ఖాకీ రుబాబు

ABN , First Publish Date - 2022-05-17T06:44:56+05:30 IST

ఆయనో పోలీస్‌ అధికారి. ఇటీవలే బదిలీపై నగరానికి వచ్చారు. అప్పుడే రుబాబు ప్రారంభించేశారు.

ఖాకీ రుబాబు

హోటల్‌లో అప్పన్నంగా తిష్ఠ వేసిన ఓ పోలీస్‌ అధికారి

...పైగా తన గదిలో రూ.16 వేలు పోయాయంటూ ఎదురుదాడి

ఆ డబ్బు ఇచ్చేస్తే రూమ్‌ ఖాళీ చేస్తానని పేచీ

ఆ మొత్తం ఇచ్చినా కదలలేదు

ఉన్నతాధికారులకు సమాచారం చేరేలా ఉందని తెలిసి ఎట్టకేలకు రూమ్‌ ఖాళీ చేసిన వైనం 


(విశాఖపట్నం-ఆంఽధ్రజ్యోతి)


ఆయనో పోలీస్‌ అధికారి. ఇటీవలే బదిలీపై నగరానికి వచ్చారు. అప్పుడే రుబాబు ప్రారంభించేశారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్తులో ఆయన తీరు ఎలా వుంటుందోనని ఆ విభాగం సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.

నగర పోలీస్‌ కమిషనరేట్‌లోని కీలక విభాగంలో  ఇటీవల ఒక అధికారి నియమితులయ్యారు. ఈనెల 12న గత అధికారి నుంచి బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన బాధ్యతలు స్వీకరించడానికి ముందురోజు నగరానికి వచ్చిన ఆయన...కమిషనరేట్‌కు సమీపంలోని ఒక హోటల్‌లో దిగారు. పోలీస్‌ అధికారి కావడంతో ఒకటి, రెండు రోజుల్లో ఖాళీ చేసేస్తారని ఆ విభాగం సిబ్బంది చెప్పడంతో నిర్వాహకులు కాంప్లిమెంటరీగా ఒక గదిని ఆయనకు కేటాయించారు. ఆయన దిగిన తర్వాత మూడో రోజు కూడా గది ఖాళీ చేయకపోవడంతో హోటల్‌ సిబ్బంది ఆయన వద్దకు వెళ్లి నెమ్మదిగా విషయం ప్రస్తావించారు. దీంతో ఒంటికాలుపై లేచిన సదరు అధికారి తన గదిలో రూ.16 వేలు చోరీ అయ్యాయంటూ ఎదురుతిరిగారు. ఆ డబ్బు ఇస్తేనే తాను రూమ్‌ ఖాళీ చేస్తానని మెలిక పెట్టారు. దీంతో చేసేదేమీ లేకపోవడంతో ఆ మొత్తాన్ని హోటల్‌ నిర్వాహకులు సమర్పించుకున్నారు. అయినా ఆయన రూమ్‌ ఖాళీ చేయలేదు. రూమ్‌ ఖాళీ చేయాలని మళ్లీ ఒత్తిడి చేస్తే ఇంకేమైనా ఇబ్బందిపెడతారేమోననే భయంతో నోరు మెదపకుండా ఉండిపోయారు. సదరు హోటల్‌ మేనేజర్‌ తనకు తెలిసిన పోలీస్‌ అధికారులకు తన గోడు వెళ్లబోసుకున్నారు. నగరానికి కొత్తగా వచ్చిన అధికారి ఇలా వ్యవహరిస్తుండడం పోలీస్‌ అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. అయితే ఈ విషయం పోలీస్‌ శాఖలో చాలామందికి తెలిసిపోయిందని కొంతమంది సిబ్బంది సదరు అధికారి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆదివారం హడావిడిగా రూమ్‌ను ఖాళీ చేసినట్టు తెలిసింది. 

Updated Date - 2022-05-17T06:44:56+05:30 IST