స్టాఫ్‌ నర్సు దంపతులపై త్రీటౌన్‌ పోలీసుల దాడి

ABN , First Publish Date - 2021-05-13T05:56:50+05:30 IST

నర్సుల దినోత్సవం నాడే పోలీసులు ఒక స్టాఫ్‌ నర్సుని, 108 ఈఎంటీ టెక్నీషియన్‌ను చితకబాదారు. నగరంలోని క్వారీ సెంటర్లో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి... రాజమహేంద్రవరం సింహాచల నగర్‌కు చెందిన హేమలత కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా, ఆమె భర్త రాజు కాకినాడ 108 అంబులెన్సులో ఈఎంటీ టెక్నీషియనగా పని చేస్తున్నారు.

స్టాఫ్‌ నర్సు దంపతులపై త్రీటౌన్‌ పోలీసుల దాడి

అన్యాయంగా కొట్టారని  విలపించిన బాధితురాలు

రాజమహేంద్రవరం సిటీ, మే 12: నర్సుల దినోత్సవం నాడే పోలీసులు ఒక స్టాఫ్‌ నర్సుని, 108 ఈఎంటీ టెక్నీషియన్‌ను చితకబాదారు. నగరంలోని క్వారీ సెంటర్లో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి... రాజమహేంద్రవరం సింహాచల నగర్‌కు చెందిన హేమలత కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా, ఆమె భర్త రాజు కాకినాడ 108 అంబులెన్సులో ఈఎంటీ టెక్నీషియనగా పని చేస్తున్నారు. అనారోగ్యంతో వారి బంధువులు రాజమహేంద్రవరం ఆసుపత్రిలో ఉండగా బుధవారం వచ్చి పరామర్శించారు. తిరిగి వారి స్వగృహం సింహాచల నగర్‌ మోటారు సైకిలుపై వెళ్తుండగా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో క్వారీ సెంటర్లో  త్రీటౌన్‌ పోలీసులు ఆపారు. తాము మెడికల్‌ స్టాఫ్‌ అని చెప్పి వెళ్తుండగా పోలీసులు నిలుపుదల చేసి    ఐడీ కార్డు చూపించమన్నారు. దానిని వెంట  తెచ్చుకోకపోవడంతో కావాలంటే తమ పై అధికారికి ఫోను చేస్తాం అని చెప్పారు. దీంతో వారికి, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. అక్కడకు చేరుకున్న త్రీటౌన్‌ సీఐ భార్య, భర్తలను పోలీస్‌ వాహనం ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. మెడికల్‌ స్టాఫ్‌ అని చెప్పినా పట్టించుకోలేదని సీఐ తమను దారుణంగా కొట్టారని హేమలత కన్నీళ్లు పెట్టుకుంది. స్టేషన్‌కు వెళ్లాక కూడా తన భర్తను చితక్కొట్టారంది. సీఐ, పోలీసులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేసింది. దీనిపై త్రీటౌన్‌ సీఐ దుర్గాప్రసాద్‌ను వివరణ కోరగా... రాజు, అతని భార్య పోలీసులతో ఘర్షణ పడితే స్టేషన్‌కు తరలించామని, కొంతసేపటి తర్వాత విడిచిపెట్టామని చెప్పారు.

Updated Date - 2021-05-13T05:56:50+05:30 IST