Abn logo
Jul 25 2021 @ 08:38AM

నగల బ్యాగును పోగొట్టుకున్న ఎమ్మెల్యే భార్య... తరువాత?

న్యూఢిల్లీ: టీఎంసీ ఎమ్మెల్యే వివేక్ గుప్తా భార్య కనికా గుప్తా కారులో నగలు, నగదుతో నిండిన బ్యాగు మాయమైంది. ఈ ఉదంతంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఠక్-ఠక్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరి వయసు 12 ఏళ్ల ఉండటం విశేషం. వీరిద్దరి దగ్గరి నుంచి లక్షా 40 వేల రూపాయల నగదు, నగలు, బంగారు నాణేలు, ఇతర విలువైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఇదేవిధంగా వారు ఉపయోగించే మోటారు సైకిల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ సౌత్ డీసీపీ అతుల్ ఠాకుర్ మాట్లాడుతూ అంబేద్కర్ నగర్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఒక సీబీజీ బైక్ వెళుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో ఒకని పేరు రాహుల్(24) అని మరొకరు 12 ఏళ్ల బాలుడని తెలిపారు. వీరిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారన్నారు. కాగా కనికా గుప్తా తన కారులో ఎవరినో కలిసేందుకు వెళుతుండగా, దారిలో ఇద్దరు యువకులు ఎదురై.. కారు టైరు వైపు చూపిస్తూ, ఏదో చెప్పి వెళ్లిపోయారు. దీంతో కారు డ్రైవర్ కిందకు దిగాడు. ఇదే సమయంలో కనికా గుప్తా కూడా కారులో నుంచి కిందకుదిగారు. కొద్ది సేపటి తరువాత కారు ఎక్కిన ఆమెకు నగల బ్యాగు కనిపించలేదు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.