బూటు కాలితో తన్ని.. కాళ్లతో తొక్కి..

ABN , First Publish Date - 2021-11-09T17:27:09+05:30 IST

బూటు కాలితో తన్ని..

బూటు కాలితో తన్ని.. కాళ్లతో తొక్కి..

కొవిడ్‌ వారియర్స్‌పై పోలీసుల జులుం


ఏలూరు రూరల్‌: కొవిడ్‌ సమయంలో బాధితులకు అండగా నిలబడ్డారు. ప్రాణాలకు సైతం తెగించి విధులు నిర్వర్తించారు. అంతటి కష్టంలోనూ డ్యూటీ చేసిన వారికి నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. దీంతో ఆందోళన బాట పట్టిన కొవిడ్‌ వారియర్స్‌పై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. బూటు కాళ్లతో తన్ని, కాళ్లతో తొక్కి ఇష్టమొచ్చినట్టు చావబాదారు. ఇది అన్యాయమని ప్రశ్నించిన వారిని కాలర్‌ పట్టుకుని ఈడ్చుకెళ్లి వ్యాన్‌లోకి ఎక్కించారు. ఏలూరు కలెక్టరేట్‌ వద్ద సోమవారం ఈ దారుణం చోటుచేసుకుంది. నాలుగు నెలలుగా బకాయిపడిన జీతాలు వెంటనే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పనిచేసిన ఉద్యోగులు కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.


ఈ సందర్భంగా సీఐటీయూ యూనియన్‌ నాయకుడు బి.సోమయ్య మాట్లాడుతూ.. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహించిన ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుమారు వంద మందికిపైగా విధులు నిర్వహించారని, వారికి ఇంతవరకు జీతాలు చెల్లించలేదని అన్నారు. విధుల నుంచి తొలగించిన వారిని వెంటనే ఉద్యోగంలోకి తీసుకుని, బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు పోలీసులను కోరారు. కానీ వారు అనుమతించక పోవడంతో కొవిడ్‌ ఉద్యోగులంతా ఒక్కసారిగా పోలీసులను, బారికేడ్లను తోసుకుంటూ కలెక్టరేట్‌ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహం వద్దకు చేరుకున్నారు.


తమ సమస్యలు పరిష్కరించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. పోలీసులు వారిని అక్కడినుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. తమ సమస్య పరిష్కారమయ్యే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు లాఠీకి పనిచెప్పి ఉద్యోగులను దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. ఈడ్చుకుంటూ తీసువెళ్లి పోలీసు వ్యాన్‌లో పడేశారు. మహిళలను సైతం ఈడ్చుకెళ్లి వ్యాన్‌ ఎక్కించారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపి ఉద్యోగులను బూటు కాళ్లతో తన్నారు. కాళ్లతో తొక్కి జులుం ప్రదర్శించారు. 50 మందిని అరెస్టు చేసి త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2021-11-09T17:27:09+05:30 IST