంచి వివిధ రకాల చట్ట విరుద్ధమైన  వ్యవహారాలపై జూలు విదల్చనుంది. గ్యాంబ్లింగ్‌, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో గేమింగ్‌, మట్కా, గుట్కా, గంజాయి, మత్తుపదార్థాలు , రెడ్‌ శాండర్స్‌ తదితర నిషేధిత వ్యవహారాలపై నియంత్రిత అధికారాలను ఎస్‌ఈబీకి అప్పగించారు.  

Advertisement
Advertisement
Advertisement