విద్యార్థులపై పోలీసుల దాష్టీకం

ABN , First Publish Date - 2022-05-14T09:07:55+05:30 IST

విద్యార్థులపై పోలీసుల దాష్టీకం

విద్యార్థులపై పోలీసుల దాష్టీకం

తండ్రులపైనా విరిగిన లాఠీ

హెచ్‌ఎం ఫిర్యాదుపై హిందూపురం ఖాకీల అతి

హిందూపురం టౌన్‌, మే 13: పోలీసు బెల్టు, లాఠీ మరో మెట్టెక్కాయి. బడి పిల్లలపైనా.. వారి తండ్రుల శరీరంపైనా కర్కశంగా నాట్యం చేశాయి. ఏదో నేరం చేసినందుకు కాదు.. సెలవుల్లో పాఠశాల ఆవరణలో సరదాగా క్రికెట్‌ ఆడినందుకు విద్యార్థులను, అలా స్వేచ్ఛగా వదిలేసినందుకు తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు.  శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండల పరిధిలోని రామచంద్రాపురంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత తల్లిదండ్రులు శుక్రవారం హిందూపురం ప్రెస్‌క్లబ్‌కు వచ్చి విలేకరులకు తమ గోడు వినిపించారు. సెలవులు కావడంతో రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఈనెల 10న విద్యార్థులు క్రికెట్‌ ఆడుతుండగా హెచ్‌ఎం గంగిరెడ్డి మందలించారు. పాఠశాలలోని వాటర్‌ ట్యాంక్‌, పైపులు, తలుపులు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ, ఆడుకుంటున్న విద్యార్థుల ఫొటోలు తీసి హిందూపురం అప్‌గ్రేడ్‌ పోలీసులకు పంపారు. పోలీసులు గ్రామానికి వచ్చి విద్యార్థులు మంజునాథ్‌, కల్యాణ్‌రాం, సందీప్‌, నవీన్‌, ప్రవీణ్‌, ఉప్పర ప్రవీణ్‌ను ఫొటో ఆధారంగా గుర్తించారు. అదేరోజు సాయంత్రం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను  పోలీ్‌సస్టేషన్‌కు రప్పించారు. రాత్రి 10 గంటల వరకు స్టేషన్‌లోనే ఉంచి మరుసటి రోజు రమ్మనమని పంపించేశారు.   బుధవారం ఉదయం విద్యార్థులు, తండ్రులు స్టేషన్‌కు వెళ్లారు. రాత్రి వరకు స్టేషన్‌లోనే ఉన్నారు. రాత్రి 7, 8 గంటల సమయంలో పోలీసులు విద్యార్థులను మందలించి, తండ్రుల ముందే బెల్ట్‌తో కొట్టా రు. పిల్లలను ఎందుకు కొడతారని  ఒకరిద్దరు ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తులైన కొందరు కానిస్టేబుళ్లు, సీఐ జీటీ నాయు డు.. ఫైబర్‌ లాఠీలకు పనిచెప్పారు. చిన్నారుల ఎదుటే వారి తండ్రులు రామాంజి, అంజినప్ప, నాగప్ప, సజ్జప్ప, సిద్దలింగప్పను చితకబాదారు. దీనిపై హెచ్‌ఎం గంగిరెడ్డిని వివరణ కోరగా, తాను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, మందలించాలని మాత్రమే చెప్పానన్నారు. హెచ్‌ఎం ఫిర్యాదు చేశారని, ఆయన సూచన మేరకు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పిలిపించి మందలించి పంపించామని, కొట్టలేదని అప్‌గ్రేడ్‌ సీఐ జీటీ నాయుడు వివరణ ఇచ్చారు. పాఠశాల హెచ్‌ఎం గంగిరెడ్డి ఓ ప్రజాప్రతినిధి బంధువు అయినందుకే పోలీసులు అతిగా స్పందించారన్న ఆరోపణలు వస్తున్నాయి.  

Read more