వీళ్లు మామూలు వాళ్లు కాదు.. అద్దెకు తీసుకున్న కారును రూ.2 లక్షలకు అమ్మేశారు.. ఈ భార్యాభర్తల మోసాల గురించి తెలుసుకుంటే..

ABN , First Publish Date - 2022-04-16T17:49:24+05:30 IST

మీరు బాలీవుడ్ సినిమా `బంటీ ఔర్ బబ్లీ` చూశారా? ఆ సినిమాలో హీరోహీరోయిన్లు జంటగా మోసాలు చేసి డబ్బులు సంపాదిస్తుంటారు.

వీళ్లు మామూలు వాళ్లు కాదు.. అద్దెకు తీసుకున్న కారును రూ.2 లక్షలకు అమ్మేశారు.. ఈ భార్యాభర్తల మోసాల గురించి తెలుసుకుంటే..

మీరు బాలీవుడ్ సినిమా `బంటీ ఔర్ బబ్లీ` చూశారా? ఆ సినిమాలో హీరోహీరోయిన్లు జంటగా మోసాలు చేసి డబ్బులు సంపాదిస్తుంటారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ జంట కూడా అదే తరహాలో చాలా మందికి టోకరా ఇచ్చింది. ఇద్దరూ కలిసి ఎంతోమందిని మోసం చేశారు. చివరకు ఓ స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు వల్ల పోలీసులకు దొరికిపోయారు. ఇండోర్‌కు చెందిన అనాస్ సిద్ధిఖీ, రష్మీ రాథోడ్ దంపతులు డబ్బు సంపాదన కోసం ఛీటింగ్ మార్గాన్ని ఎంచుకున్నారు. 


ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సాగర్ విశ్వకర్మ అనే వ్యక్తికి సంబంధించిన కారును రష్మీ నెలకు రూ.20 వేలకు అద్దె ప్రాతిపదికన తీసుకుంది. రెండు నెలల తర్వాత ఆ కారును వేరే వ్యక్తికి రూ.2 లక్షలకు అమ్మేసి పరారైంది. సాగర్ ఫిర్యాదు మేరకు రష్మీ రాథోడ్‌ని పోలీసులు పట్టుకున్నారు. దాంతో వారి బండారం బయటపడింది. భోపాల్‌లోని జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో రష్మిపై, సిద్ధిఖీపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. రష్మి తన భర్త సిద్ధిఖీతో కలిసి పుణె, నాగ్‌పూర్ వ్యాపారులను కూడా మోసం చేసినట్లు తెలిసింది. 


నాగ్‌పూర్‌లో ఇద్దరు వ్యాపారులను ఎనిమిది, ఆరు లక్షలకు ఈ జంట మోసం చేసింది. వేరొకరికి చెందిన జ్యూట్ మిల్లును వీరు ఆ ఇద్దరు వ్యాపారులకు అమ్మేసి అక్కణ్నుంచి పరారయ్యారు. అలాగే ఇద్దరూ ఓ పెద్ద కంపెనీకి సంబంధించిన ఏజెంట్లుగా పరిచయం చేసుకుని పుణెలోని చక్కెర, గోధుముల ట్రేడర్లను కూడా మోసం చేశారు. రష్మి ఇప్పటికే పోలీసులకు చిక్కగా, సిద్ధిఖీ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


Updated Date - 2022-04-16T17:49:24+05:30 IST